
ఆదివారం రాత్రి బెంగళూరులో జరిగిన ‘కేజీఎఫ్ చాప్టర్–2’ ట్రైలర్ లాంచ్ వేడుకలో సంజయ్‌దత్‌పై పొగడ్తల వర్షం కురిపించారు యశ్. ‘‘అనార్యోగం నుంచి కోలుకుని కూడా ఆయన సెట్లో డెడికేషన్‌తో వర్క్ చేశారు. పనిపట్ల ఆయనకు ఉన్న నిబద్ధతే ఆయన్ని ఆ స్థాయిలో ఉంచింది’’ అని యశ్ అన్నారు. ఇంకా ఆయన మట్లాడుతూ ‘‘కేజీఎఫ్ 2’ ప్రారంభమైన కొన్నాళ్లకు సంజయ్‌దత్ లంగ్ క్యాన్సర్‌తో ఇబ్బందిపడ్డారు. అది గుర్తించిన వెంటనే ట్రీట్మెంట్కు వెళ్లారు. కోలుకున్నాక కొంత విరామం తీసుకుని అదే ఉత్సాహంతో సెట్లో అడుగుపెట్టారు. కమిట్మెంట్తో పనిచేసేవారు. సెట్లో అంతా ఆయన ఆరోగ్యం గురించే ఆలోచించేవాళ్లం. యాక్షన్ సీక్వెన్స్ చేసేటప్పుడు మా అందరికీ భయం కలిగేది. ఆయన విషయంలో జాగ్రత్తగా ఉండమని సిబ్బందికి చెబుతుండేవాడిని. అది ఆయన అవమానంగా భావించేవారు. నన్ను దగ్గరికి పిలిచి ‘యశ్ భాయ్ నువ్వు నన్ను అలా అవమానించకు. నువ్వు నా ఆరోగ్యం విషయంలో జాగ్రత్త తీసుకుంటున్నావ్ అది నాకు తెలుసు. కానీ నేను యాక్ట్ చేస్తాను.. చేయగలను.. ది బెస్ట్ ఇస్తాను’ అన్నారు. అలాగే చేశారు కూడా. నాకు అప్పుడు అనిపించింది.. ఆయన్ని అభిమానులు అంతగా ఎందుకు ఆరాధిస్తారో అప్పుడు అర్థమైంది. నిజంగా ఆయన డెడికేషన్ ఆయన్ని నిలబెడుతుంది’’ అని యశ్ అన్నారు.