జిల్లాల పేర్లే కాదు.. భారతరత్న కూడా ఇవ్వాలి: వైవిఎస్‌ చౌదరి

ABN , First Publish Date - 2022-01-27T19:25:54+05:30 IST

‘‘ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ‘ఎన్టీఆర్‌’ పేరుతో కొత్త జిల్లా ఏర్పాటుపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాను’’ అని దర్శకనిర్మాత వై.విఎస్‌ చౌదరి అన్నారు. ఈ మేరకు ఆయన ప్రకటన విడుదల చేశారు.

జిల్లాల పేర్లే కాదు.. భారతరత్న కూడా ఇవ్వాలి: వైవిఎస్‌ చౌదరి

‘‘ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ‘ఎన్టీఆర్‌’ పేరుతో కొత్త జిల్లా ఏర్పాటుపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాను’’ అని  దర్శకనిర్మాత వై.విఎస్‌ చౌదరి అన్నారు. ఈ మేరకు ఆయన ప్రకటన విడుదల చేశారు. 

‘‘మహానుభావులు తమ జీవన విధానాల ద్వారా తమ ఆశయాల సాధన ద్వారా మనలో మహత్తరమైన స్ఫూర్తిని నింపి వెళ్తుంటారు. అటువంటి మహనీయుల్లో విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, తెలుగు వారంతా అభిమానంగా పిలుచుకునే ‘అన్న’ స్వర్గీయ నందమూరి తారకరామారావుగారు. ఆయన తన కంఠంతో తెలుగు భాషకి విన్నూత్న ఒంపులు దిద్దారు. జానపద, చారిత్రాత్మక పౌరాణిక, సాంఘిక చిత్రాల్లో ఆయన పోషించిన పాత్రల ద్వారా తెలుగు సినిమాను విశ్వవిఖ్యాతం చేశారు. ఆత్మగౌరవ నినాదంతో తెలుగుజాతిలో చైతన్యాన్ని నింపారు. తనకున్న బహుముఖ ప్రజ్ఞ పాటవాలతో కాలు మోపిన అన్ని రంగాల్లో ఆఖండ విజయాల్ని నమోదు చేయడం ద్వారా తెలుగువారి గుండెల్లో ఎప్పటికీ చెరగని ముద్రవేస్తూ ఓ కారణజన్ముడిగా, యుగపురుషుడిగా అవతరించారు. 


అటువంటి మహాపురుషుని, మహాయోధుని నుండీ స్ఫూర్తిని పొందినందుకు ప్రతిగా మన తెలుగు రాష్ట్రాల్లోని రెండు జిల్లాలకు ఆయన పేరు మీద నామకరణం చేసుకుని కృతజ్ఞతలు తెలుపుకోవడం మరియూ భారతరత్న బిరుదుతో ఆయన్ని సత్కరించుకోవడం ద్వారా మనల్ని గౌరవించుకోవడమే కాక భావితరాలకు స్ఫూర్తిదాయకం లాంటిదని ప్రపంచవ్యాప్తంగా అసంఖ్యాక తెలుగు ప్రజల యొక్క అభిమతం మరియు ఆకాంక్ష. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచవ్యాప్త అసంఖ్యాక తెలుగు ప్రజల అభిమతం ఆకాంక్షలకు అనుగుణంగా విజయవాడ ముఖ్య కేంద్రంగా ‘ఎన్‌టిఆర్‌’. జిల్లా పేరుతో ఒక కొత్త జిల్లాని ఏర్పాటు చేసే నిర్ణయం తీసుకోవడాన్ని స్వాగతిస్తున్నాను. హర్షాతిరేకాన్ని వ్యక్తపరుస్తున్నాను. 


ఆ పంథాలోనే కేసీఆర్‌గారి నాయకత్వంలో కూడా అతి త్వరలోనే ‘ఎన్‌టిఆర్‌’ జిల్లా పేరుతో నిర్ణయం తీసుకుంటుందని అభిలషిస్తూ, అలాగే ప్రధాని నరేంద్ర మోదీగారు నాయకత్వంలో భారతదేశ ప్రభుత్వం స్వర్గీయ ఎన్‌.టి.ఆర్‌’ని భారతరత్న బిరుదాంకితుడిని గావిస్తుందని ఆకాంక్షిస్తున్నాను. ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా మే 28, 2022 సమయానికి ఎన్టీఆర్‌ జిల్లా ఏర్పాటుకి సంబంధించిన చట్టబద్ధతతో కూడిన కార్యచరణను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలనీ, ఆయన శత జయంతి ఉత్సవాలను ఒక పండుగలా అధికారిక హోదాలో నిర్వహించాలని తెలుగు రాష్ట్రాల, కేంద్ర ప్రభుత్వాలను వినమ్రంగా కోరుకుంటున్నా’’ అని వైవిఎస్‌ చౌదని పేర్కొన్నారు. 



Updated Date - 2022-01-27T19:25:54+05:30 IST