మ్యూజిక్‌ స్కూల్‌ నా కల

ABN , First Publish Date - 2020-06-21T17:31:13+05:30 IST

స్వరములు ఏడే... కానీ రాగాలెన్నో. సంగీతాన్ని ఆస్వాదిస్తే ఆనందాన్ని పొందగలం. సాధన చేస్తే జీవితాన్నే మార్చుకోగలం. సంగీతంలోనే పుట్టి పెరిగిన తమన్‌ .. నేడు ‘వరల్డ్‌ మ్యూజిక్‌ డే’....

మ్యూజిక్‌ స్కూల్‌ నా కల

స్వరములు ఏడే... కానీ రాగాలెన్నో. సంగీతాన్ని ఆస్వాదిస్తే ఆనందాన్ని పొందగలం. సాధన చేస్తే జీవితాన్నే మార్చుకోగలం. సంగీతంలోనే పుట్టి పెరిగిన తమన్‌ .. నేడు ‘వరల్డ్‌ మ్యూజిక్‌ డే’ సందర్భంగా సప్తస్వరాలు, అవి మలచిన తన జీవితం గురించి చెప్పుకొచ్చారు..


‘సంగీతం నా ఊపిరి.. అది నా నరనరాల్లో ప్రాణవాయువులా ప్రవహిస్తోంది. మాది సంగీత కుటుంబం. నాన్న వాద్యకళాకారులు. ఏడొందల సినిమాలకు పనిచేశారు. అమ్మ గాయని. అయితే పాడడం కంటే వాద్యం అంటేనే ఇష్టంగా ఉండేది. నాన్నను చూస్తూ అలా నేర్చుకున్నాను. ఏడేళ్ల నుంచే నాన్నతో కచేరీలకు వెళ్లేవాడిని. ఆ శని ఆదివారాలు పండగలా ఉండేవి. చెన్నైలో అరవై అపార్టుమెంట్లు ఉన్న గేటెడ్‌ కమ్యూనిటీలో ఉండేవాళ్లం. ప్రతి నెలా ఎవరో ఒకరిది పుట్టినరోజు వచ్చేది. నేను డ్రమ్స్‌ తీసుకెళ్లి వాయించేవాడిని. అందరూ మెచ్చుకునేవాళ్లు. అస్సలు స్టేజ్‌ ఫియర్‌ ఉండేది కాదు. కానీ నాన్న మాత్రం ‘నువ్వు బాగా చదువుకోవాలి’ అనే చెప్పేవారు. నాకు చదువు నచ్చలేదు. వాద్య సంగీత ప్రపంచంలో మునిగిపోయేవాడిని. 


కాలం ఆగిన రోజు...

నేను ఆరో తరగతిలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా నాన్న గుండెపోటుతో మరణించారు. అమ్మ ఏకధాటిగా ఏడుస్తోంది. అమ్మను చూసి చెల్లి ఏడుస్తోంది. నాకు మాత్రం కళ్లల్లో ఒక్క చుక్క కన్నీరు రాలేదు. పరిస్థితి ఏంటో అర్థం కాని వయసది. నాన్న చివరి చూపుకోసం సినిమా పెద్దలెందరో వచ్చిపోతున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తయి, అందరూ వెళ్లిపోయాక ఇల్లంతా మూగబోయింది. అమ్మ పుట్టెడు శోకంలో మునిగిపోయింది. చెల్లి చాలా చిన్నపిల్ల. అప్పుడు నాకు దుఃఖం తన్నుకు వచ్చింది. జీవితం అంతా తలకిందులైందనిపించింది. నేనెలాగోలా బతికేస్తాను. కానీ అమ్మాచెల్లెల్ల పరిస్థితి ఏమిటి ఇలా అనేక రకాలుగా ఆలోచించి ఓ పెద్ద నిర్ణయం తీసుకున్నాను. ‘చదువును పూర్తిగా మానేసి డ్రమ్మర్‌గా మారిపోతా’నని అమ్మకి చెప్పా. ఎస్పీ బాలు గారికి ఫోన్‌ చేశా. ఆయన మా నాన్నకి మంచి మిత్రులు. ఆయన బృందంలో చేరాను. అక్కడ అందరూ పదకొండేళ్ల పిల్లవాడినని జాలితో చూసేవారు. ఆర్నెళ్ల క్రితం ఏదో ఇష్టం అనుకున్న పని నేడు ప్రొఫెషన్‌ అయింది. మనం ఊహించలేనిది జీవితం. ఆ తరవాత రాజ్‌కోటి గార్ల దగ్గర, మాధవపెద్ది సురేష్‌, కీరవాణి, వందేమాతరం శ్రీనివాస్‌... ఒక్క దగ్గర ఆగలేదు. అందరితో వర్క్‌ చేసేవాడిని. శివమణి నాన్నకు శిష్యుడు. నన్ను తన సొంత కొడుకులాగా చూసుకున్నారు. ఘంటశాల శివకుమార్‌ కొడుకునని అందరూ ప్రేమగా చూసేవాళ్లు.  నాన్న మంచితనం నన్ను అలా కాపాడింది.


