ఇంకో 20 ఏళ్లు నటించాలనుంది!

ABN , First Publish Date - 2021-12-08T07:14:05+05:30 IST

‘ఇష్టం’ సినిమాతో టాలీవుడ్‌ తెరపై తళుక్కున మెరిసిన సన్నజాజి తీగ శ్రియా శరణ్‌. వయసు పెరిగినా వన్నెతగ్గని అందాలతో 20 ఏళ్ల సినీ కెరీర్‌ను పూర్తిచేసుకున్నారు. కథానాయికగా అగ్రహీరోలందరితో జోడీకట్టారు...

ఇంకో 20 ఏళ్లు నటించాలనుంది!

‘ఇష్టం’ సినిమాతో టాలీవుడ్‌ తెరపై తళుక్కున మెరిసిన సన్నజాజి తీగ శ్రియా శరణ్‌.  వయసు పెరిగినా వన్నెతగ్గని అందాలతో 20 ఏళ్ల సినీ కెరీర్‌ను పూర్తిచేసుకున్నారు. కథానాయికగా అగ్రహీరోలందరితో జోడీకట్టారు. గతేడాది ఓ పాపకు జన్మనిచ్చిన శ్రియ  ‘గమనం’ చిత్రంతో డిసెంబరు 10న తెలుగు ప్రేక్షకుల మందుకొస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె సినిమా విశేషాలను పంచుకున్నారు. 


‘ఇష్టం’ నా తొలి సినిమా. ఆ రోజులు నాకు ఇంకా గుర్తున్నాయి. నేను చేసిన సినిమాల్లో కొన్ని హిట్టయ్యాయి. కొన్ని ప్లాపయ్యాయి. ఇప్పటికి ఇరవై ఏళ్లుగా నటిస్తూనే ఉన్నాను. ప్రేక్షకులు నన్ను ఆదరిస్తూనే ఉన్నారు. ఇంకో ఇరవై ఏళ్లు నటించాలనుంది. అక్కినేని నాగేశ్వరరావు గారు చివరి క్షణం దాకా నటించారు. ‘మనం’ సినిమా చేసే సమయంలో ‘ఈ సినిమా పూర్తిచేసే చనిపోతాను’ అనేవారు. అలాగే నాక్కూడా జీవితంలో చివరిక్షణం దాకా సినిమాలు చేస్తూనే ఉండాలని ఉంది. పాప పుట్టాక కథల ఎంపికలో నా ప్రాధాన్యం మారింది. నా కూతురు, కుటుంబం గర్వపడే సినిమాలే చేయాలనుకుంటున్నాను. నా మనసుకు నచ్చిన పాత్రలే చేస్తాను.


‘గమనం’ కథ వినగానే నా కళ్లు చెమ్మగిల్లాయి. కమల లాంటి పాత్ర దొరికినందుకు ఆనందంగా ఉంది. ఇది మహిళా ప్రాధాన్య చిత్రం కాదు. మనల్ని మనం తెలుసుకునే కథ. మనిషిలో జరిగే అంతర్గత సంఘర్షణను ఆవిష్కరిస్తుంది. జీవితంలో ప్రతి ఒక్కరికీ క్లిష్ట పరిస్థితులు ఎదురవుతాయి. దాన్నుంచి బయటపడి ఎలా ముందుకుసాగుతామనేదే ‘గమనం’. సమాంతరంగా సాగే మూడు కథల ప్రయాణంలో మానవ సంబంధాల్ని చక్కగా చూపించారు.  సాయిమాధవ్‌ బుర్రా మనసుకు హత్తుకునేలా సంభాషణలు రాశారు.


ఈ సినిమా షూటింగ్‌ సమయంలో నా ఫ్రెండ్‌ చనిపోయారు. ఆ బాధలోనే షూటింగ్‌ పూర్తి చేశాను. సినిమాలో నేను వినికిడిలోపం ఉన్న దివ్యాంగురాలి పాత్రలో కనిపిస్తాను. నిస్సహాయతతో ఉన్న మహిళ సాగించే ప్రయాణానికి కమల ప్రతీకలా కనిపిస్తుంది. నాకు బట్టలు కుట్టడం రాదు. కానీ కమల పాత్ర కోసం నేర్చుకున్నాను. నా పాత్ర కు హిందీలో డబ్బింగ్‌ చెప్పగలను. కానీ తెలుగులో అంత బాగా రాదని డబ్బింగ్‌ ప్రయత్నించలేదు. మహిళా దర్శకురాలుతో తెలుగు సినిమా చేయడం ఇదే తొలిసారి. సృజనారావుకు సినిమాపై ఫ్యాషన్‌ మంచి విజన్‌ ఉంది. 

Updated Date - 2021-12-08T07:14:05+05:30 IST