మీకు బెయిల్ రాలేదని బ్యారక్‌లో‌ ఉన్న Aryan Khan కు జైలు సిబ్బంది చెప్పగానే..

ABN , First Publish Date - 2021-10-21T20:10:30+05:30 IST

షారూఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో పట్టుబడిన సంగతి తెలిసిందే. దాదాపుగా ఈ కేసులో ఇప్పటి వరకు 20మందిని నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు అరెస్టు చేశారు.

మీకు బెయిల్ రాలేదని బ్యారక్‌లో‌ ఉన్న Aryan Khan కు జైలు సిబ్బంది చెప్పగానే..

షారూఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో పట్టుబడిన సంగతి తెలిసిందే. దాదాపుగా ఈ కేసులో ఇప్పటి వరకు 20మందిని నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు అరెస్టు చేశారు. అనంతరం ఆర్యన్ ఖాన్ బెయిల్‌కు దరఖాస్తు చేసుకోగా ఆ పిటిషన్ ప్రత్యేక కోర్టులో అక్టోబర్ 20న విచారణకు వచ్చింది. అతడికి అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాలతో సంబంధాలు ఉన్నాయంటూ ఆ బెయిల్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. షారూఖ్ కుటుంబంతో సహా, అభిమానులందరూ ఆర్యన్ కు బెయిల్ వస్తుందని ఆశించారు. కానీ, కోర్టులో ఆర్యన్‌కు చుక్కెదురు కావడంతో అందరూ నిరాశకు లోనయ్యారు.   


ఆర్యన్‌తో సహా అర్భాజ్ మర్చంట్, మున్మున్ ధమేచా తదితరుల బెయిల్ పిటిషన్‌ను కూడా కోర్టు తిరస్కరించింది. ఆ నిర్ణయం వెలువడగానే జైలు అధికారులు వెంటనే ఆర్యన్‌కు.. ‘‘ నీకు బెయిలు రాలేదు ’’ అని తెలిపారు. బెయిల్ రాలేదని వార్త తెలియగానే అతడు నిరాశకు లోనయ్యాడని జైలు అధికారులు తెలుపుతున్నారు. ఆ వార్తను విన్న వెంటనే విచారంతో ఎవరితోను మాట్లాడకుండా బ్యారక్‌లో ఒక మూలన కూర్చున్నాడని అధికారులు చెప్పారు. 


అతడికి బెయిల్ ఇవ్వకపోవడానికి కోర్టు అనేక కారణాలను వెల్లడించింది. ‘‘ ఆర్యన్ ఒక శక్తిమంతమైన కుటుంబానికి చెందినవాడు. ఒక వేళ అతడికి బెయిలు ఇస్తే కేసుకు సంబంధించిన సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉంది. అతడు డ్రగ్స్ తీసుకుంటున్నాడని వాట్సప్ చాట్‌ల ద్వారా తెలుస్తోంది. ఒక వేళ బెయిల్‌ను మంజూరు చేసినట్టయితే డ్రగ్స్ తీసుకోవడం ఆపేస్తాడని చెప్పలేం. క్రూయిజ్‌లో రేవ్ పార్టీ  జరిగిన సమయంలో ఎన్సీబీ అధికారులకు అతడి వద్ద ఎటువంటి డ్రగ్స్ లభించలేదు. కానీ, డ్రగ్స్ తీసుకుంటున్నాడని చెప్పడానికి బలమైన ఆధారాలున్నాయి ’’ అని పేర్కొంటూ బెయిల్‌ను తిరస్కరించింది.


బాలీవుడ్‌కు చెందిన యువనటితో డ్రగ్స్‌ గురించి చర్చించినట్టు అతడి వాట్సప్ చాట్‌ల ద్వారా తెలుస్తోందని ఎన్సీబీ అధికారులు పేర్కొన్నారు. కోర్టుకు ఈ సాక్ష్యాలను అక్టోబర్ 14న  వారు సమర్పించారు. క్రూయిజ్‌లో రేవ్ పార్టీ జరిగిన సమయంలో ఆమె అక్కడే ఉన్నట్టు వెల్లడించారు. ఆ యువనటిని త్వరలో ఎన్సీబీ అధికారులు ప్రశ్నించే అవకాశం ఉంది. తాజాగా అక్టోబర్  21న షారూఖ్ నివాసంతో పాటు, అనన్య పాండే ఇళ్లపై  ఎన్సీబీ అధికారులు దాడులు జరపడం గమనార్హం.  విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతోన్న లైగర్ సినిమాలో అనన్యపాండే హీరోయిన్‌గా నటిస్తోంది.

Updated Date - 2021-10-21T20:10:30+05:30 IST