‘ఒక్కడు’తో మలుపు

పద్దెనిమిదేళ్ల వయసప్పుడు అనుకోకుండా శంకర్‌ ‘బాయ్స్‌’ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఏఆర్‌ రహమాన్‌ బృందంలో మా అమ్మ సావిత్రి పాడేవారు. తన ద్వారా శంకర్‌ పరిచయం ఏర్పడింది. రియల్‌ డ్రమ్మర్‌ అయున నేను తెరపై కూడా అదే పాత్రలో నటించడం వల్ల నా గురించి అందరికీ తెలిసింది. ఆ తరవాత చాలా సినిమాల్లో నటించమని కోరారు. కానీ నేనేదీ ఒప్పుకోలేదు. సంగీతమే జీవితం... పాతికేళ్లు వచ్చేసరికి ఎలాగైనా మ్యూజిక్‌ డైరెక్టర్‌ కావాలని గట్టిగా అనుకునేవాణ్ని. వీలున్నప్పుడల్లా ట్యూన్స్‌ చేసుకోవడం అలవాటుగా మారింది. మణిశర్మగారి దగ్గర ‘ఒక్కడు’ కోసం చేరడం జీవితాన్ని మార్చేసింది. అక్కడే ఎనిమిదేళ్లు ఉండిపోయాను. ఆయన దగ్గర ఎన్నో నేర్చుకున్నాను. నాకు ఇరవై నాలుగేళ్లు వచ్చేసరికి 64 మంది మ్యూజిక్‌ డైరెక్టర్లతో తొమ్మిది వందల సినిమాలకు పనిచేశాను. మరాఠీ, ఒరియా, మలయాళం, తమిళ, కన్నడ ఇలా వివిధ భాషల్లో నెంబర్‌ 1 ప్రోగ్రామర్‌ అనే పేరువచ్చింది. ఒకరోజుకి 40 వేల రూపాయలు చార్జ్‌ చేసేవాణ్ని. రోజుకి 30 రూపాయల నుంచి మొదలుపెట్టిన జీవితం నాది. 


అద్భుత సృష్టికర్తలు

ఎక్కువగా వాద్యసంగీతాన్నే వింటుంటాను. ‘డీప్‌ ఫారెస్ట్‌’ నా ఫేవరెట్‌ ఆల్బమ్‌. అదో ఫ్రెంచ్‌ మ్యూజికల్‌ గ్రూప్‌. వాళ్లు శబ్దాలను సృష్టిస్తారు. వాళ్ల సంగీతం వింటుంటే ఆ క్షణం అడవిలో ఉన్నట్టుగా భ్రమపడతాం. మరికాసేపు అయితే ఎడారిలోకి వెళ్లిపోతాం. ఒక్కోసారి వర్షంలో తడిసిముద్దవుతుంటాం. కీబోర్డుల మీద చేసిన శబ్దాలు కావవి. ఓ ఫ్యాన్‌ తిరుగుతుంటే అందులోంచి ఎలాంటి శబ్దాన్ని తీసుకురాగలం అని ఆలోచించి ఒరిజినల్‌ మ్యూజిక్‌ తీసుకువస్తారు. ఎప్పుడూ ఆఫ్‌బీట్‌ సంగీతాన్నే వింటాను. మరో కమర్షియల్‌ సంగీతాన్ని వినడానికి అంతగా ఇష్టపడను. 


