నా గెలుపు ఈ ముగ్గురిదే!

Twitter IconWatsapp IconFacebook Icon
నా గెలుపు ఈ ముగ్గురిదే!

ప్రతి మగవాడి విజయం వెనక ఒక స్త్రీ  ఉంటుందంటారు. కానీ యువ దర్శకుడు వంశీ పైడిపల్లి మాత్రం తన విజయం వెనక ముగ్గురు స్త్రీలు ఉన్నారంటారు. వారు... తన కన్నతల్లి ఉమాదేవి.. భార్య మాలిని.. కుమార్తె ఆద్య- తన జీవితాన్ని తీర్చిదిద్దటంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారంటారు. నిజ జీవితంలో అనుక్షణం తన వెంటే ఉండే ఈ ముగ్గురి గురించి.. వృత్తి జీవితంలో హిట్స్‌ వచ్చినా.. ఫ్లాప్‌లు వచ్చినా తోడుగా మేమున్నామని నిలిచే ప్రభాస్‌.. మహేష్‌.. ఎన్టీఆర్‌.. చరణ్‌ వంటి స్నేహితుల గురించి.. కొవిడ్‌ సమయంలో ఎదుర్కొంటున్న పరిస్థితుల గురించి వంశీ నవ్యకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. సాధారణంగా మీడియాకు దూరంగా ఉండే వంశీ ఈ ఇంటర్వ్యూలో తన జీవితంలోని ఒడిదుడుకులను పంచుకున్నారు. 

ఆ విశేషాలు ఆయన మాటల్లోనే...


నేను పెరిగింది హైదరాబాద్‌లోనైనా.. మా సొంత ఊరు మాత్రం ఆదిలాబాద్‌ జిల్లాలో ఖనాపూర్‌. నాన్న పైడిపల్లి రవీంద్రరావు రాజకీయ నాయకుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కాంగ్రెస్‌ కమిటీలో సభ్యుడిగా కూడా పనిచేశారు. నాన్న నా చిన్నప్పుడు ఖానాపూర్‌లో ఒక థియేటర్‌ కొన్నారు. దాని పేరు లక్ష్మీ. అందులో అందరి హీరోల సినిమాలు విడుదలయ్యేవి. ఇప్పుడైతే చిన్న చిన్న ఊర్లలో కూడా పెద్ద సినిమాలు విడుదలవుతున్నాయి కానీ ఒకప్పుడు చిన్న ఊర్లలో పెద్ద హీరోల సినిమాలు విడుదల కావటానికి సమయం పట్టేది. అయినా ఏదైనా కొత్త సినిమా వచ్చిందంటే ఖానాపూర్‌లో సినిమా అభిమానులకు పండగే! అలాంటి కొన్ని జ్ఞాపకాలు ఇప్పటికీ నాకు గుర్తే. చిన్నప్పుడు సెలవులకు ఊరికి వెళ్తే సరదాగా టిక్కెట్టు కౌంటర్‌లో కూర్చొనేవాణ్ణి.


కౌంటర్‌ తెరిచిన వెంటనే పెద్ద హంగామా! తోపులాట... టిక్కెట్టు కోసం పది, పదిహేను చేతులు.. తమ అభిమాన హీరో సినిమా చూడాలనే ఉత్కంఠ.. సినిమా అంటే ఇంత క్రేజా అనిపించేది. హైదరాబాద్‌లోని హెచ్‌పీఎ్‌సలో స్కూలింగ్‌ పూర్తయిన తర్వాత చాలా మందిలాగానే ఇంజినీరింగ్‌లో చేరా! కాలేజీలో నేను హ్యాపీ గో లక్కీ టైప్‌! క్లాసులు ఎగొట్టి బయట తిరగటం.. సినిమాలు చూడటం.. మామూలే! ఆ రోజుల్లోనే ‘మురారి’, ‘ఖుషి’లాంటి సినిమాలు విడుదలయ్యాయి. ఈ సినిమాలకు టిక్కెట్లు దొరకటం అంత ఈజీ కాదు. అందుకే కాలేజీలో అలాంటి సినిమాలకు ఎవడు టిక్కెట్లు ఇప్పించగలిగితే వాడే హీరో! నాకు హీరో అవ్వాలనే ఉండేది. పైగా మాకు థియేటర్‌ ఉండేది కాబట్టి కొందరు డిస్ట్రిబ్యూటర్లు కూడా తెలుసు! వారి దగ్గరకు నేను, నా ఫ్రెండ్స్‌ టిక్కెట్ల కోసం వెళ్తూ ఉండేవాళ్లం. నాకు రాజు అంకుల్‌ (దిల్‌ రాజు) అక్కడే పరిచయం.


