నారాయణమూర్తి ఆవేదన!
ABN, First Publish Date - 2021-07-16T09:01:19+05:30
ఇంటి అద్దె కూడా కట్టలేని దీనస్థితిలో ఉన్నానంటూ సోషల్ మీడియాలో తనపై వస్తున్న కథనాలను నటుడు, దర్శకనిర్మాత ఆర్.నారాయణమూర్తి ఖండించారు....
ఇంటి అద్దె కూడా కట్టలేని దీనస్థితిలో ఉన్నానంటూ సోషల్ మీడియాలో తనపై వస్తున్న కథనాలను నటుడు, దర్శకనిర్మాత ఆర్.నారాయణమూర్తి ఖండించారు. ఇటీవల ‘రైతన్న’ చిత్రం ప్రెస్‌మీట్‌లో ప్రజా గాయకుడు గద్దర్ చెప్పిన మాటల్ని వక్రీకరించారంటూ గురువారం విడుదల చేసిన వీడియోలో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పల్లెటూరి వాతావరణంలో ఉండడం తనకు ఇష్టం కనుక సిటీకి దూరంగా ఉంటున్నాననీ, అంతే తప్ప అద్దె కట్ట లేకపోవడం కారణం కాదనీ ఆయన చెప్పారు. ఆటోలో రాకపోకలకు ప్రతి నెలా రూ. 30 వేలు ఖర్చు పెడుతున్నాననీ ఆయన తెలిపారు. ‘సోషల్ మీడియాలో ఇలా అవాస్తవాలు రాయడం వల్ల నా మనసుకు బాధ కలిగింది. అది చూసి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు ఆర్ధిక సహాయం చేస్తామంటూ ఫోన్లు చేస్తుంటే కళ్ల వెంబడి నీళ్లు వస్తున్నాయి. అంత దుర్భర పరిస్థితిలో నేను లేను. ఒకప్పుడు కోట్లాది రూపాయలు సంపాదించా. నా వరకూ సరిపడా దాచుకున్నా. మిగతాది సేవా కార్యక్రమాలకు ఇచ్చేశా’ అని వివరించారు నారాయణమూర్తి.