Vijayendra Prasad: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఆటోబయోగ్రఫీ కాదు

ABN , First Publish Date - 2021-08-15T05:15:43+05:30 IST

ఋషి.. కథల ఋషి... ఈ మాట రచయిత విజయేంద్రప్రసాద్‌కి కరెక్ట్‌గా సరిపోతుంది. చూడటానికి ఎప్పుడూ ప్రశాంతంగా కనిపించే ఆయన తన కథలతో రికార్డులు తిరగరాస్తారు. చందమామల కథల స్ఫూర్తి అని చెప్పే ఆయన చంద్రుడిలా నిర్మలంగా కనిపిస్తారు. 75వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయన ‘ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.

Vijayendra Prasad:  ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఆటోబయోగ్రఫీ కాదు

‘మాపై జరిగిన దాడి’ అనుకుంటేనే నిజమైన దేశభక్తి..

అప్పుడు వాళ్లిద్దరూ కలిసుంటే...

అలా చేస్తే కథ దెబ్బతింటుంది..

మనిషిని తట్టి లేపేది ఆర్ట్‌ సినిమా..

ప్రవృతి అనేది మారకూడదు. 

ఓటీటీ బోనస్‌ మాత్రమే..

- విజయేంద్రప్రసాద్‌


ఋషి.. కథల ఋషి... ఈ మాట రచయిత విజయేంద్రప్రసాద్‌కి కరెక్ట్‌గా సరిపోతుంది. చూడటానికి ఎప్పుడూ ప్రశాంతంగా కనిపించే ఆయన తన కథలతో రికార్డులు తిరగరాస్తారు. చందమామ కథల స్ఫూర్తి అని చెప్పే ఆయన చంద్రుడిలా నిర్మలంగా కనిపిస్తారు. 75వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయన ‘ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. దేశభక్తికి నిర్వచనంతోపాటు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా గురించి ఆసక్తికర విశేషాలు వెల్లడించారు. 


ప్రస్తుత పరిస్థితుల్లో అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్‌లాంటి దేశభక్తులు జీవించి ఉంటే ఎలా ఉంటుంది?

అన్యాయాన్ని సహించలేక.. ఎదురు తిరిగే అలాంటి దేశభక్తుల్ని ఎక్కడ బతకనిస్తారు. ఎప్పుడో చంపేస్తారు. ప్రభుత్వాలే అలాంటి వారిని చూసి తట్టుకోలేవు. అలాంటి వారిని ఇప్పుడున్న సమాజంలో ఎక్కువకాలం బతకనివ్వరు. 


చరిత్రలోని సంఘటనల ఆధారంగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కథను రాశారు కదా.. ఈ క్రమంలో మీకు ఎదురయిన సవాళ్లేమిటి?

సీతారామరాజు, కొమురం భీమ్‌ ఇద్దరూ దేశభక్తులే. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంతో వాళ్ల ఆటోబయోగ్రఫీ చెప్పాలనేది నా ఉద్దేశం కాదు. వాళ్ల స్ఫూర్తితో.. వారిని ఆదర్శంగా తీసుకొని మనం ఒక్క క్షణమైనా అలా బతకాలనే స్ఫూర్తి ప్రజల్లో కలిగితే చాలు. దీని కోసమే నేను ప్రయత్నించా. వీరిద్దరూ ఒకే పరిస్థితుల్లో నివసించినవారు. 20 ఏళ్ల వయస్సులో సీతారామరాజు, కొమురం కొద్దికాలం ఎవరికి కనిపించకూడా ఎక్కడికి వెళ్లిపోయారని చరిత్ర చెబుతుంది. వారిద్దరూ అప్పుడు కలిసి ఉంటే ఏం జరిగేది? అనే పాయింట్‌ మీద నేను రాసిన కథ ఇది. దీనిలో అనేక భావోద్వేగాలు ఉన్నాయి. ఇది ప్రేక్షకులకు తప్పనిసరిగా నచ్చుతుంది. 


మీరు దేశభక్తిని ఎలా నిర్వచిస్తారు?

ఒక మనిషి తాలుకు ప్రయాణం ‘నేను’ అనే భావన దగ్గర ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత నా భార్యాబిడ్డలు, అన్నాదమ్ములు.. బంధువులు.. వీధి.. గ్రామం.. పట్టణం.. కులం.. మతం పెరుగుతుంది. ఒక దేశంలో అన్ని మతాలు, కులాలు, భాషల వారు ‘నా’ అని ఏ భావనను అనుకుంటారో.. అది నిజమైన దేశభక్తి అని నేను నమ్ముతాను. ఈ భావనే అందరిలోనూ బలం పెంచుతుంది. ఉదాహరణకు సరిహద్దుల్లో యుద్ధం జరుగుతోందనుకుందాం. అప్పుడు మొదటగా దెబ్బతినేది సరిహద్దుల్లో నివసించేవారే! అయితే దానిని కూడా ఇతర ప్రాంత ప్రజలు ‘మాపై జరిగిన దాడి’ అనుకోగలిగితే అదే నిజమైన దేశభక్తి. 