రాజు అంకుల్‌

మొదటి రోజు మార్నింగ్‌ షోకు టిక్కెట్లు కావాలంటే డిస్ట్రిబ్యూషన్‌ ఆఫీసుకు వెళ్లి తెచ్చుకోవాలి. నేను, నా ఫ్రెండ్స్‌ ముషీరాబాద్‌లో ఉన్న రాజుగారి డిస్ట్రిబ్యూషన్‌ ఆఫీసు దగ్గరకు వెళ్లేవాళ్లం. ఆయన లోపల రూమ్‌లో కూర్చుని ఉండేవారు. నేను తలుపుతోసుకొని వెళ్లే సరికి ఆయన పెద్ద టేబుల్‌ వెనక హూందాగా కూర్చుని ఫోన్‌లోనో.. స్టాఫ్‌తోనో మాట్లాడుతూ ఉండేవారు. ఆయన దగ్గరకు వెళ్లి - ‘‘అంకుల్‌! టిక్కెట్లు’’ అని అడిగేవాణ్ణి.. లెక్కప్రకారం ఆయన నా కన్నా ఎనిమిదేళ్లే పెద్ద. బహుశా ఆయన హుందాతనం వల్ల కావచ్చు.. ఆ పిలుపు అలవాటు అయిపోయింది. ఇప్పటికీ నాకు అదే అలవాటు. చాలా మంది - ‘‘నువ్వు ఆయనను ‘అంకుల్‌’ అని ఎందుకు పిలుస్తావు’’ అని అడుగుతూ ఉంటారు. అందరికీ ఈ కథ చెప్పలేను కదా.. నవ్వేసి ఊరుకుంటా! ఆ సమయంలో నా మనసులో చెరగని ముద్ర వేసిన ఒక దృశ్యాన్ని మీకు వర్ణించాలి.


2002లో ‘ఆది’ రిలీజ్‌ అయింది. ఎప్పటి లాగానే సినిమా మొదటి రోజు.. మొదటి ఆటకు వెళ్లాం. సినిమా అయిపోయిన తర్వాత బయటకు వస్తే అంతా కోలాహలంగా ఉంది. ఒక వ్యక్తి వెనక వందల మంది పరిగెడుతున్నారు. నేను కూడా వాళ్లతో గేటు దాకా పరిగెత్తుకుంటా వెళ్లా. మేమందరం వెంబడించిన వ్యక్తి ‘ఆది’ డైరక్టర్‌ వి.వి. వినాయక్‌. ఒక సినిమా డైరక్టర్‌కు అంత క్రేజ్‌ ఉంటుందని నాకు తెలిసింది అప్పుడే! ఆ సంఘటన తలుచుకుంటే ఇప్పటికీ నాకు రోమాలు నిక్కబొడుచుకుంటాయి. బహుశా అంతర్లీనంగా సినిమాల్లోకి రావాలని నాలో ఉన్న కోరిక ఈ సంఘటనతో మరింత బలపడిందేమో! కాలేజీ చదువు పూర్తయిన తర్వాత అందరిలాగానే ఉద్యోగంలో చేరా. కానీ ఉద్యోగం నాకు సెట్‌ కాదనిపించింది. దృష్టంతా సినిమాల వైపు మళ్లింది.

