‘వైల్డ్‌ డాగ్‌’ మూవీ రివ్యూ

ABN , First Publish Date - 2021-04-02T19:10:29+05:30 IST

కొత్త ద‌ర్శకుల‌ను, టెక్నీషియ‌న్స్‌ను ఎంక‌రేజ్ చేయ‌డంలో ఎప్పుడూ ముందుండే అగ్ర క‌థానాయ‌కుడు అక్కినేని నాగార్జున‌..

‘వైల్డ్‌ డాగ్‌’ మూవీ రివ్యూ

చిత్రం:  వైల్డ్ డాగ్

బ్యానర్:  మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌


నటీనటులు‌:  అక్కినేని నాగార్జున‌, దియా మీర్జా, స‌యామీ ఖేర్‌, అతుల్ కుల‌క‌ర్ణి, అలీ రెజా, అప్పాజీ అంబ‌రీష త‌దిత‌రులు

ఎడిట‌ర్‌:  శ్ర‌వ‌ణ్‌

యాక్ష‌న్‌:  శ్యామ్ కౌశ‌ల్‌, డేవిడ్‌

డైలాగ్స్‌:  కిర‌ణ్ కుమార్‌

సంగీతం: ఎస్‌.ఎస్‌.త‌మ‌న్‌

సినిమాటోగ్ర‌ఫీ:  షానియ‌ల్ డియో

నిర్మాత‌లు:  నిరంజ‌న్ రెడ్డి, అన్వేష్ రెడ్డి

ద‌ర్శ‌క‌త్వం: అహిషోర్ సాల్మ‌న్‌


కొత్త ద‌ర్శకుల‌ను, టెక్నీషియ‌న్స్‌ను ఎంక‌రేజ్ చేయ‌డంలో ఎప్పుడూ ముందుండే అగ్ర క‌థానాయ‌కుడు అక్కినేని నాగార్జున‌. మ‌రోసారి నాగార్జున డెబ్యూ డైరెక్టర్ అహిషోర్ సాల్మ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో చేసిన చిత్రం ‘వైల్డ్ డాగ్‌’. రొటీన్ క‌మ‌ర్షియ‌ల్ మూవీ కాకుండా, యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ‘వైల్డ్ డాగ్‌’ 2007లో గోకుల్ చాట్ స‌హా ప‌లు ప్రాంతాల్లో జ‌రిగిన బాంబ్ బ్లాస్ట్‌ల‌ను నేప‌థ్యంలో తెర‌కెక్కింది. భార‌త‌దేశంలో జ‌రిగిన అతి పెద్ద అండ‌ర్ క‌వ‌ర్ ఆప‌రేష‌న్ ఈ కేసును నేష‌న‌ల్ ఇన్వెస్టిగేష‌న్ ఏజెన్సీ ఎలా డీల్ చేసింద‌నేదే ప్ర‌ధాన క‌థాంశం. ఎన్ఐఏ ఆఫీస‌ర్ విజ‌య్ వ‌ర్మ ఎలా న‌టించాడు?  డైరెక్ట‌ర్ అహిషోర్ సాల్మ‌న్ తొలి చిత్రంతో స‌క్సెస్‌ను సాధించాడా? అనే విష‌యాలు తెలియాలంటే సినిమా క‌థ‌లోకి వెళ‌దాం...


క‌థ‌: 


