మొన్న శివశంకర్ మాస్టర్.. నేడు సిరివెన్నెల.. టాలీవుడ్‌లో వరుస మరణాలు.. నాలుగు రోజుల్లోనే..

తెలుగు సినీ పరిశ్రమను వరుస విషాద ఘటనలు పట్టి పీడిస్తున్నాయి. కొందరు అనారోగ్య కారణంగా చనిపోతుంటే, మరికొందరిని కరోనా మహమ్మారి పొట్టన పెట్టుకుంది. నాలుగు రోజుల కిందట  ప్రముఖ దర్శకుడు కె.ఎస్ నాగేశ్వరరావు పిట్స్ కారణంగా మృతి చెందితే.. నవంబర్‌ 28న ప్రముఖ కొరియోగ్రాఫర్‌ శివశంకర్‌ మాస్టర్‌ ఊపిరితిత్తుల సమస్యతో కన్నుమూయడం తెలిసిందే. ఈ ఘటనలు మరువక ముందే మంగళవారం ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి.. మృతి చెందడం సినీ పరిశ్రమను, తెలుగు ప్రేక్షకులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.

నాలుగు రోజుల వ్యవధిలోనే ముగ్గురు ప్రముఖులు మృతి చెందడంతో తెలుగు సినీ పరిశ్రమలో విషాధ చాయలు అలుముకున్నాయి. 2021 ప్రారంభం నుంచి టాలీవుడ్‌కు పలువురు ప్రముఖులు దూరమయ్యారు. నటుడు నాగయ్య(70) మార్చిలో మృతి చెందారు. ఈయన అల్లు అర్జున్, మంచు మనోజ్‌లు హీరోలుగా క్రిష్ దర్శకత్వంలో వచ్చిన వేదం సినిమాలో మంచి పాత్ర పోషించి ప్రేక్షకుల మన్ననలను అందుకున్నారు. అలాగే దాదాపు 500 సినిమాల్లో నటించి, మంచి పేరు తెచ్చుకున్న సీనియర్ నటుడు పొట్టి వీరయ్య.. ఏప్రిల్ 25న కన్నుమూశారు. నటుడు, యాంకర్‌ అయిన టీఎన్ఆర్.. కరోనా కారణంగా మేలో మృతిచెందారు.

అనంతరం కాలంలో నటుడు, యాంకర్, సినీ విమర్శకుడు కత్తిమహేష్, డైరెక్టర్ సాయి బాలజీ, నిర్మాత బీఏ రాజు, సీనియర్ నటి జయంతి తదితరులు వివిధ కారణాలతో సినీ పరిశ్రమకు దూరమైన విషయం తెలిసిందే. తాజాగా ఆగస్టులో ప్రముఖ నటుడు, సినీ నిర్మాత బొమ్మరెడ్డి రాఘవ ప్రసాద్ మృతి చెందారు. అలాగే సెప్టెంబర్‌లో కరోనా కారణంగా గాన గంధ‌ర్వుడు ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మణ్యం, అక్టోబర్‌లో ప్రముఖ నిర్మాత మహేష్ కోనేరు గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. మహేష్ కోనేరు  జూనియర్ ఎన్టీఆర్‌కు పీఆర్వోగా, ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్ ప్రొడ్యూసర్‌గా ఉండేవారు.

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.