 

చీకటి వెలుగుల రంగేళీ

డిప్రెషన్‌ ఎంత దుర్బరమైనదో అనుభవిస్తే కానీ తెలియదు.. జీవితమే ‘ఇటు దుఃఖం.. అటు నిరాశ’గా కనిపిస్తుంది. నా పరిస్థితి చూసి అమ్మ,నాన్న కంగారు పడ్డారు. నేను మళ్లీ మామూలు మనిషిని కావాలంటే పెళ్లి మాత్రమే మార్గమనుకున్నారు. నేను కోరుకున్న నా ప్రియురాలు మాలినితో పెళ్లి చేశారు. మాలినిని నేను ప్రపోజ్‌ చేయటం.. తను అంగీకరించటం. వాళ్లింట్లో మా పెళ్లి ఒప్పుకోకపోవటం.. రకరకాల ట్విస్ట్‌లు, టర్న్‌లతో సుఖాంతమైన కథ. అంత పోరాడి పెద్దవాళ్లను ఒప్పించాము కానీ - నాకు ఆ సమయంలో పెళ్లి అవుతోందనే ఆనందమే లేదు. అన్నీ సందేహాలే.. అవి ఎంత తీవ్రంగా ఉండేవంటే- నా పెళ్లికి ఇండస్ట్రీలో చాలా మందిని పిలిచా. కానీ ‘పెద్ద స్టార్స్‌ వస్తారా? రారా?’ అనే సందేహం వెంటాడుతూ ఉండేది. నాన్న పొలిటీషియన్‌ కాబట్టి అప్పటి సీఎం రాజశేఖరరెడ్డిగారి సహా అనేక మంది ప్రముఖులు వచ్చారు. ఇండస్ట్రీ నుంచి అనేక మంది వచ్చారు. తారక్‌ కూడా వచ్చాడు. రావటమే కాదు. చాలా సేపు కూర్చున్నాడు. ఎందుకో నాకు తారక్‌ పెళ్లికి రావటం పెద్ద ఎమోషనల్‌ మూమెంట్‌! ‘మున్నా’ సినిమా విడుదలయిన తర్వాత- తారక్‌ ఒక రోజు నాకు ఫోన్‌ చేసి- ‘‘సినిమా ఫెయిల్‌ అయింది.. నువ్వు కాలేదు.. ఈ విషయాన్ని నమ్ము’’ అన్నాడు.


అమ్మ, నాన్న, మాలిని, తారక్‌ వంటి మిత్రులు ఎంత భరోసా ఇచ్చినా నేను వెంటనే కోలుకోలేకపోయా. ఆ సమయంలో ఎంత డిప్రెషన్‌లో ఉన్నానంటే- పెళ్లి తర్వాత హనీమూన్‌కు కూడా వెళ్లలేదు. ఆ సమయంలో మాలిని నాకు నీడలా ఉండేది. ఇప్పుడు ఆలోచిస్తే- తను లేకపోతే ఈ పరిస్థితి నుంచి బయటకు వచ్చేవాడినా అనిపిస్తుంది. నేనే నెమ్మది నెమ్మదిగా కోలుకొని ఒక లైన్‌ అనుకొని తారక్‌కు చెప్పా. తారక్‌ దాన్ని విన్నవెంటనే లేచి హగ్‌ చేసుకున్నాడు. ఆ లైనే ‘బృందావనం’. అది పెద్ద హిట్‌. ఆ తర్వాత చరణ్‌తో ‘ఎవడు’ చేశా. ఈ సినిమా సిట్టింగ్‌ నాకు ఒక పెద్ద ఎమోషనల్‌ మూమెంట్‌. అప్పటి దాకా నేను చిరంజీవిగారిని ఎప్పుడూ కలవలేదు. ఆయనను కలవటం.. సింగిల్‌ సిట్టింగ్‌లో కథ ఓకే అవటం.. అది పెద్ద హిట్‌ కావటం... అన్నీ మధుర క్షణాలే! తర్వాత నాగార్జున గారితో ‘ఊపిరి’, మహే ష్‌తో ‘మహర్షి’ తీసా. నా జీవితంలో ‘మహర్షి’ ఒక మేలు మలుపు. ఈ సినిమా నాకు ఒక పెద్ద హిట్‌ ఇవ్వటమే కాదు.. మహేష్‌ అనే మంచి మిత్రుడిని కూడా ఇచ్చింది. 


