లోకనాయకుడు కమల్‌హాసన్ (Kamal Haasan) హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘విక్రమ్’ (Vikram). లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో.. అంతగా అంచనాలేమీ లేకుండా తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా అవతరించింది. తమిళంలో ఏకంగా ‘బాహుబలి 2’ రికార్డుల్ని క్రాస్ చేసి.. ఆల్ టైమ్ నెంబర్ వన్ గా దూసుకుపోతోంది. తెలుగులోనూ పెట్టుబడికి రెట్టింపు లాభాలు తెచ్చిపెట్టిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఇంకా స్ట్రాంగ్ గా ఉంది. ‘అంటే సుందరానికీ (Ante Sundaraniki), విరాటపర్వం (Virataparvam)’ చిత్రాలు రేసులో వెనుక పడడంతో ‘విక్రమ్’ చిత్రానికి ఇక తిరుగే లేకుండా పోయింది. ఇప్పటికే ఇక్కడ షేర్ రూ. 15 కోట్లు దాటింది. మక్కళ్ సెల్వన్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi) విలన్ గానూ, మలయాళ విలక్షణ హీరో ఫహద్ ఫాజిల్ (Fahad Fazil) కీలక పాత్రలోనూ నటించిన ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడొస్తుందా అనే ఆసక్తితో ఉన్నారు.
కమల్ ఫ్యాన్స్ తో పాటు, యూత్ కూడా రిపీట్స్ లో సినిమాను ఎప్పుడు చూద్దామా అనేంత ఆత్రుతగా ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం ‘విక్రమ్’ చిత్రాన్ని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ (Disney plus Hotstar) లో జూలై 8న స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు టాక్. అఫీషియల్ గా ఇంకా ప్రకటించనప్పటికీ.. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికీ ఇంకా నలభై రోజుల థియేట్రికల్ రన్ పూర్తవలేదు. అలాంటప్పుడు అప్పుడే ఓటీటీలో విడుదల చేస్తారా అనే సందేహం రావచ్చు. అయితే ముందస్తు ఒప్పందంతో అలా మాట్లాడుకున్నారని, ఒకవేళ చివరినిమిషంలో మార్పు ఉండొచ్చని తెలుస్తోంది. గతంలో ‘మాస్టర్’ (Master) చిత్రాన్ని అలాగే విడుదల చేశారు. మరి నిజంగానే విక్రమ్ ఓటీటీలోకి అప్పుడే వస్తుందా అన్న విషయం తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.