మళ్లీ రీమేక్ చేయను!
ABN , First Publish Date - 2021-09-14T06:31:37+05:30 IST
‘‘రీమేక్ చేసేటప్పుడు ఉన్నది ఉన్నట్టుగా తీస్తే కాపీ పేస్ట్ చేశారంటారు. మార్పులు చేస్తే కథలో ఆత్మను చెడగొట్టామని విమర్శిస్తారు. మాతృకలో ఉన్న అనుభూతి పోకూడదని ‘మాస్ట్రో’ కోసం కొన్నిషాట్లు అలాగే తీశా...

‘‘రీమేక్ చేసేటప్పుడు ఉన్నది ఉన్నట్టుగా తీస్తే కాపీ పేస్ట్ చేశారంటారు. మార్పులు చేస్తే కథలో ఆత్మను చెడగొట్టామని విమర్శిస్తారు. మాతృకలో ఉన్న అనుభూతి పోకూడదని ‘మాస్ట్రో’ కోసం కొన్నిషాట్లు అలాగే తీశా. అయితే, ప్రేమకథలో మార్పులు చేశా. ‘అంధాధున్’ చూసినప్పుడు... చేస్తే ఇలాంటి సినిమా రీమేక్ చేయాలనుకున్నా. చేశాను. అయితే మళ్లీ రీమేక్ చేయను. బేసిగ్గా రీమేక్ చేయడం కొంచెం కష్టమే. పైగా, మాతృకతో పోలుస్తారు. అందుకని, మన కథతో సినిమా తీయడం సులభం’’ అన్నారు మేర్లపాక గాంధీ. నితిన్, నభా నటేశ్ జంటగా నటించిన చిత్రం ‘మాస్ట్రో’. తమన్నా ప్రధాన పాత్ర పోషించారు. రాజ్‌కుమార్ ఆకెళ్ల సమర్పణలో సుధాకర్‌రెడ్డి, నిఖితారెడ్డి నిర్మించారు. శుక్రవారం ఓటీటీలో విడుదలవుతోంది. మేర్లపాక గాంధీ మాట్లాడుతూ ‘‘అరకు దగ్గరలో ఓ ఊరిలో ఉన్నప్పుడు ‘అంధాధున్’ చూశా. ఆ తర్వాత నితిన్, సుధాకర్‌రెడ్డి నుంచి రీమేక్ ఆఫర్ వచ్చింది. నా సినిమాల్లో కామెడీ ఉంటుంది. అయితే, ‘అంధాధున్’లో డార్క్ కామెడీ నచ్చింది. దాంతో పాటు కథ నచ్చడంతో అంగీకరించా. ఆ తర్వాత ప్రేమకథతో పాటు పతాక సన్నివేశాల్లో కొన్ని మార్పులు చేశా. హిందీలో టబు చేసిన పాత్రకు తమన్నాను తీసుకోవాలనేది నా ఆలోచనే. కమర్షియల్ పరంగా బావుంటుందని ఆలోచించా. అయితే, కొన్ని సన్నివేశాల్లో ఆమె నటన చూసి ఆశ్చర్చపోయా. సినిమా చూశాక... ప్రేక్షకులూ ఆశ్చర్చపోతారు. సీనియర్ నరేశ్, హర్ష, ‘రచ్చ’ రవి, మంగ్లీ... అందరూ బాగా నటించారు. మహతి స్వర సాగర్ మంచి సంగీతం అందించారు. నిజానికి, థియేటర్లలో విడుదల చేద్దామనుకున్నాం. కరోనా రెండో దశ వల్ల ఓటీటీకి విడుదల చేయాలని నిర్మాతలు నిర్ణయించారు. ఇటీవల సినిమా చూశాం. నితిన్‌తో పాటు టీమంతా హ్యాపీ. నాకు అయితే నితిన్‌తో స్ట్రయిట్ సినిమా చేయాలనుంది’’ అన్నారు. తదుపరి చిత్రం గురించి త్వరలో వివరాలు వెల్లడిస్తానని చెప్పారు.