రెండేళ్లలో 35 కేజీలు తగ్గా!


కప్పుడు నేను రోజుకు ఐదు పూటలు తినేవాడిని.. 120 కేజీలు ఉండేవాడిని. ఇప్పుడు 85 కేజీలున్నా. బరువు తగ్గటానికో కథ ఉంది. ఒక రోజు నాగార్జున గారు- ‘‘వంశీ..నువ్వు బరువు తగ్గాలి.. ఇలా ఉంటే ఇబ్బంది పడతావు’’ అని కౌన్సెలింగ్‌ ఇచ్చారు. దాంతో బరువు తగ్గే ప్రయత్నాలు మొదలుపెట్టా. బరువు పెరగటానికి 80 శాతం కారణం మనం తినే ఆహారం. దీనిని కంట్రోల్‌ చేస్తే బరువు తగ్గుతాం. అందుకే ఒకప్పుడు ఐదు మీల్స్‌ తినే నేను- ఇప్పుడు మితంగా తింటున్నా. బరువు ఎక్కువ ఉన్నవారికి నేనిచ్చే సలహా ఒకటే. బరువు తగ్గితే శరీరం చాలా హాయిగా ఉంటుంది. ఎటువంటి ఆరోగ్య సమస్యలు రావు. నామాట నమ్మండి.


తొలిసారి..

రాజు అంకుల్‌తో నాకు కాలేజీ రోజుల్లో టిక్కెట్ల పరిచయం ఉండేది. కానీ నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఆయనను కలిసింది తక్కువే! ఎప్పుడూ ఆయన దగ్గరకు వెళ్లి అవకాశాలు కూడా అడగలేదు. అయితే ఆయన మాత్రం నన్ను గమనిస్తూ ఉండేవారు. ‘భద్ర’ తీస్తున్న సమయంలో ఒక రోజు ఫోన్‌ చేసి తనదైన స్టైల్‌లో - ‘ఎక్కడున్నావు.. మా బ్యానర్‌లో జాయినవ్వు’ అన్నారు. అప్పటికే ఆయన విజయవంతమైన నిర్మాతగా ఎస్టాబ్లిష్‌ అయ్యారు. డైరక్టర్‌ కావాలనే వ్యక్తికి అంతకన్నా గొప్ప అవకాశమేముంటుంది? ‘భద్ర’ తీసే సమయంలో స్టోరీ సిట్టింగ్‌ దగ్గర నుంచి షూటింగ్‌ దాకా- ప్రతి దశలోను చురుకుగా పాల్గొనేవాడిని. భద్ర జరుగుతున్న సమయంలోనే రాజుగారు - ‘‘వంశీ! నీకు టూమచ్‌ కేపబులిటీస్‌ ఉన్నాయి. ఏదైనా కథ ఉంటే చూడు... సినిమా తీసేద్దాం’ అన్నారు. నేను ‘మున్నా’ కథ చెప్పటం.. ప్రభాస్‌ విని ఓకే చేయటం.. షూటింగ్‌ ప్రారంభం కావటం.. వేగంగా జరిగిపోయాయి.


