‘జాంబి రెడ్డి’ మూవీ రివ్యూ

ABN , First Publish Date - 2021-02-05T19:05:45+05:30 IST

కోవిడ్ నేప‌థ్యంలో మూతప‌డ్డ థియేట‌ర్స్‌కు ఫిబ్ర‌వ‌రి 1 నుంచి వంద శాతం ఆక్యుపెన్సీకి ప‌ర్మిష‌న్స్ దొరికాయి.

‘జాంబి రెడ్డి’ మూవీ రివ్యూ

బ్యాన‌ర్‌: యాపిల్ ట్రీ స్టూడియోస్‌

న‌టీన‌టులు:  తేజ స‌జ్జ‌, ద‌క్షా న‌గార్క‌ర్, ఆనంది, పృథ్వీ, ర‌ఘుబాబు, హ‌రితేజ‌, హ‌ర్ష వ‌ర్ధ‌న్‌, విన‌య్ వ‌ర్మ‌, విజ‌య రంగ‌రాజు, కారుమంచి ర‌ఘు త‌దిత‌రులు

మ్యూజిక్‌: మార్క్ కె. రాబిన్‌

సినిమాటోగ్ర‌ఫీ: అనిత్‌

ఎడిటింగ్‌: సాయిబాబు

ప్రొడ‌క్ష‌న్ డిజైన్‌: శ్రీ‌నాగేంద్ర తంగ‌ల‌

స్క్రీన్‌ప్లే: స‌్క్రిప్ట్స్‌విల్

నిర్మాత‌: రాజ్‌శేఖ‌ర్ వ‌ర్మ‌

ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వం: ప్ర‌శాంత్ వ‌ర్మ‌


కోవిడ్ నేప‌థ్యంలో మూతప‌డ్డ థియేట‌ర్స్‌కు ఫిబ్ర‌వ‌రి 1 నుంచి వంద శాతం ఆక్యుపెన్సీకి ప‌ర్మిష‌న్స్ దొరికాయి. దీంతో థియేట‌ర్స్‌లో సంద‌డి చేయ‌డానికి వ‌రుస సినిమాలు క్యూ క‌డుతున్నాయి. ఈ క్ర‌మంలో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సినిమా ‘జాంబి రెడ్డి’. జాతీయ అవార్డు పొందిన 'అ!' చిత్ర‌ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మ తెర‌కెక్కించిన మూడో చిత్ర‌మిది. అరుదుగా తెర‌కెక్కే జాంబి జోన‌ర్‌లో రూపొందిన ఈ సినిమాతో తేజ స‌జ్జ హీరోగా ప‌రిచయం అయ్యాడు. మ‌రి హీరో తేజ స‌జ్జ‌కి, డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ వ‌ర్మ‌కు సినిమా ఏ మేర‌కు క‌లిసొచ్చిందో తెలుసుకోవాలంటే  ముందు క‌థేంటో చూద్దాం...


కథ:

హైదరాబాద్‌లో ఉండ మారియొ అలియాస్‌ మర్రిపాలు ఓబుల్‌ రెడ్డి(తేజ సజ్జ) గేమ్‌ డిజైనర్‌. తన స్నేహితులు (దక్షా నగార్కర్‌, కిరిటీ, హేమంత్‌)లతో కలిసి ఓ గేమ్‌ డిజైన్‌ చేస్తాడు. తండ్రికి మారియొ చేసే పనులు నచ్చవు. అయితే మారియొ డిజైన్‌ చేసిన గేమ్‌కు మంచి ఆదరణ దక్కుతున్న సమయంలో ప్రోగ్రామింగ్‌లో ఎర్రర్‌ వస్తుంది. దాన్ని క్లియర్‌ చేయాల్సిన స్నేహితుడు కిరణ(హేమంత్‌) కర్నూలులోని రుద్రవరంలో పెళ్లి చేసుకోవడానికి వెళ్లిపోతాడు. కిరణ మామ భూమారెడ్డి(వినయ్‌ వర్మ) పెద్ద ఫ్యాక్షనిస్ట్‌. అతనికి వీరారెడ్డితో గొడవలు ఉంటాయి. గేమ్‌లో వచ్చిన సమస్యను క్లియర్‌ చేసుకోవడానికి మారియొ ఇతర స్నేహితులతో కలిసి రుద్రవరం వస్తాడు. అదే సమయంలో భూమారెడ్డి రైట్‌ హ్యాండ్‌ బుక్కా రెడ్డి కూతురు నందినీ రెడ్డి(ఆనంది) ఆ పెళ్లిలో జాయిన్‌ అవుతుంది. మారియొకి ఆమెపై అనుమానం వస్తుంది. అయితే తను కొన్ని పరిస్థితుల్లో తను లాక్‌ అయిపోతాడు. అదే సమయంలో రుద్రవరం సమీపంలో కరోనా వైరస్‌కు విరుగుడుపై చేసే ప్రయోగాల వల్ల మనుషులు జాంబీలుగా మారిపోతారు. చివరకు క్రమంగా రుద్రవరం సహా పక్కనున్న గ్రామంలోని ప్రజలు.. జాంబీలుగా మారిపోతారు. వారి నుంచి మారియొ అతని స్నేహితులు ఎలా తప్పించుకుంటారు?  జాంబీలకు విరుగుడు దొరికిందా?  నందినీ రెడ్డి ఎవరు?  చివరకు కథ ఎలాంటి మలుపులు తీసుకుంది? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. 