విజ‌య్ వ‌ర్మ (అక్కినేని నాగార్జున‌) ఎన్ఐఏ ఆఫీస‌ర్‌. తీవ్ర‌వాదులు, నేర‌స్థుల పాలిట విజ‌య్ చాలా నిర్ద‌య‌గా ఉంటాడు. దీంతో అంద‌రూ అత‌న్ని వైల్డ్ డాగ్ అని అంటుంటారు. గోకుల్ చాట్‌లో జ‌రిగిన బాంబ్ బ్లాస్ట్ కార‌ణంగా విజ‌య్ వ‌ర్మ త‌న‌ కుమార్తె న‌వ్య‌ను కోల్పోతాడు. దాంతో ఎన్ఐఏకు దూరంగా ఉంటాడు. అయితే మ‌ళ్లీ దేశంలో వ‌రుస బాంబ్ బ్లాస్ట్‌లు జ‌రుగుతాయి. ఎలాంటి క్లూ కూడా దొర‌క‌దు. దాంతో ఉన్న‌తాధికారులు కేసును విజ‌య్ వ‌ర్మ నేతృత్వంలోని ఎన్ఐఏ(నేష‌న‌ల్ ఇన్వెస్టిగేష‌న్ ఏజెన్సీ) టీమ్‌కి అప్ప‌గిస్తారు. ఇండియ‌న్ మొజాహిద్దీన్‌కి చెందిన ఖ‌లీద్ ప్లానింగ్‌తోనే ఇండియాలో బ్లాస్టులు జ‌రుగుతున్నాయ‌ని విజ‌య్ వ‌ర్మ అండ్ టీమ్ క‌నిపెడుతుంది. ఖ‌లీద్‌ను ట్రాప్ చేసి ప‌ట్టుకోవ‌డానికి ఓ ప్లాన్ చేస్తారు.


ఆ ప్లానింగ్ ప్ర‌కారం ఖ‌లీద్‌ను ప‌ట్టుకునే స‌మ‌యంలో చిన్న పొర‌పాటు జ‌రుగుతుంది. ఖ‌లీద్ దొర‌క్కుండా త‌ప్పించుకుంటాడు. త‌ద‌నాంత‌ర ప‌రిస్థితుల కార‌ణంగా విజ‌య్ వ‌ర్మ‌ను సస్పెండ్ చేస్తారు. స‌స్పెండ్ అయినా కూడా విజ‌య్ వ‌ర్మ త‌న టీమ్ స‌హాయంతో ఖ‌లీద్ అచూకీ క‌నుగొంటాడు. ఇంత‌కీ ఖ‌లీద్ నేపాల్‌లో ఎందుకు దాక్కొంటాడు? అత‌న్ని ప‌ట్టుకోవ‌డానికి విజ‌య్ వ‌ర్మ అండ్ టీమ్ ఎలాంటి ప్లాన్ చేస్తుంది?  చివ‌ర‌కు విజ‌య్ ప్లాన్ వ‌ర్క‌వుట్ అవుతుందా? ఖ‌లీద్ దొరుకుతాడా?  అనే విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 


సమీక్ష‌:‌


వైల్డ్ డాగ్ ఫస్టాఫ్ చూస్తే.. వరుస బాంబ్ బ్లాస్ట్‌లు జ‌రుగుతాయి. ఈ తీవ్ర‌వాద చ‌ర్య‌ల‌కు కార‌ణ‌మైన వారిని క‌నుక్కునే క్ర‌మంలో నాగార్జున పాత్ర‌ను ప‌రిచయం చేస్తారు. విజ‌య్ వ‌ర్మ పాత్ర ఎలా బిహేవ్ చేస్తాడు అనే విష‌యాన్ని ఫైట్ ద్వారా చూపించారు. అలాగే ఎన్ఐఏ ఆఫీస‌ర్‌గా క‌నిపించిన నాగార్జున కూడా బ్లాస్టుల్లో త‌న కుమార్తెను కోల్పోయాడు.. అనే ఓ ఎమోష‌న‌ల్ యాంగిల్‌ను కూడా చూపించారు. ఈ పాత్ర‌లో నాగార్జున చ‌క్క‌గా సూట్ అయ్యాడు. ఇత‌న భార్య పాత్ర‌లో దియా మీర్జా క‌నిపించింది. ఇక అలీరెజా ఇత‌ర స‌భ్యుల‌తో నాగ్ పాత్ర కేసులో ప్ర‌ధాన సూత్ర‌ధారి ఎవ‌ర‌నే విష‌యాన్ని క‌నిపెడుతుంది. ఆ పాత్ర‌ను ప‌ట్టుకోవ‌డానికి చేసే ప్లానింగ్‌ను చ‌క్క‌గా తీశారు. చివ‌రి నిమిషంలో ప్లాన్ బెడిసి కొట్ట‌డం .. అక్క‌డ నుంచి పేలుళ్ల‌కు కార‌ణ‌మైన ఖ‌లీద్ క‌నిపించ‌కుండా నేపాల్‌లో ప్ర‌త్య‌క్ష‌మ‌వుతాడు. ఇదంతా ఫ‌స్టాఫ్‌లో ఉంటే సెకండాఫ్‌లో ఖ‌లీద్‌ పాత్ర‌ను ప‌ట్టుకోవ‌డానికి విజ‌య్ వ‌ర్మ త‌న టీమ్‌తో క‌లిసి కోవ‌ర్ట్ ఆప‌రేష‌న్‌ను చేస్తాడు. అక్క‌డ‌కు వెళ్ల‌డం అక్కడ లోక‌ల్ మాఫియా విజ‌య్‌పై ఎటాక్ చేయ‌డం.. వారిని క‌నిపెట్టే క్ర‌మంలో వారికొక లీడ్ దొరికే స‌న్నివేశాల‌తో సాగుతుంది. 