ఇండస్ట్రీకి వచ్చిన మూడేళ్లలో డైరక్టర్‌ అయిపోయా! 2002-05 మధ్య కాలం నా జీవితంలో ఒక రంగుల కల. సినీ సోపానపటంలో ఎవరూ ఊహించనంత వేగంగా నిచ్చెనలు ఎక్కేసా! నిచ్చెనలు ఎక్కుతున్న సమయంలో నా ప్రవర్తనలో మార్పు రావటం మొదలయింది. అది ఎంత వరకూ వచ్చిదంటే- నా ఏటిట్యూడ్‌ చూసి రాజుగారు కూడా ఇబ్బంది పడేవారు. అపజయమనే పాము కాచుకు ఉంటుందని.. అది కాటు వేస్తే పరిస్థితులు తారుమారయిపోతాయని నాకప్పుడు తెలియదు. ‘మున్నా’ విడుదలయింది. పెద్దగా ఆడలేదు. ఆ పరాజయం నాకొక పెద్ద షాక్‌! కళ్ల ముందున్న రంగుల కల చెదిరిపోయింది. నా జీవితంలో చీకటి రోజులు ప్రారంభమయ్యాయి. ముందు బాధ.. ఆ తర్వాత నిరాశ.. ఇంకొద్ది కాలం తర్వాత డిప్రెషన్‌లోకి జారిపోయా!

నా గెలుపు ఈ ముగ్గురిదే!

స్నేహపు జిగిబిగి..

నేను సినిమాల్లో చేరతానంటే అమ్మ, నాన్న సహజంగానే అప్‌సెట్‌ అయ్యారు. నాన్నకు నా భవిష్యత్తు ఎలా ఉంటుందోననే భయం. అమ్మకు సినిమా రంగంలో నేను నిలదొక్కుకోగలనో లేదోననే బెంగ. అయినా నేను పట్టువీడలేదు. నాన్న ఏమీ అనలేక నన్ను వదిలేశారు. అమ్మ నా ఇష్టాన్నే తన ఇష్టమనుకొని ఒప్పుకుంది. ఇక నా అవకాశాల వేట ప్రారంభమయింది. 2002 మార్చిలో దర్శకుడు జయంత్‌ గారి దగ్గరకు వెళ్లి కలిసి- ఏదైనా అవకాశం ఉంటే ఇవ్వమని అడిగా. ఆ సమయంలో ఆయన ప్రభా్‌సతో ‘ఈశ్వర్‌’ అనే సినిమా ప్లాన్‌ చేస్తున్నారు. అయినా ఏ విషయం తేల్చి చెప్పలేదు. దీంతో నేను ప్రతి రోజూ ‘స్వాతిముత్యం’లో కమల్‌ హాసన్‌లా ఆయనను వెంబడిస్తూ ఉండేవాణ్ణి.. ఏప్రిల్‌, మే, జూన్‌ గడిచిపోయాయి. జూలై 20వ తేదీన ఆయన ఛాంబర్‌కు వచ్చారు. ఆయన వస్తారని తెలిసి నేను ముందే అక్కడకు వెళ్లా! ఆయన ఎవరితోనో మాట్లాడి బయటకు వచ్చారు.