ఇంట్లో రాజమౌళికి.. మీకు ఎలాంటి సంభాషణలు జరుగుతూ ఉంటాయి...

కథకు సంబంధించి పని నడుస్తున్నప్పుడు దాని గురించి మాట్లాడుకుంటాం. ఆ పని అయిపోతే సినిమా ప్రస్తావన ఉండదు. ‘ఏ ఆవకాయ బావుంటుంది.. ఏ కూర తినాలి..’ ఇలాంటి మాటలే ఉంటాయి. రాజమౌళికి స్పోర్ట్స్‌, వ్యవసాయం– ఇలా రకరకాల ఇష్టాలు ఉన్నాయి. వాటి గురించి మాట్లాడతాడు. 

రాజమౌళి సినిమాలను మీరు థియేటర్‌లో చూస్తారా? ఇంట్లో చూస్తారా?

ఒక సారి ప్రివ్యూలో... ఒక సారి థియేటర్‌లో చూస్తా. ఏ సినిమా అయినా నేను రెండు సార్లు మించి చూడలేదు. నేను రాజమౌళికి ఉన్నది ఉన్నట్లు చెబుతా. నా రివ్యూ కోసం తనేమి ఎక్స్‌పెక్ట్‌ చేయడు. 

మన కథలకు, బాలీవుడ్‌ కథలకు తేడా ఏంటి? 

భాష ఒక్కటే తేడా. మిగిలింది అంతా ఒకటే. 

కొత్త రచయితలకు మీరిచ్చే సూచనలు? 

అబద్ధాలు ఆడటం నేర్చుకోవాలని చెబుతా. ఓ కథ రాయాలంటే అబద్ధాలు ఆడాలి. నేను నిజాలు చెప్పిన జ్ఞాపకం లేదు.


ఈ మధ్యకాలంలో రీమేక్‌ ధోరణి బాగా పెరిగింది? దీని వల్ల కథా రచయితలకు పని తగ్గుతుందంటారా? 

1960ల నుంచి రీమేక్‌ సినిమాలున్నాయి. ఈ ఒరవడి ఈ మధ్యకాలం నుంచి ప్రారంభమయింది కాదు. మంచి సినిమాను ఏ భాషలోనైనా ఆదరిస్తారు. అందుకే ఒక భాషలో హిట్టైన సినిమాను తమ నేటివిటీకి అనుగుణంగా మార్పులు చేసి ఇంకో భాషకు రీమేక్‌ చేస్తుంటారు. రీమేక్‌లు రావడం వల్ల కథా రచయితలు పని లేకుండా లేదు. టాలెంట్‌ ఉన్నోడికి ఎక్కడైనా పని దొరుకుతుంది. ఓటీటీకి ముందు రచయితలకు టీవీ సీరియళ్ల అవకాశాలు, ఆ తర్వాత సిరీస్‌లు, ఇప్పుడు ఓటీటీ కంటెంట్‌... ఇలా రచయితలకు పరిశ్రమలో పనికి లోటు లేదు.  


ఒక సినిమా పెద్ద హిట్‌ అయితే ఆ క్రెడిట్‌ కథా రచయితకు దక్కుతుందా? దర్శకుడికి దక్కుతుందా?

ఓ బిల్డింగ్‌ కట్టాలంటే పునాది చాలా ముఖ్యం. ‘సినిమా’ అనే బిల్డింగ్‌కు పునాది కథ. కథ బావుంటేనే దాన్ని దర్శకుడు, నిర్మాత మరో స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. 


ఆర్ట్‌ ఫిల్మ్‌ను మీరు ఎలా నిర్వచిస్తారు?

ఆర్ట్‌ ఫిల్మ్‌ అంటే నాకు సరైన నిర్వచనం తెలీదు. ఫ్రీగా సినిమా చూపిస్తానన్నా థియేటర్‌కి వెళ్లి చూడని సినిమాను ఆర్ట్‌ సినిమా అంటారనేఅపప్రద ఉంది. అలా క్రియేట్‌ చేసేశారు. ఈ విషయంలో నేను నమ్మేది ఒకటుంది. ఆర్ట్‌ సినిమా అంటే ఆలోచింపజేసేది.. ప్రశ్నించేది.. మన లోపలికి తొంగి చూసేది.. మనిషిని తట్టి లేపేది అని నేను నమ్ముతా! దానిలో కమర్షియల్‌ హంగులు ఉండవు. రచయిత, దర్శకుడు నిజాయతీగా చేసే ఒక  ప్రయత్నం ఉంటుంది. ఆర్ట్‌ ఫిల్మ్‌ తీయగానే సరిపోదు. జనాలకు చేరువయ్యేలా చేయాలి.  కొన్ని సార్లు కమర్షియల్‌గా కూడా ఆర్ట్‌ సినిమా తీయగలం. అందుకు ఉదాహరణ ‘శంకరాభరణం’. అది నాకు ఆల్‌ టైమ్‌ ఫేవరెట్‌. 