అదో మాస్టర్‌ పీస్‌

కొన్ని ఆవిష్కరణలను ‘అన్‌టచబుల్స్‌’గా పేర్కొంటారు. కొంతమంది మహానుభావులు తమ జీవితాలను త్యజించి వాటిని సృష్టిస్తారు. సంగీతపరంగా అలాంటి అద్భుత సినిమా ‘సౌండ్‌ ఆఫ్‌ మ్యూజిక్‌’. ఎప్పటికైనా పూర్తి సంగీత ప్రాధాన్యం ఉన్న సినిమా చేయాలనే ఉంది. కానీ, దానికి చాలా సమయం వెచ్చించాలి. మరే  వర్క్‌ లేకుండా కనీసం రెండేళ్లు దానిపైనే కూర్చోవాలి. 


హాన్స్‌ జిమ్మర్‌

నేటి హాలీవుడ్‌ కంపోజర్లలో హాన్స్‌ జిమ్మర్‌ అంటే చాలా ఇష్టం. ఆయన ఆస్కార్‌ అవార్డు గ్రహీత. ఆయన స్టూడియోకి, స్టేజ్‌ షోలకెళ్లాను. కానీ పర్సనల్‌గా కలవలేదు. హాన్స్‌ సంగీతం ఊహకు అందనిది. ఇక్కడ పది వాయిద్యాలు వాడతారు అనుకుంటే ఒక్క వాద్యంతో మెప్పిస్తారు. ‘ది లయన్‌ కింగ్‌’, ‘ఇంటర్‌స్టెల్లార్‌’, ‘గ్లాడియేటర్‌’ లాంటి చిత్రాలకు సంగీతం అందించిన ఘనత ఆయనది.



మ్యూజిక్‌ థెరఫీనే మనసుకు మందు

సంగీతం ఓ దివ్యౌషధం. నేటి యువతలో గూడుకట్టుకుంటున్న ఆత్మహత్యల ఆలోచనలను సంగీతం ద్వారా దూరం చేయవచ్చు. విదేశాల్లో చాలా మందికి గిటార్‌ ఉంటుంది. దాంతో సాధన చేస్తూ తన ఆందోళనలను తగ్గించుకుంటారు. కేరళలో ప్రతి ఇంట్లో ఓ గాయకుడు ఉంటాడు. అందరు హీరోయిన్స్‌ పాడతారు. వాళ్లకి చిన్నప్పటి నుంచి చదువుతోపాటు సంగీతాన్ని ఓ వ్యాపకంలా భావిస్తారు. తమిళనాడులో పిల్లలకు సంగీతమో, నాట్యమో నేర్పిస్తారు. జీవితం అన్నీ కలగలిపిన ఓ సంచి లాంటిది. రోజూ ఉండే పన్నెండు గంటల్లో అన్ని గంటలూ మనం సంతోషంగా ఉండలేం. ఓ మూడు గంటలు నవ్వుకుంటాం, ఓ మూడు గంటలు ఏదో పనిచేసుకుంటాం, మరో మూడు గంటలు గమ్మునుంటాం, ఇంకో మూడు గంటలు బాధపడుతూ ఉండవచ్చు. నేటి స్పీడ్‌ యుగంలో ఏవో టెన్షన్లు, ఎమోషన్లు వస్తూనే ఉంటాయి. వాటిని మళ్లించడానికి చక్కటి వ్యాపకం సంగీతం. ఎంత బాధలో ఉన్నవారైనా సరే ఒంటరిగా కూర్చుని రెండు పాటలు పాడుకోండి. వెంటనే మీ మూడ్‌ మారిపోతుంది. ప్రశాంతంగా ఉంటుంది. హాయిగా నిద్రపడుతుంది. ఇయర్‌ఫోన్స్‌ వింటూ జాగింగ్‌ చేస్తే మరికొంత ఎక్కువ దూరం పరిగెత్తామని అంటుంటారు చాలా మంది. అలాగే జిమ్‌లో కూడా మ్యూజిక్‌ పెద్దగా పెడతారు. ఆ మ్యూజిక్‌ వింటూ కాసేపైనా మనల్ని మనం మరిచిపోవడానికి. నేడు మ్యూజిక్‌ థెరపీ విశేషంగా ఆకట్టుకుంటోంది. వయసైపోయిన వాళ్లు కూడా సంగీతం, నృత్యం నేర్చుకుంటూ తమ ఏకాకి జీవితాలను సంతోషమయంగా చేసుకుంటున్నారు. అంతటి శక్తి ఉన్న సంగీతాన్ని పిల్లలందరికీ నేర్పించాలని ఈ వరల్డ్‌ మ్యూజిక్‌ డే సందర్భంగా కోరుతున్నాను. నాకు యాభై ఏళ్లు వచ్చేసరికి ఓ మ్యూజిక్‌ స్కూల్‌ స్థాపించాలని కోరిక. అందరికీ ఉచితంగా సంగీతం నేర్పిస్తాను.


