యూట్యూబ్‌ స్టార్స్‌!

వెండితెరనే కాదు యూట్యూబ్‌ను ఏలుతున్నారు కొందరు సినీతారలు. అధికారికంగా యూట్యూబ్‌ ఛానల్‌ను ప్రారంభించి తమ ఆసక్తి,  అభిరుచులను, సినిమా విశేషాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ప్రేక్షకులు కూడా సినీనటుల యూట్యూబ్‌ ఛానళ్లను పెద్ద సంఖ్యలో ఫాలో అవుతున్నారు. ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్‌లాంటి సామాజిక మాధ్యమాల్లోలా యూట్యూబ్‌లో ట్రోలింగ్‌ బెడద లేక పోవటంతో తమకు నచ్చిన వీడియోలను అప్‌లోడ్‌ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు స్టార్‌ యూట్యూబర్స్‌. 


మహేశ్‌, బన్నీ ముందే..

సొంత యూట్యూబ్‌ ఛానళ్లను సక్సెస్‌ఫుల్‌గా నడిపే తెలుగు సినీ నటుల్లో మహేశ్‌, అల్లు అర్జున్‌ ముందు వరుసలో ఉన్నారు. మహేశ్‌ బాబు 2015లో తన పేరుతో సొంత యూట్యూబ్‌ ఛానల్‌ను ప్రారంభించారు. ఆయన ప్రసంగాలను, సినిమాలకు సంబంధించిన ట్రైలర్లు, టీజర్లు, వీడియోసాంగ్స్‌ను ఒక్కచోటే చూడొచ్చు. మహేశ్‌ ఛానల్‌కు 8 లక్షలకు పైగా సబ్‌స్ర్కైబర్లు ఉన్నారు. యూట్యూబ్‌లో ఎక్కువ సబ్‌ స్ర్కైబర్లు ఉన్న మరో హీరో అల్లు అర్జున్‌.


ఆయన 2011లో తన యూట్యూబ్‌ ఛానల్‌ ప్రారంభించారు. సినిమాలకు సంబంధించిన విశేషాలతో పాటు ఇంటర్వ్యూలు, వ్యక్తిగత విషయాలను బన్నీ అభిమానులతో పంచుకుంటున్నారు. తెలుగు హీరోయిన్లు కూడా తమ యూట్యూబ్‌ ఛానల్‌ ద్వారా ప్రేక్షకులను అలరిస్తున్నారు. కాజల్‌ అగర్వాల్‌ 2008లోనే తన పేరుతో యూట్యూబ్‌ ఛానల్‌ ప్రారంభించారు. ఆమె నటించిన సినిమాల ట్రైలర్లు, పాటలు, షోలు, ఆధ్యాత్మిక వీడియోలను అభిమానులతో పంచుకుంటున్నారు. అయితే ప్రస్తుతం ఆమె యూట్యూబ్‌లో యాక్టివ్‌గా లేరు. కొణిదెల నిహారిక ‘పింక్‌ ఎలిపాంట్‌’ పేరుతో తన సొంత యూట్యూబ్‌ ఛానల్‌ను నడుపుతున్నారు. అందులో ఆమె నటించిన, నిర్మించిన లఘుచిత్రాలను ఉంచుతున్నారు. ఈ ఛానల్‌కు 1.50 లక్షల సబ్‌స్ర్కైబర్లు ఉన్నారు. మహేశ్‌ బాబు కూతురు సితార, దర్శకుడు వంశీ పైడిపల్లి కూతురు ఆద్యా  కలసి ఓ యూట్యూబ్‌ ఛానల్‌ను ప్రారంభించారు. ‘ఆద్యా అండ్‌ సితార’ ఛానల్‌కు రెండున్నర లక్షలమంది సబ్‌స్ర్కైబర్లు ఉన్నారు. వీరిద్దరూ కలసి పలువురు సినీ ప్రముఖులను ఇంటర్వ్యూ చేస్తున్నారు.

