శ్రీవారి ఆశీస్సులతో విష్ణు గెలిచాడు

ABN , First Publish Date - 2021-10-19T06:36:23+05:30 IST

తిరుమల శ్రీవారి ఆశీస్సులతో తన బిడ్డ విష్ణు మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) అధ్యక్షుడిగా గెలిచాడని డాక్టర్‌ మోహన్‌ బాబు అభిప్రాయపడ్డారు. సోమవారం ఉదయం కుమారుడు విష్ణు, కుమార్తె లక్ష్మీప్రసన్న, అసోసియేషన్‌ సభ్యులు...

శ్రీవారి ఆశీస్సులతో విష్ణు గెలిచాడు

తిరుమల శ్రీవారి ఆశీస్సులతో తన బిడ్డ విష్ణు మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) అధ్యక్షుడిగా గెలిచాడని డాక్టర్‌ మోహన్‌ బాబు అభిప్రాయపడ్డారు. సోమవారం ఉదయం కుమారుడు విష్ణు, కుమార్తె లక్ష్మీప్రసన్న, అసోసియేషన్‌ సభ్యులు బాబూమోహన్‌, మాదాల రవి, శివబాలాజీ, గౌతంరాజు, జయవాణి, కల్యాణి తదితరులతో కలిసి శ్రీవేంకటేశ్వరస్వామిని మోహన్‌ బాబు దర్శించుకున్నారు. ఆలయ అఽధికారులు ప్రత్యేక దర్శనం కల్పించి లడ్డూప్రసాదాలు అందజేశారు. అనంతరం మోహన్‌బాబు మీడియాతో మాట్లాడుతూ వేంకటేశ్వరస్వామి, సాయిబాబాతో పాటు ‘మా’ సభ్యులందరి ఆశీస్సులతో విష్ణు అధ్యక్షుడయ్యాడన్నారు. ‘మా’ ప్రెసిడెంట్‌ అంటే మామూలు విషయం కాదని, చాలా బాధ్యతతో కూడుకున్న గౌరవప్రదమైన పదవి అన్నారు. ఆ గౌరవానికి ఎలాంటి లోటు లేకుండా ఆసోసియేషన్‌ను విష్ణు అత్యద్భుతంగా తీర్చిదిద్దుతాడన్నారు. 


ఏపీలోనూ ‘మా’ ఆఫీస్‌

                  ‘మా’ అధ్యక్షుడు విష్ణు

ఏపీలోనూ మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని అధ్యక్షుడు మంచు విష్ణు తెలిపారు. తిరుపతి సమీపంలోని శ్రీవిద్యానికేతన్‌ విద్యాసంస్థల వద్ద సోమవారం నూతనంగా ఎన్నికైన ‘మా’  కార్యవర్గం మీడియాతో మాట్లాడింది. ఈ సందర్భంగా విష్ణు మాట్లాడుతూ ప్రభుత్వ ఆన్‌లైన్‌ టికెటింగ్‌ ప్రతిపాదన మంచి ఆలోచన అని, దానిని సమర్థిస్తున్నట్టు చెప్పారు. నటులు కానివారు కూడా మాలో సభ్యత్వం తీసుకుని పోటీ చేస్తున్నారని, అలాంటివారి కోసం పెద్దలందరి అనుమతితో బైలాలో మార్పులు చేస్తామన్నారు. హైదరాబాదులో జరిగిన అలయ్‌ బలయ్‌ కార్యక్రమంలో పవన్‌ కల్యాణ్‌తో వేదిక కింద మాట్లాడానని తెలిపారు. సినీ పరిశ్రమ తల్లిలాంటిదని...జాగ్రత్తగా చూడాలని పవన్‌ చెప్పారన్నారు. వేదికపై ఉపరాష్ట్రపతి ఉండడంతో మాట్లాడుకోలేక పోయామన్నారు. పవన్‌ అభిమానులు గుర్తించాలనే ‘ఈయనెవరో తెలుసా?’ అంటూ ట్వీట్‌ చేశానన్నారు. ప్రకాష్‌రాజ్‌ ‘మా’ ఎన్నికలకు సంబంధించి సీసీ పుటేజ్‌ తీసుకున్నా తమకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. తామంతా నిజాయితీగానే గెలిచామన్నారు. ఎన్నికల్లో ఏదో జరిగిపోయిందని ప్రచారం చేయడం దురదృష్టకరమన్నారు.అందరి సహకారంతో ‘మా’ అసోసియేషన్‌ ప్రతిష్టను పెంచడానికి కృషిచేస్తామన్నారు. ప్రకాష్‌రాజ్‌, నాగబాబు రాజీనామాలను కార్యవర్గ సమావేశంలో తిరస్కరించామన్నారు. ఎన్నికల్లో ఓటమి పొందిన వారి  సలహాలు కూడా స్వీకరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు.  బాబూ మోహన్‌ మాట్లాడుతూ ‘మా’ సంఘం చిన్నదే కావచ్చు. కోట్లాదిమంది అభిమానులు గల నటులు కలిగిన సంస్థ అంటూ  విష్ణుబాబు సంఘాన్ని మరింత ముందుకు తీసుకెళతారన్న నమ్మకం ఉందన్నారు. 

ఆంధ్రజ్యోతి (తిరుమల, తిరుపతి)

Updated Date - 2021-10-19T06:36:23+05:30 IST