సిరివెన్నెలలో ఈ పాట కట్ అయ్యిందని తెలుసా?

'సిరివెన్నెల' సినిమా విడుదల కాకముందే చెంబోలు సీతారామశాస్త్రి ఇంటిపేరు 'సిరివెన్నెల'గా మారింది. సినిమా టైటిల్స్ లోనే అలా వేయించేశారు కళాతపస్వి కె. విశ్వనాథ్. అందులో అన్ని పాటలకి అంత గొప్ప సాహిత్యపు గుబాళింపులు అద్దారు సీతారామశాస్త్రి. అయితే, ఆ సినిమాలో ఒక పాటలోంచి ఒక చరణం కట్ చేయవల్సి వచ్చిందని తెలుసా?


"చందమామ రావె జాబిల్లి రావే... కొండెక్కి రావె గొగుపూలు తేవే" అనే మధురగీతంలో ఇంకా తీయని ఒక చరణం కోతకి గురయ్యింది. ఆ చరణం ఇది:


"నందనందనుని వంశీ నాదము విన్నావట
సుందర బృందావన నందనమును కన్నావట
రాసలీలనాటి ఊసు తెలియజేయ రావే
నాటి స్మృతుల వెన్నెలనిటు నేడు విరియనీవే"
ఎందుకిది కట్ అయ్యింది? ఏమిటి తెర వెనక కథ?


'సిరివెన్నెల' సినిమా తీసినంత కాలం విశ్వనాథ్ తోనే వున్నారు సీతారామశాస్త్రి. రోజూ చర్చలే. "చందమామ రావే!" పాట తెలుసు కదా.  వెన్నెల్లో బృందావనం చూపించమని పాప మారాం చేస్తుంటే,  కథానాయకుడు హరిప్రసాద్ తాను చూపిస్తానని తీసుకువెళ్తాడు. ఇద్దరికీ చూపు లేదు. అయినా, హరిప్రసాద్ తన మనోనేత్రంతో చూసి, ఆ అనుభూతిని వేణువులో నింపి ఇతరులకి కూడా చూపించగలడు. అదీ సన్నివేశం. మామ - కె.వి.మహదేవన్ ఒక ట్యూన్ ఇచ్చారట. వెన్నెల అనగానే చిన్న పిల్లలకి అమ్మపాడే అన్నమయ్య కీర్తన - 'చందమామ రావే!' పల్లవితోనే ఉండాలని అన్నారట విశ్వనాథ్. ఆ పల్లవితోనే, 'చలువ చందనములు పూయ చందమామ రావె...' మొదటి చరణం రాసేశారు సిరివెన్నెల. హరిప్రసాద్ వేణుగానం వల్ల వెన్నెల్లో బృందావనం చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది పాపకి.

ఇక రెండో చరణం- "ఎవరైనా 'బృందావనం గురించి ఎలా చెబుతారో ఏంచెబుతారో అదే రెండో చరణంగా రాయండి! ఆ చరణం వినగానే ఆ పాప  'కృష్ణా ముకుందా మురారే!' అని పాడేట్టు ఉండాలి ఈ చరణం..." అన్నారట విశ్వనాథ్. 'మునిజన మానస మోహిని యోగిని బృందావనం'- రెండో చరణం అయిపోయింది.

కానీ, సీతారామశాస్త్రికి తృప్తి కలగలేదట. హరిప్రసాద్ వంశీనాదంతో ఆ పాపకి వెన్నెల ఫీలింగైతే వచ్చిందిగాని, వెన్నెలకీ బృందావనానికి లింకు ఎలా పెట్టడం? అలా లింకు పెట్టే చరణం ఈ రెండు చరణాల మధ్య పెడితే పాటకి పరిపూర్ణత  వస్తుంది అనిపించిందట ఆయనకి. అంతే, 'నందనందనుడి వంశీ నాదము విన్నవటగా' అనే చరణం రాసేసి, కళాతపస్వికి చూపించారు. విశ్వనాథ్ ఎంతో మెచ్చుకున్నారు గానీ, సినిమా నిడివి సమస్య వల్ల ఆ చరణాన్ని వాడలేదని తన 'సిరివెన్నెల తరంగాలు 'పుస్తకంలో రాసుకొచ్చారు సీతారామశాస్త్రి.

ఆ పాట పూర్తి పాఠం ఇది:

చందమామ రావె జాబిల్లి రావే
కొండెక్కి రావె గొగుపూలు తేవే

చలువ చందనములు పూయ చందమామ రావె
జాజిపూల తావినీయ జాబిల్లి రావే
కలువ చెలువ కలలు విరియ కొండనెక్కి రావె
గగనపు విరితోటలోని గోగుపూలు తేవే
                ||చందమామ||
నందనందనుని వంశీ నాదము విన్నావట
సుందర బృందావన నందనమును కన్నావట
రాసలీలనాటి ఊసు తెలియజేయ రావే
నాటి స్మృతుల వెన్నెలనిటు నేడు విరియనీవే
                ||చందమామ||
మునిజన మానస మోహిని యోగిని బృందావనం
మురళీ రవళికి ఆడిన నాగిని బృందావనం
రాధా మాధవ గాథల రంజిలు బృందావనం
గోపాలుని మృదు పద మంజీరము బృందావనం
బృందావనం బృందావనం
            ||చందమామ||


అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.