సీనియర్‌ యూట్యూబర్స్‌

నటుడు, నిర్మాత నాగబాబు తన పేరు మీదనే సొంతంగా యూట్యూబ్‌ ఛానల్‌ నడుపుతున్నారు. ‘నాగబాబు కొణిదెల’ పేరుతో రాజకీయాలు, షోలు, పర్సనల్‌ విషయాలు అభిమానులతో పంచుకుంటున్నారు. దాదాపు రెండు లక్షలమంది సబ్‌స్ర్కైబర్లు ఉన్నారు. నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, రచయిత పరుచూరి గోపాలకృష్ణ వారిపేరుతోనే యూట్యూబ్‌ ఛానల్‌ నడుపుతున్నారు. అందులో సినిమా రంగానికి సంబంధించిన ఆసక్తికర విశేషాలను వీక్షకులతో పంచుకుంటున్నారు. ఎల్‌.బి. శ్రీరామ్‌ లఘుచిత్రాలను రూపొందించి తన యూట్యూబ్‌ ఛానల్‌ ద్వారా విడుదల చేస్తున్నారు. నటుడు శివబాలాజీ, మధుమిత దంపతులు యూట్యూబ్‌లో శివమధు పేరుతో వంటల చానల్‌ ప్రారంభించారు. దీనికి మూడు లక్షలకు పైగా సబ్‌స్ర్కైబర్‌లు ఉన్నారు. సీనియర్‌ నటి రాశీ కూడా సొంతంగా యూట్యూబ్‌ ఛానల్‌ నడుపుతున్నారు. సినీ రంగంలో గత అనుభవాలను పంచుకోవటంతో పాటు అభిమానులకు వంటింటి చిట్కాలను అందిస్తున్నారు.

టాప్‌లో శిల్పా, అలియా

బాలీవుడ్‌ ముద్దుగుమ్మ అలియాభట్‌కు సామాజిక మాధ్యమాల్లో ఉన్న ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రెండేళ్ల క్రితమే అలియా యూట్యూబ్‌లోకి అడుగుపెట్టారు. తన పేరుతో సొంత యూట్యూబ్‌ ఛానల్‌ ప్రారంభించిన కొద్దికాలంలోనే 15 లక్షల సబ్‌స్ర్కైబర్లను సాధించారు. ఇందులో తన సినిమాలకు సంబంధించిన విశేషాలను అలియా అభిమానులతో పంచుకుంటున్నారు. అయితే యూట్యూబ్‌లో ఎక్కువ మంది సబ్‌స్ర్కైబర్లు ఉన్న నటిగా శిల్పాశెట్టి కుంద్రా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె ఛానల్‌కు 20 లక్షలకు పైగా సబ్‌స్ర్కైబర్లు ఉన్నారు. ‘శిల్పాశెట్టి’ పేరుతో ఒక యాప్‌ను కూడా ఆమె నడుపుతున్నారు. ఫిట్‌నెస్‌, ఆరోగ్యకరమైన ఆహారం, జీవనశైలికి సంబంధించిన వీడియోలను ఆమె పోస్ట్‌ చేస్తున్నారు. ప్రియాంకా చోప్రా 2014లో యూట్యూబ్‌ ఛానల్‌ ప్రారంభించారు. సుమారు 6 లక్షల మంది సబ్‌స్ర్కైబర్లు ఉన్నారు.


బాలీవుడ్‌ అగ్ర నటుడు అజయ్‌ దేవ్‌గణ్‌ పదేళ్ల క్రితమే యూట్యూబ్‌ ఛానల్‌ను ప్రారంభించారు. ఇప్పుడు దాదాపు 7 లక్షల సబ్‌స్ర్కైబర్లు ఉన్నారు. ఆయన భార్య కాజల్‌ కూడా అప్పుడప్పుడు కొన్ని వీడియోలను ఈ ఛానల్‌లో పోస్ట్‌ చేస్తుంటారు. వీరితో పాటు దిశాపటానీ, కార్తీక్‌ ఆర్యన్‌, వరుణ్‌ ధావన్‌, అర్జున్‌ కపూర్‌, జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌లు యూట్యూబ్‌ ఛానల్‌ నడుపుతున్నారు. మలయాళ నటుడు దుల్కర్‌ సల్మాన్‌ 2012లోనే యూట్యూబ్‌ ఛానల్‌ ప్రారంభించారు. సినిమాలు, జీవనశైలి, ట్రావెల్‌ వీడియోలను అభిమానులతో పంచుకుంటున్నారు.

రానా స్పెషల్‌ కంటెంట్‌ 

పాశ్చాత్య దేశాలకు సంబంధించిన కంటెంట్‌ను చూసేవారి సంఖ్య మనదేశంలో పెరుగుతోంది. అలాంటి వీక్షకులకు నచ్చిన కంటెంట్‌ను అందించే లక్ష్యంతో ‘సౌత్‌ బే’ పేరుతో హీరో రానా యూట్యూబ్‌ ఛానల్‌ ప్రారంభించారు. ప్రేక్షకులకు మంచి కంటెంట్‌ను అందించేందుకు విదేశాలకు చెందిన ప్రముఖ కంటెంట్‌ క్రియేట్‌ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. లైవ్‌ చాట్స్‌, న్యూస్‌, మ్యూజిక్‌, యానిమేషన్‌ కంటెంట్‌ను రానా తన ఛానల్లో అందిస్తున్నారు.

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.