- డి.పి.అనురాధ


నాన్న స్ఫూర్తి..

ఇరవై నాలుగేళ్లప్పుడు ఓ సినిమాకు సంగీత దర్శకత్వం వహించే అవకాశం వచ్చింది. అది తమిళ చిత్రం. ఆ తరవాత ‘కిక్‌’ సినిమా సమయంలో టెన్షన్‌తో పదకొండు కిలోలు తగ్గాను. ‘అరవింద సమేత వీర రాఘవ’ వందో చిత్రం. ఇటీవల నేను కంపోజ్‌ చేసిన ‘నోపెళ్లి’ పాట పది మిలియన్‌ వ్యూస్‌ సొంతం చేసుకుంది. మధ్యలో ఎన్నో ఫ్లాపులూ వచ్చాయి, ‘అలవైకుంఠపురంలో’ లాంటి పెద్ద హిట్లూ ఉన్నాయి. ఇందులో నా గొప్పతనం ఏదీ లేదు. అంతా దైవ కృప. నా మనసులో ఎప్పుడూ ఒకటే. నన్ను నమ్ముకునే అమ్మాచెల్లీ ఉన్నారు. వాళ్లని బాగా చూసుకోవాలి. మన పోషణ కోసం అమ్మను మళ్లీ కచేరీలో పాడించకూడదనే. ఈ క్షణం కూడా అదే ధ్యాస. నాన్న చనిపోయిన రోజు వాళ్ల కళ్లల్లో చూసిన బాధ అలాగే నా గుండెలో గడ్డకట్టుకుని ఉండిపోయింది. ఏ మాత్రం బ్యాలెన్స్‌ తప్పినా చెడు వ్యసనాలు కబళిస్తాయి. తమన్‌ మంచి మ్యూజిక్‌ ఇచ్చాడు అనే మాట పెద్దది కాదు. ఎవరి సినిమా హిట్‌ అయినా అలాగే చెబుతారు కానీ, తమన్‌ మంచివాడు, పెద్దల్ని గౌరవిస్తాడు అనే పేరు తెచ్చుకోవడం చాలా కష్టం. మా నాన్న మంచిపేరును చెడగొట్టే పని ఏదీ చేయను. ఈ ఆదివారం ఫాదర్స్‌డే సందర్భంగా నాన్నను, మ్యూజిక్‌డేను పురస్కరించుకుని నా సంగీత ప్రయాణాన్ని నెమరేసుకునే సందర్భం రావడం చాలా సంతోషం. 



Updated Date - 2020-06-21T17:31:13+05:30 IST