చివ‌ర‌కు విల‌న్ త‌న ప్లానింగ్‌ను లీక్ చేసి విజ‌య్ వాళ్ల‌ను చంపాల‌నుకోవ‌డం.. వారు విల‌న్‌ను ప‌ట్టుకోవ‌డం వంటి స‌న్నివేశాల‌తో సెకండాఫ్ ..క్లైమాక్స్ వ‌ర‌కు వ‌స్తుంది.  అక్క‌డ నుంచి ఖ‌లీద్‌ను ఇండియాకు ఎలా తీసుకొస్తార‌నేది క‌థాంశం. అయితే సినిమా అంతా ఓ ప్యాట్ర‌న్‌లో సాగుతుంది. నాగ్‌, అహిషోర్ చేసిన‌ ప్ర‌య‌త్నం బాగానే ఉంది కానీ.. గ్రిప్పింగ్‌గా లేదు. ఎక్క‌డా ప్రేక్ష‌కుడు ఎగ్జ‌యిట్ అయ్యే స‌న్నివేశాలు క‌నిపించ‌వు. పాట‌లు లేకుండా సినిమాను రెండు గంట‌ల పైగానే లాగార‌నిపిస్తుంది. ఇంకాస్త క్రిస్పిగా చేసుంటే బావుండేద‌నిపించింది. త‌మ‌న్ నేప‌థ్య సంగీతం కూడా సో సోగానే ఉంది. షానియ‌ల్ డియో సినిమాటోగ్ర‌ఫీ ఓకే. డైరెక్ట‌ర్ అహిషోర్ సాల్మ‌న్ నిజ ఘ‌ట‌న‌లను ఆధారంగా చేసుకుని క‌థ‌ను త‌యారు చేసుకున్నాడు కానీ.. ఎగ్జ‌యిట్‌మెంట్‌ను క్రియేట్ చేయ‌డంలో స‌క్సెస్ కాలేదు. తీవ్ర‌వాద చ‌ర్య‌లు, వాటిని అరిక‌ట్ట‌డానికి హీరో అండ్ టీమ్ చేసే ప్లానింగ్స్ పై స్పెష‌ల్ ఓపీఎస్ వంటి వెబ్ సిరీస్‌‌, బాలీవుడ్ మూవీ బేబీ వంటివి ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాయి. వాటిలో ఉన్న ఆస‌క్తి వైల్డ్ డాగ్‌లో క‌నిపించ‌లేదు..


చివ‌ర‌గా... వైల్డ్ డాగ్‌... ఎగ్జ‌యిట్‌మెంట్ మిస్


Updated Date - 2021-04-02T19:10:29+05:30 IST