ANR చెప్పినా వినకుండా NTRతో తీశారు.. భారీ అట్టర్ ఫ్లాప్
ABN, First Publish Date - 2021-12-23T02:32:27+05:30
తన సహనటి భానుమతి సొంత చిత్ర నిర్మాణ సంస్థ భరణీ పిక్చర్స్ నిర్మించిన మూడు చిత్రాల్లో ఎన్టీఆర్ నటించారు. అవి ‘చండీరాణి’, ‘చింతామణి’, ‘అమ్మాయి పెళ్లి’. వీటిల్లో భానుమతి భర్త రామకృష్ణారావు స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘చింతామణి’ చిత్రంలో బిల్వమంగళుడి పాత్రకు..
తన సహనటి భానుమతి సొంత చిత్ర నిర్మాణ సంస్థ భరణీ పిక్చర్స్ నిర్మించిన మూడు చిత్రాల్లో ఎన్టీఆర్ నటించారు. అవి ‘చండీరాణి’, ‘చింతామణి’, ‘అమ్మాయి పెళ్లి’. వీటిల్లో భానుమతి భర్త రామకృష్ణారావు స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘చింతామణి’ చిత్రంలో బిల్వమంగళుడి పాత్రకు మొదట అక్కినేని నాగేశ్వరరావును అనుకున్నారు. ఆయన ఆ పాత్ర చేయననడమే కాకుండా భరణీ సంస్థ తీయదగ్గ చిత్రం కాదు కనుక ఆ చిత్రనిర్మాణాన్ని మానుకోమని సలహా ఇచ్చారు. అయితే ఆ సినిమాకు సంబంధించిన స్ర్కిప్ట్ వర్క్ అప్పటికే పూర్తి కావడంతో వెనక్కి తగ్గలేక ముందడుగు వేశారు భానుమతి, రామకృష్ణ. ‘చండీరాణి’ సినిమాలో నటించిన ఎన్టీఆర్‌ను హీరోగా, భవానీశంకరం పాత్రకు ఎస్వీ రంగారావునీ, సుబ్బిశెట్టి పాత్రకు రేలంగిని తీసుకుని షూటింగ్ ప్రారంభించారు. భానుమతి ‘చింతామణి’ పాత్ర పోషిస్తుండడంతో ఆమె ఇమేజ్‌కు భంగం కలగకూడదని ఆ పాత్రను ఓ భక్తురాలిగా మలిచారు. ట్రీట్‌మెంట్ కూడా చవకబారుగా లేకుండా గంభీరంగా వచ్చేలా జాగ్రత్త వహించారు. దాంతో ‘చింతామణి’ కోసం ఎంతో ఆశగా ఎదురుచూసిన ప్రేక్షకులు సినిమా చూసి నిరాశ చెందారు.
ఈ సినిమా మాస్‌ను ఆకట్టుకోకపోవడానికి మరో కారణం కూడా ఉంది. కాళ్లకూరి నారాయణరావు రాసిన ‘చింతామణి’ నాటకాన్ని యథాతథంగా సినిమాగా తీసినా, ప్రభుత్వ ఆంక్షల కారణంగా చింతామణి, సుబ్బిశెట్టి సంభాషించుకునే సన్నివేశాలను సెన్సార్ కత్తిరించింది. వినోదం పాలు తక్కువైందని అభిప్రాయంతో సుబ్బిశెట్టికి, అతని భార్యకు మధ్య కొన్ని హాస్య సన్నివేశాలు చిత్రీకరించారు దర్శకుడు రామకృష్ణ. ఆ సన్నివేశాలను కూడా సెన్సార్ తొలగించడంతో చివరికి ‘భక్త చింతామణి’గా చిత్రం తయారైంది.
- వినాయకరావు