నా తల్లి పాత్రలో భూమిక నటించారు
ABN, First Publish Date - 2021-08-11T06:22:41+05:30
‘‘ఇది ప్రేమకథ మాత్రమే కాదు... ప్రేమ గురించి చెప్పే కథతో తీసిన సినిమా. ఇందులో బలమైన తల్లి సెంటిమెంట్ ఉంది. నా తల్లి పాత్రలో భూమిక నటించారు...
‘‘ఇది ప్రేమకథ మాత్రమే కాదు... ప్రేమ గురించి చెప్పే కథతో తీసిన సినిమా. ఇందులో బలమైన తల్లి సెంటిమెంట్ ఉంది. నా తల్లి పాత్రలో భూమిక నటించారు. ప్రచార చిత్రాల్లో కనిపించమని మరో కథానాయిక ఎవరో తెలుసుకోవాలంటే సినిమా చూడాలి’’ అన్నారు విష్వక్ సేన్. ఆయన హీరోగా నటించిన ‘పాగల్’ శనివారం విడుదలవుతోంది. విశ్వక్ తండ్రి, ‘ఫలక్‌నుమా దాస్’ నిర్మాత రాజు ట్రైలర్ విడుదల చేశారు. ఈ చిత్రనిర్మాత బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ ‘‘ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు బెంగళూరు, చెన్నై, అమెరికాలో ఈ 14న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. ‘దిల్’ రాజుగారు ఇచ్చిన ధైర్యంతో రిస్క్ అయినా థియేటర్లలో విడుదల చేస్తున్నాం. విష్వక్ సేన్, హీరోయిన్లు ఎంతో మద్దతు ఇచ్చారు’’ అని చెప్పారు. ‘‘విష్వక్ నాలుగేళ్ల కష్టం ఈ సినిమా. మదర్ సెంటిమెంట్‌తో వస్తోంది’’ అని రాజు అన్నారు. ‘‘నాపై నమ్మకంతో బెక్కం వేణుగోపాల్‌గారు రెండు రూపాయలు రిస్క్ చేద్దామంటే... ‘దిల్’రాజు గారు నాలుగు రూపాయలు రిస్క్ చేశారు. టికెట్ ధరల విషయంలో, ఇతర సమస్యలు ఉన్నా రిస్క్ చేసి థియేటర్లలో విడుదల చేస్తున్నాం’’ అని విష్వక్ సేన్ తెలిపారు. ‘‘ఇంట్లో పూజగది ఉన్నా... గుడికి వెళితే వచ్చే అనుభూతి వేరు. అలాగే, థియేటర్లకు వెళ్లి సినిమా చూస్తే వచ్చే అనుభూతి వేరు. అందరూ మాస్క్‌లు ధరించి, జాగ్రత్తలు తీసుకుంటూ సినిమా చూడండి’’ అని సిమ్రాన్ చౌదరి చెప్పారు. ఈ కార్యక్రమంలో నివేదా పేతురాజ్, మేఘలేఖ పాల్గొన్నారు.