విశ్లేషణ:

అ!, కల్కి సినిమాలను తెరకెక్కించిన డైరెక్టర్ ప్రశాంత్‌ వర్మ జాంబి జోనర్‌కు, కరోనా వైరస్‌కు లింకు పెడుతూ కథను తయారు చేసుకున్నాడు. పూర్తిస్థాయి జాంబి జోనర్‌లో వచ్చిన తెలుగు సినిమా జాంబి రెడ్డి. సాధారణంగా ఫ్యాక్షన్‌ ఏరియాల్లో జాంబిలు వస్తే.. ఎలాంటి ఉంటుంది అనే కోణంలో ప్రశాంత్‌ వర్మ కథను రాసుకున్నాడు. దానికి కాస్త కామెడీ టచ్‌ ఇచ్చాడు.అసలు కథలోకి ప్రేక్షకులను తీసుకెళ్లడానికి ఫస్టాఫ్‌ను సాగదీసినట్లు అనిపిస్తుంది.  అయితే కథలో లాజిక్స్‌ మిస్సయ్యాడు. ఉదాహరణకు కిరిటీ వల్ల జాంబిగా మారిన పనిమనిషి బిడ్డకు పాలు ఇచ్చే సమయంలో మామూలుగా ప్రవర్తిస్తుంటుంది. అలాగే కథలో ప్రయోగం చేసే సైంటిస్ట్‌ కథలోని శివుడు గుడికి లింకు పెట్టి ఆగుడిలో నీళ్లు తాగితే జాంబి ప్రభావం తగ్గుతుందని చూపించాడు. దీనికి సినిమాలోని మొదటి సన్నివేశాన్ని లింకు పెడుతూ చూపించాడు. సినిమా కదా! అని సరేననుకోవాలంతే. మార్క్‌ కె.రాబిన్ సంగీతంలో సిట్యువేషన్‌ సాంగ్‌ మినహా మరేదీ సినిమాలో కనిపించదు. నేపథ్య సంగీతం బావుంది. అనిత్‌ సినిమాటోగ్రఫీ ఓకే. 


ఇక నటీనటుల విషయానికి వస్తే తేజ సజ్జ నేటి తరం కుర్రాడిగా, గేమ్‌ డిజైనర్‌గా చక్కగా పాత్రలో ఒదిగిపోయాడు. అతని స్నేహితులుగా చేసిన కిరిటీ, హేమంత్‌, దక్షా నగార్కర్‌ వారి వారి పాత్రల్లో ఓకే అనిపించారు. దక్కా నగార్కర్‌కు మరి మొబైల్‌లో మునిగిపోయే అమ్మాయి పాత్రలో కనిపించింది. ఈ పాత్రలో నటించడం ఆమెకు ఎంత మాత్రం పనికొస్తుందో తెలియదు. ఇక ప్రత్యర్థి ఫ్యాక్షనిస్ట్‌ కూతురుగా నటించిన ఆనంది.. సినిమాలో మెయిన్‌ హీరోయిన్‌గా మారింది. పాత్ర పరంగా ఆమె నటన బావుంది. ఇక పృథ్వీ, గెటప్‌ శీను, హర్షవర్ధన్‌, హరితేజ తదితరులు పాత్రలకు న్యాయం చేశారు. కొన్ని సన్నివేశాల్లో కామెడీతో మెప్పించే ప్రయత్నం చేసినా పెద్దగా కామెడీ పండలేదు. జాంబి జోనర్‌లో పూర్తిస్థాయి సినిమా ఇప్పటి వరకు రాలేదు కదా .. ఎలా ఉంటుందో చూద్దాం అని అనుకునేవారు సినిమాను ఓ సారి చూడొచ్చు. 


బోటమ్‌ లైన్‌:  జాంబి రెడ్డి.. లాజిక్స్‌ మిస్సయ్యాడు

Updated Date - 2021-02-05T19:05:45+05:30 IST