రూమ్‌ బయట నేను.. ఏమనుకున్నారో ఏమో తెలియదు.. నన్ను చూసి - ‘‘రేపటి నుంచి షూటింగ్‌! వచ్చెయ్‌!’’ అన్నారు. అలా ‘ఈశ్వర్‌’ సినిమాకు అసిస్టెంట్‌ డైరక్టర్‌గా చేరా. ‘ఈశ్వర్‌’ సినిమా షూటింగ్‌ సమయంలో ప్రభాస్‌తో స్నేహం చిక్కబడింది. ‘ఈశ్వర్‌’ అయిపోయిన తర్వాత షరామామూలే! ఇలా అవకాశాల వేటలో ఉండగా- ఒక రోజు ప్రభాస్‌ ఫోన్‌ చేసి- ‘‘‘ఒక్కడు’ సినిమా వంద రోజుల ఫంక్షన్‌ ఉంది. వస్తే ఎం.ఎస్‌. రాజుగారికి పరిచయం చేస్తా!’’ అన్నాడు. ప్రభాస్‌తో ఎం.ఎస్‌. రాజుగారు ‘వర్షం’ సినిమా మొదలుపెట్టబోతున్న సమయమది. ఎం.ఎస్‌. రాజుగారికి పరిచయం చేస్తే ఆయన- ‘అసిస్టెంట్లు చాలా మంది ఉన్నారు.. అసోసియేట్‌గా జాయినయిపో..’ అన్నారు. ‘వర్షం’ సినిమా నాకు అనేక వృత్తి పాఠాలు నేర్పింది. పేరుకు అసోసియేట్‌నే కానీ అన్నింటా నేనే! రాత్రి లేదు. పగలు లేదు. తిండి.. నిద్ర అన్నీ షూటింగ్‌ స్పాట్‌లోనే! ‘వర్షం’ సమయంలోనే నాకు దేవీ (సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌) బాగా పరిచయమయ్యాడు. అతి కొద్ది కాలంలోనే ఆప్తమిత్రుడయ్యాడు. మా ఇద్దరికీ సినిమాలంటే జీవితం. దేవీ కానీ ప్రభాస్‌ కానీ నన్ను ఎప్పుడూ ఒక అసిస్టెంట్‌ డైరక్టర్‌లా చూడలేదు. మంచి స్నేహితుడిలా చూసేవారు. వాళ్లతోనే ఉండేవాడిని. వాళ్లతోనే తినేవాడిని. దేవీ తను ‘మాస్‌’ సినిమాకు మ్యూజిక్‌ చేస్తూ నాకు అవకాశం ఇప్పించాడు. అలా నా తొలి అడుగులన్నీ వడివడిగా పడిపోయాయి. 

నా గెలుపు ఈ ముగ్గురిదే!ఎక్కువ సమయం ఆద్యతోనే!


కొవిడ్‌ మన జీవితాలను అతలాకుతలం చేస్తోంది. ఉదయాన్నే లేచి ఫేక్‌బుక్‌, వాట్సప్‌ చూడాలంటే- ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనే భయం. ఎవరితో మాట్లాడినా కొవిడ్‌ కబుర్లే.. స్థిరమైన ఉద్యోగాలు ఉన్నవారి సంగతి ఓకే! మరి రోజువారి సంపాదించుకొనే వారి పరిస్థితి చూస్తుంటే భయమేస్తుంది. నాకు చేతనైనంత సాయం చేస్తున్నా.. అయినా మనసులో ఏదో గిల్టీ. ఇక పిల్లలను చూస్తే కూడా చాలా జాలి వేస్తోంది. బయటకు వెళ్లి ఆడుకోవాల్సిన పిల్లలు.. ఇంట్లో మగ్గిపోతున్నారు. అందుకే నేను ఆద్యతో ఎక్కువ టైమ్‌ గడుపుతున్నా.


చివరగా..


మా అమ్మాయి ఆద్య గురించి కూడా ఒక మాట చెప్పాలి. తనకు 11 ఏళ్లు. మేము పాటించే విలువలతో తనను పెంచుతున్నాం. తను కూడా చాలా సున్నిత మనస్కురాలు. తనకు నేనంటే ప్రాణం. అమ్మ, మాలిని నాతో చెప్పలేని విషయాలు కూడా తను సూటిగా వచ్చి చెబుతుంది. ఉదాహరణకు నేను బరువు పెరిగితే- ‘తగ్గు నాన్నా..’’ అని మొదట చెప్పేది తనే! నన్ను చిన్నప్పటి నుంచి పెంచి.. అత్యంత క్లిష్టమైన సమయాల్లో అండగా ఉన్న అమ్మ.. నేను డిప్రషన్‌లో ఉన్నప్పుడు నాకు తోడుగా ఉండి.. ఇప్పటికీ నా నీడలా ఉండే భార్య.. మా భవిష్యత్తు తానే అని ఎప్పటికప్పుడు మాకు గుర్తుచేసే కూతురు.. వీరే నా జీవితం. ఈ రోజు ఇంత ఆనందంగా ఉన్నానంటే కారణం వీరు ముగ్గురే!’’

సివిఎల్‌ఎన్‌

AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.