11 ఒరిజినల్ వెబ్ సిరీస్‌లకు ZEE5 శ్రీకారం
ABN , First Publish Date - 2022-06-16T02:21:48+05:30 IST
తెలుగు, ఇంగ్లీష్, హిందీ, బెంగాలీ, మలయాళం, తమిళం, కన్నడ, మరాఠీ, ఒరియా, భోజ్‌పురి, గుజరాతీ మరియు పంజాబీ వంటి 12 భారతీయ భాషల్లో కంటెంట్ అందిస్తూ.. ఓటీటీ రంగంలో అగ్రగామి సంస్థగా దూసుకుపోతుంది జీ5. ఈ సంస్థ తాజాగా..

తెలుగు, ఇంగ్లీష్, హిందీ, బెంగాలీ, మలయాళం, తమిళం, కన్నడ, మరాఠీ, ఒరియా, భోజ్‌పురి, గుజరాతీ మరియు పంజాబీ వంటి 12 భారతీయ భాషల్లో కంటెంట్ అందిస్తూ.. ఓటీటీ రంగంలో అగ్రగామి సంస్థగా దూసుకుపోతుంది జీ5. ఈ సంస్థ తాజాగా స్టార్-స్టడెడ్ ఈవెంట్ ‘హుక్డ్’ పేరుతో ఓ ఈవెంట్‌ని నిర్వహించింది. ఈ వేడుకలో 2022లో 11 ఒరిజినల్ వెబ్ సిరీస్‌లను జీ5 వీక్షకులకు అందించబోతున్నట్లుగా తెలుపుతూ.. వాటి వివరాలను కూడా వెల్లడించింది. పవర్-ప్యాక్డ్ కంటెంట్‌తో రాబోతున్న 11 ఒరిజినల్స్‌ను.. తెలుగు చిత్ర సీమకు చెందిన హరీష్ శంకర్, ప్రవీణ్ సత్తారు, శరత్ మరార్, కోన వెంకట, నిహారిక, సుస్మిత కొణిదెల, సుశాంత్, ఆది సాయి కుమార్, రాజ్ తరుణ్ వంటి తెలుగు సినీ ప్రముఖుల సమక్షంలో.. జీ 5 గ్రాండ్‌గా లాంచ్ చేసింది.
ఈ 11 ఒరిజినల్స్‌కు సంబంధించిన వివరాలు:
1. ఏటీఎమ్ (ATM)
వీజే సన్నీ, దివి తదితరులు నటించిన ఈ వెబ్ సిరీస్‌ను దిల్ రాజు, హరీష్ శంకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సి. చంద్రమోహన్ దర్శకుడు.
2. హలో వరల్డ్! Hello World
‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ వెబ్ సిరీస్ తర్వాత పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పతాకంపై నిహారిక ఈ వెబ్ సిరీస్‌ను నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌లోని ప్రముఖ ఐటీ రంగంలో తమ కెరీర్‌లో దూసుకుపోతున్న యువకుల జీవితం మరియు ప్రయత్నాల ఆధారంగా రూపొందిన కథతో ఈ వెబ్ సిరీస్ చిత్రీకరిస్తున్నారు.
3. మా నీళ్ల ట్యాంక్ (Maa Neella Tank)
నెల్లూరు జిల్లాలోని ఒక చిన్న గ్రామంలో జరిగిన సంఘటనలతో ఈ రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్‌ను చిత్రీకరించారు. ఈ వెబ్ సిరీస్‌తో హీరో సుశాంత్.. ఓటీటీకి పరిచయం అవుతున్నారు. సుశాంత్ సరసన ప్రియా ఆనంద్ నటిస్తోంది.
4. హంటింగ్ ఆఫ్ ద స్టార్స్ (Hunting of the Stars)
హైదరాబాద్‌లో హై ఫ్రొఫైల్ కలిగిన పోలీసుల హత్యల నేపథ్యంలో సాగే సిరీస్ ఇది. ఈ హత్యలు చేసే సీరియల్ కిల్లర్ వెనుక షాకిచ్చే కారణాలతో ఈ వెబ్ సిరీస్‌ని కోన వెంకట్ రూపొందిస్తున్నారు. ఆది సాయికుమార్, లావణ్య త్రిపాఠి ఇందులో ప్రధాన తారాగణం.
5. మిషన్ తషాఫీ (Mission Tashaffi)
ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో గూఢచారి డ్రామాగా ఈ వెబ్ సిరీస్ రాబోతోంది.
6. ప్రేమ విమానం (Prema Vimanam)
చిన్న పల్లెటూరికి చెందిన ఇద్దరు యువకులు.. తమ మొదటి విమానయానంకు సంబంధించిన కథతో ఈ వెబ్ సిరీస్ రూపొందింది. అభిషేక్ నామా, సంతోష్ ఈ సిరీస్‌ని నిర్మించగా.. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.
7. పరువు (Paruvu)
పరువు హత్యలకు వ్యతిరేకంగా ఈ వెబ్ సిరీస్‌ను గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సుస్మిత కొణిదెల రూపొందించారు. నరేష్ ఆగస్త్య, నివేతా పేతురాజ్, నాగబాబు వంటి వారు ఇందులో నటించారు.
8. ద బ్లాక్ కోట్ (The Black Coat)
లాయర్లు, న్యాయస్థానం నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్ రూపొందింది. ఆనంద్ రంగా రూపొందిస్తున్నారు.
9. ‘అహ నా పెళ్లంట’ (Aha Naa Pellanta)
పెళ్లి నేపథ్యంలో హాస్య భరితంగా రూపొందిన ఈ వెబ్ సిరీస్‌లో హీరో రాజ్ తరుణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. జీవిత భాగస్వామిని కనుగొనడంలో ఒక వ్యక్తి చేసిన విఫల ప్రయత్నానికి సంబంధించిన సరదా రొమాంటిక్ షో ఇది.
10. బహిష్కరణ (Bahishkarana)
అధికార దాహంతో ఉండే సర్పంచ్, అతని ఉంపుడుగత్తె, సర్పంచ్ అనుచరులతో వచ్చే చిక్కుల నుండి ఓ స్త్రీ ఎలా బయటపడింది? అనే నేపథ్యంలో ఈ సిరీస్ రూపొందుతోంది. హీరోయిన్ అంజలి ప్రధానపాత్రలో నటిస్తున్నారు.
11. రెక్కీ (Recce)
శివ బాలాజీ, శ్రీరామ్, ధన్య బాలకృష్ణ, రాజేశ్వరి నాయర్, ఈస్టర్ నొరోన్హా వంటివారు నటించిన నోవెల్ థ్రిల్లర్ ఇది. జూన్ 17 నుండి ప్రసారానికి రెడీ అవుతోంది. తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ హత్య చుట్టూ తిరిగే ఉత్కంఠభరితమైన డ్రామా ఇది.
