ఎంతమంది చూశారనేది ముఖ్యం!
ABN, First Publish Date - 2021-09-14T06:33:59+05:30
‘‘ప్రస్తుత కాలంలో థియేట్రికల్ బాక్సాఫీస్ వసూళ్లతో విజయాన్ని కొలవలేం! పెట్టుబడి తిరిగొస్తే... విజయం సాధించినట్టే లెక్క. నాన్-థియేట్రికల్ హక్కులతో ‘తలైవి’ పెట్టుబడి తిరిగి రావడమే కాదు...
‘‘ప్రస్తుత కాలంలో థియేట్రికల్ బాక్సాఫీస్ వసూళ్లతో విజయాన్ని కొలవలేం! పెట్టుబడి తిరిగొస్తే... విజయం సాధించినట్టే లెక్క. నాన్-థియేట్రికల్ హక్కులతో ‘తలైవి’ పెట్టుబడి తిరిగి రావడమే కాదు... మాకు లాభాలొచ్చాయి. థియేటర్లలో వసూళ్లు మాకు బోనస్. ఇంకొకటి... సినిమా ఎంతమంది చూశారనేది ముఖ్యం. దేశవ్యాప్తంగా మల్టీప్లెక్స్ ఫ్రాంచైజీలు మా సినిమాను ప్రదర్శించలేదు. ప్రేక్షకులు సింగిల్ స్ర్కీన్స్‌లో చూశారు. మల్టీప్లెక్స్ టికెట్ రేట్‌తో పోలిస్తే... సింగిల్ స్ర్కీన్స్‌లో రేట్ తక్కువ కాబట్టి వసూళ్లు ఆశాజనకంగా లేవేమో! కానీ, ఎక్కువమంది మా సినిమా చూశారు’’ అని విష్ణువర్థన్ ఇందూరి అన్నారు. బృందా ప్రసాద్, శైలేష్ ఆర్. సింగ్‌తో కలిసి ఆయన నిర్మించిన ‘తలైవి’ గత శుక్రవారం విడుదలైంది. సినిమాకు ప్రేక్షకాదరణ బావుందని ఆయన తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘మాకు ‘తలైవి’తో ప్రశంసలు, విడుదలకు ముందే లాభాలు వచ్చాయి. నేరుగా ఓటీటీలో విడుదల చేస్తే ఇంకా ఎక్కువ లాభాలు వచ్చేవి. కానీ, థియేటర్లలో విడుదల చేయాలని నిశ్చయించుకున్నా. అయితే, విడుదలైన రెండు వారాల్లో ఓటీటీల్లోకి వస్తుందని మల్టీప్లెక్స్‌లు సినిమాను ప్రదర్శించలేదు. కొంతమంది ప్రేక్షకులకు ఈ సంగతి తెలియడమూ మాకు మైనస్. అయితే, నిర్మాతగా నా నిర్ణయానికి చిత్రబృందమంతా మద్దతు పలికింది. రెండు కరోనా దశలను తట్టుకుని... ఈ సమయంలో సినిమా తీయడం, విడుదల చేయడం కష్టం. జయలలిత జీవితంలో ఎన్ని కష్టాలున్నాయో? మేమూ అన్ని కష్టాలు పడ్డాం. సినిమా విడుదలకు ముందు జయలలిత పాత్రకు కంగనా రనౌత్‌ను తీసుకోవడంపై కొందరు విమర్శలు చేశారు. సినిమా చూసి వాళ్లే ప్రశంసిస్తున్నారు. జయలలితను గొప్పగా చూపించడం కోసం మరొకర్ని తక్కువ చేయాల్సిన అవసరం లేదు. పరిస్థితుల వల్ల కరుణానిధి, ఎంజీఆర్-జయలలిత రాజకీయ ప్రత్యర్థులుగా మారారు. దాన్నే సినిమాలో చూపించాం. కొంతమంది జయలలిత ముఖ్యమంత్రి అయిన తర్వాత కథను సినిమాగా తీస్తారా? అని అడుగుతున్నారు. మాకు ఆ ఉద్దేశం లేదు. ప్రస్తుతం సోషల్ మీడియా నేపథ్యంలో ‘ట్రెండింగ్’ అని ఓ సినిమా చేస్తున్నాం. కనుమరుగైన సమరయోధుల కథలు చెప్పాలని ‘అజాద్ హింద్’ ఫ్రాంచైజీ ప్రకటించాం. అభిమన్యు సింగ్ పాకిస్తాన్ చేతికి చిక్కిన తర్వాత 48 గంటల్లో వెనక్కి తీసుకురావడానికి ప్రధానమంత్రి కార్యాలయం ఏం చేసింది? అనే కథతో ఓ ఛాంబర్ డ్రామా ప్లాన్ చేస్తున్నాం’’ అని అన్నారు. ప్రేక్షకులందరిలా తానూ ‘83’ బయోపిక్ విడుదల కోసం ఎదురు చూస్తున్నానని, సరైన సమయంలో విడుదల చేస్తామని విష్ణువర్థన్ ఇందూరి చెప్పారు.