ఆ కోరిక ఎప్పుడు తీరుతుందో ..ఏమో

సాధారణంగా హీరోయిన్‌కు పెళ్లి అయితే అవకాశాలు తగ్గుతాయని అంటుంటారు. కానీ అది నిజం కాదని ప్రియమణి వంటి హీరోయిన్లు నిరూపిస్తున్నారు. తెలుగు సహా ఇతర దక్షిణాది భాషల్లో అగ్ర హీరోలందరి సరసన ప్రియమణి నటించి పేరు తెచ్చుకున్నారు. పెళ్లయ్యాక కూడా ఆమె  ప్రాధాన్యం కలిగిన పాత్రలు పోషిస్తూ కథానాయికగా కొనసాగడం విశేషం. వెంకటేశ్‌ హీరోగా నటించిన ‘నారప్ప’ చిత్రంలో గ్రామీణ మహిళ పాత్ర పోషించారు. ఈ నెల 20న అమెజాన్‌ ప్రైమ్‌లో ‘నారప్ప’ విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘చిత్రజ్యోతి’తో ప్రియమణి ప్రత్యేకంగా మాట్లాడారు. 


సురేష్‌ ప్రొడక్షన్స్‌ నుంచి కాల్‌ వచ్చింది. ‘‘అసురన్‌’ చిత్రాన్ని తెలుగులో రీమేక్‌ చేస్తున్నాం, అందులో సుందరమ్మ పాత్ర కోసం మిమ్మల్ని అనుకుంటున్నాం’ అని చెప్పారు. హైదరాబాద్‌ వచ్చినప్పుడు వారి ఆఫీసుకు వెళ్లి సురేష్‌బాబు గారిని,  దర్శకుడు శ్రీకాంత్‌ గారిని కలిశాను. అప్పుడు  లుక్‌టెస్ట్‌ చేశారు. వెంకటేశ్‌గారు, శ్రీకాంత్‌ గారు వెంటనే ఓకే అన్నారు. అలా సుందరమ్మ కేరెక్టర్‌ చేసే అవకాశం నాకు దక్కింది. 


సుందరమ్మ లాంటి గ్రామీణ మహిళ పాత్రను చేయడం తెలుగులో ఇదే తొలిసారి. ఇంతకుముందు   తమిళ, మలయాళ చిత్రాల్లో  ఈ తరహా పాత్రలు చేసిన అనుభవం ఉంది కాబట్టి నా పాత్ర కోసం పెద్దగా ప్రిపేర్‌ అవడం కానీ, హోం వర్క్‌ కానీ చేయలేదు. . లుక్‌టెస్ట్‌లోనే ఈ పాత్ర నాకు నప్పుతుందని అర్ధమైంది.  ఒరిజినల్‌ చిత్రం చూడడంతో నా పాత్ర విషయంలో స్పష్టమైన అవగాహన ఏర్పడింది. 


సుందరమ్మది కథను మలుపు తిప్పే పాత్ర. దాని ఔచిత్యం దెబ్బతినకుండా తెలుగు నేటివిటీకి తగ్గట్టు కొన్ని మార్పులు చేశారు. నటన విషయంతో పాటు అనంతపురం యాసలో సంభాషణలు పలికే విషయంలో దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. డైలాగుల చెప్పడంలో నేను తడబడినా ఆయన వెంటనే సరిదిద్దేవారు. ఒక్కో పదాన్ని ఎలా పలకాలో వివరించి చెప్పేవారు. అలాగే డైలాగ్‌లు పలికే విషయంలో వెంకటేష్‌గారు కూడా సాయం చేశారు. 


గతంలో వెంకటేశ్‌ గారితో కలసి పనిచేసే అవకాశం రెండు మూడు సార్లు వచ్చింది. కానీ బిజీ షెడ్యూల్‌ వల్ల అప్పుడు వీలు కాలేదు. ఫైనల్‌గా ‘నారప్ప’లో అవకాశం దక్కినందుకు హ్యాపీగా ఉంది. ‘‘నారప్ప’ సినిమాతోనే మనిద్దరం తొలిసారి కలసి వర్క్‌ చేయాలని రాసిపెట్టి ఉందేమో’ అని వెంకీ ఓ సందర్భంలో అన్నారు. సుందరమ్మగా. నేను ఎలా చేశానో  ప్రేక్షకులే  చెప్పాలి. 


సీనియర్‌ హీరోలు నాగార్జున, బాలకృష్ణలతో చేశాను. చిరంజీవిగారితో, వెంకటేష్‌ గారితో చేయాలనే కోరిక అలాగే మిగిలిపోయింది. ‘నారప్ప’తో వెంకటేశ్‌గారితో నటించే అవకాశం దక్కింది. ఇక ఇప్పుడు చిరంజీవి గారితో కలసి వర్క్‌ చేయడం కోసం ఆసక్తితో  ఎదురుచూస్తున్నాను. ఆ కోరిక ఎప్పుడు తీరుతుందో ఏమో!


వెంకటేష్‌ గారితో పనిచేయడం చాలా హ్యాపీగా అనిపించింది. సెట్‌లో ఆయన్ను ఇష్టపడని వారు లేరు. చాలా సింపుల్‌గా ఉంటూ అందర్నీ నవ్విస్తూఉంటారు. ఆయనకు సెన్సాఫ్‌ హ్యూమర్‌ ఎక్కువ.  సీరియస్‌గా ఉన్న వాతావరణాన్ని తేలికపరుస్తారు. అయితే సన్నివేశంలో నటించేటప్పుడు మాత్రం ఆయన చాలా సీరియస్‌గా ఉంటారు. ఒక్కసారి డైరెక్టర్‌ కట్‌ చెప్పాక చాలా జోవియల్‌గా మారిపోతారు. 

ప్రస్తుతం రానాతో ‘విరాటపర్వం’ చేశాను. అది కూడా విడుదలకు సిద్ధమవుతోంది.  హిందీలో అజయ్‌దేవగన్‌తో ‘మైదాన్‌’ చిత్రం చేస్తున్నాను. నా పాత్రకు సంబంధించిన షూటింగ్‌ పూర్తయింది. మరో  మూడు పాన్‌ ఇండియా చిత్రాలు అంగీకరించాను. త్వరలోనే అవి సెట్స్‌పైకి వెళ్లనున్నాయి. ఒక వెబ్‌సిరీస్‌ అంగీకరించాను. త్వరలోనే అఽధికారికంగా ప్రకటిస్తారు. 

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.