బాపు ‘వంశవృక్షం’కు 40 ఏళ్ళు
ABN, First Publish Date - 2020-11-20T02:25:56+05:30
బాపు దర్శకత్వంలో తెరకెక్కిన 'వంశవృక్షం' చిత్రం నవంబర్ 20తో 40 ఏళ్ళు పూర్తి చేసుకుంటోంది. ఈ సందర్భంగా ఆ చిత్ర విశేషాలను గుర్తు చేసుకుందాం. బాపు దర్శకత్వంలో
బాపు దర్శకత్వంలో తెరకెక్కిన 'వంశవృక్షం' చిత్రం నవంబర్ 20తో 40 ఏళ్ళు పూర్తి చేసుకుంటోంది. ఈ సందర్భంగా ఆ చిత్ర విశేషాలను గుర్తు చేసుకుందాం. బాపు దర్శకత్వంలో పలు కన్నడ చిత్రాలు రీమేక్స్ అయి విజయం సాధించాయి. అలాంటి వాటిలో 'మనవూరి పాండవులు' ఒకటి. ఆ సినిమా తరువాత బాపు తెరకెక్కించిన చిత్రాలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ఆ సమయంలో బాపు కన్నడంలో విమర్శకుల ప్రశంసలు పొందిన 'వంశవృక్ష' చిత్రం ఆధారంగా తెలుగులో 'వంశవృక్షం' రూపొందించారు. 1980లోనే 'శంకరాభరణం' విడుదలై విజయఢంకా మోగిస్తున్న సమయం కాబట్టి, అందులో నటించిన జె.వి. సోమయాజులు 'వంశవృక్షం'లో కీలక పాత్రకు ఎంచుకున్నారు. సోమయాజులు నటించడం వల్ల 'వంశవృక్షం'కు క్రేజ్ వచ్చిన మాట వాస్తవమే. కానీ, 'వంశవృక్షం' జనాన్ని ఆకట్టుకోలేకపోయింది. అయితే ఛాందసభావాలపై 'వంశవృక్షం' తిరుగుబాటు బావుటా ఎగురవేసింది. అందుకే ఈ కథాంశం ఎందరినో ఆలోచింప చేసిందని చెప్పవచ్చు.
కన్నడలో 'వంశవృక్ష' చిత్రంలో ఓ పాత్ర పోషించి కన్నడ స్టార్ హీరో విష్ణువర్ధన్ చిత్రసీమలో అడుగు పెట్టారు. తెలుగులో రూపొందిన 'వంశవృక్షం'లో కీలక పాత్ర ధరించి ప్రముఖ హిందీ నటుడు అనిల్ కపూర్ సినిమా రంగానికి పరిచయం కావడం విశేషం. అయితే అందులో విష్ణు వర్ధన్ పాత్ర, తెలుగులో అనిల్ కపూర్ పాత్ర ఒకటి కావు. 'వంశవృక్షం' చిత్రానికి కేవీ మహదేవన్ సంగీతం ఓ ఎస్సెట్ గా నిలచింది.