నరేశ్ ప్రెస్‌మీట్‌కి జీవిత ఎందుకు రాలేదు?

మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్(మా) ఎన్నిక‌ల‌కు ఇంకా మూడు నెల‌ల స‌మ‌యం ఉంది. కానీ ఇప్ప‌టి నుంచి అధ్య‌క్ష ప‌ద‌వికి జ‌రగ‌బోయే ఎన్నిక‌ల పోరుకి సంబంధించి హీట్ పెరుగుతుంది. మంచు విష్ణు, ప్ర‌కాశ్‌రాజ్‌, జీవితా రాజ‌శేఖ‌ర్‌, హేమ తాము ‘మా’ ప్రెసిడెంట్ బ‌రిలో ఉన్న‌ట్లు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ‘మా’ చ‌రిత్ర‌లో ఎన్న‌డూ లేని విధంగా తొలిసారి అధ్య‌క్ష ప‌ద‌వికి న‌లుగురు స‌భ్యులు పోటీ చేస్తుండటం టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా మారింది. ప్ర‌కాశ్‌రాజ్ తొలి ప్రెస్‌మీట్‌ను నిర్వ‌హించి త‌న ప్యానెల్‌ను ప్ర‌క‌టించారు కూడా. ఈ నేప‌థ్యంలో ‘మా’ ప్ర‌స్తుత అధ్య‌క్షుడు వీకే న‌రేశ్‌, కార్య‌ద‌ర్శి జీవితా రాజశేఖ‌ర్ ప్రెస్‌మీట్‌ను నిర్వ‌హిస్తున్న‌ట్లు శుక్ర‌వారం తెలియ‌జేశారు. ప్రెస్‌మీట్‌ను నిర్వ‌హించారు అయితే ఈ ప్రెస్‌మీట్‌లో న‌రేశ్ మాత్ర‌మే పాల్గొన్నారు. అయితే ఈ స‌మావేశంలో జీవితా రాజ‌శేఖ‌ర్ పాల్గొన‌క పోవ‌డం, ‘మా’ ప్రెస్‌మీట్‌ను చాంబ‌ర్‌లో కాకుండా న‌రేశ్ ఇంట్లో నిర్వ‌హించ‌డం అనేది  చ‌ర్చకు దారి తీస్తోంది. 

జీవిత గైర్హాజ‌రుకు అదే కార‌ణమా?

మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ఇప్ప‌టి వ‌ర‌కు నిర్వ‌హించిన కార్య‌క్ర‌మాల‌ను వివ‌రించాల్సిన ప్రెస్‌మీట్‌కు జీవితా రాజ‌శేఖ‌ర్ పాల్గొంటుంద‌ని చివ‌రి వ‌ర‌కు అన్నారు. కానీ చివ‌రి నిమిషంలో ఆమె గైర్హాజ‌ర‌య్యారు. దీనికి రెండు ర‌కాల కార‌ణాలున్నాయ‌ని లుక‌లుక‌లు వినిపిస్తున్నాయి. అధ్య‌క్షుడిగా వ్య‌వ‌హ‌రించిన న‌రేశ్‌తో జీవిత‌కు పొస‌గ‌క‌పోవ‌డం. వీరి మ‌ధ్య ఉన్న మ‌న‌స్ప‌ర్ద‌లు ఇది వ‌ర‌కే మీడియా ముఖంగా బ‌య‌ట‌కు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ బేదాభిప్రాయాల వ‌ల్ల‌నే జీవిత ప్రెస్‌మీట్‌కు రాలేద‌నేది ఓ కార‌ణ‌మ‌యితే, ‘మా’ కార్య‌ద‌ర్శిగా ఉన్న జీవితా రాజ‌శేఖ‌ర్..రానున్న ఎన్నిక‌ల్లో ప్రెసిడెంట్‌గా పోటీ చేస్తున్నారు. ఇలాంటి స‌మ‌యంలో ప్రెస్‌మీట్‌కు హాజ‌రైతే మీడియాకు..పోటీ చేయ‌డానికి గ‌ల కార‌ణాన్ని సూటిగా వివ‌రించాల్సి ఉంటుంద‌నేది మ‌రో కార‌ణమ‌ని టాక్‌. 

తొల‌గ‌ని సందిగ్ద‌త‌..!

నిజానికి ఈసారి ‘మా’  అధ్య‌క్ష ఎన్నిక‌లు మంచు విష్ణు, ప్ర‌కాశ్‌రాజ్ మ‌ధ్య‌నే ఉంటుంద‌ని అంద‌రూ అనుకుంటున్న త‌రుణంలో తెర‌పైకి అనూహ్యంగా జీవితా రాజ‌శేఖ‌ర్ వ‌చ్చారు. మ‌రో వైపు హేమ కూడా పోటీలో ఉన్న‌ట్లు తెలిపారు. నిజానికి విష్ణు మా ఎన్నిక‌ల్లో నిలబ‌డ‌తాడ‌న‌గానే అత‌నికి న‌రేశ్ మ‌ద్ద‌తుని ప్ర‌క‌టించారు. ఇలాంటి త‌రుణంలో న‌రేశ్‌, జీవితా రాజ‌శేఖ‌ర్ ప్రెస్‌మీట్ నిర్వ‌హిస్తార‌ని అన్న‌ప్పుడు పోటీ నుంచి జీవిత త‌ప్పుకుంటార‌ని టాక్ వ‌చ్చింది. అదే స‌మ‌యంలో మా అధ్య‌క్ష‌ ఎన్నిక‌ల‌పై జీవితా రాజ‌శేఖ‌ర్ త‌న స్ప‌ష్ట‌త‌ను తెలియ‌జేస్తార‌ని అంద‌రూ భావించారు. కానీ చివ‌రి నిమిషంలో జీవిత ప్రెస్‌మీట్‌కు రాక‌పోవ‌డంతో సందిగ్ధ‌త తొల‌గ‌లేదు. అయితే ఈ ఎన్నిక‌ల‌కు మ‌రింత స‌మ‌యం ఉండ‌టంతో ఒక‌రిపై ఒక‌రు ఎలాంటి విమ‌ర్శ‌నాస్త్రాలు ఎక్కుపెడతార‌నే దానిపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది.

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.