థియేటర్లలో విడుదలయ్యే సినిమాలపై ఓటీటీ ప్రభావం చూపుతుందా?

కొవిడ్‌ వల్ల థియేటర్లు మూసుకుపోయాయి. ఈ సమయంలో ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ఉండటం కోసం కొందరు నిర్మాతలు ఓటీటీ బాట పట్టారు. నిజం చెప్పాలంటే– భారీగా తీసే సినిమాలన్నీ వెండితెరపైనే బావుంటాయి. థియేటర్‌ నుంచి వచ్చే ఆదాయమే నిర్మాతను నిలబెడుతుంది. ఓటీటీ అనేది కేవలం బోనస్‌ మాత్రమే. ఓటీటీ మీద మాత్రమే సినిమా బతకలేదు. అయితే ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి. థియేటర్‌లో చూపించలేని బోల్డ్‌ కంటెంట్‌ ఓటీటీలో చూపించగలరు. థియేటర్‌లో విడుదలవటానికి ఉద్దేశించిన సినిమా కథ ఓటీటీకి కూడా పనికొస్తుంది. 



కాలం అనేది నిరంతర ప్రవాహం. అందులో మంచి, చెడూ రెండూ ఉంటాయి. నా విషయానికొస్తే.. కాలానికి అనుగుణంగా జీవన విధానంలో మార్పు వచ్చింది తప్ప నా ప్రవృత్తిలో ఎలాంటి మార్పులేదు. ఎవరికైనా ప్రవృతి అనేది మారకూడదు. 


ఇద్దరు దేశభక్తుల కథను.. ఇద్దరు కమర్షియల్‌ హీరోలతో తెరకెక్కిస్తున్నారు. వారిని దృష్టిలో ఉంచుకొని కథ రాశారా? రాసిన తర్వాత వారిద్దరినీ ఆ పాత్రలకు ఎంపిక చేశారా?

ప్రతి కథకు ఒక ఆత్మ ఉంటుంది. దానిని ఇమేజ్‌లోకి ఇరికించే ప్రయత్నం చేయకూడదు. అలా చేస్తే కథ దెబ్బతింటుంది. మాకు మంచి కథ కుదిరింది. ఈ కథకు తగిన హీరోలు దొరికారు. అది మాకు ప్లస్‌ అవుతుంది.


ఇద్దరు హీరోలు.. వారి ప్రేమకథలు.. దీనికి దేశభక్తిని జోడిస్తే ప్రేక్షకులు ఆదరిస్తారా?

అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్‌ అనగానే ప్రేక్షకులు దేశభక్తినే కోరుకుంటారు. అలా థియేటర్‌కు వచ్చిన ప్రేక్షకులకు– ప్రేమ.. పాటలు చూపిస్తే చిరాకు పడతారు. అందుకే ప్రేక్షకుడిని మెప్పించటానికి ఏం చేయాలో అది చేశాం. సినిమా చాలా తృప్తికరంగా వచ్చింది. నేను సినిమాను ఎడిట్‌ సూట్‌లో చూసి ఉన్నది ఉన్నట్లు చెబుతా. ఏవైనా పొరపాట్లు ఉన్నాయని చెబితే– వాటిని రాజమౌళి కరెక్ట్‌ చేసుకుంటాడు. పైగా నేను సెట్స్‌కు చాలా అరుదుగా.. రాజమౌళి పిలిస్తేనే వెళ్తాను. 


ఆర్‌ఆర్‌ఆర్‌ సెట్స్‌కు వెళ్లారా? తారక్‌, చరణ్‌లతో మీకున్న అనుభవాలు.. 

ఈ సినిమాలోనే కాదు.. నిజజీవితంలో కూడా తారక్‌, చరణ్‌ మంచి స్నేహితులు. ఎండ్‌ టైటిల్స్‌లో వచ్చే ఒక సన్నివేశం చిత్రీకరిస్తుండగా సెట్‌కు వెళ్లాను. అక్కడ వాళ్లిద్దరూ ఎదురొచ్చి పలకరించారు. వారిద్దరిని అలా చూడటం ఒక మంచి అనుభూతిని ఇచ్చింది. 


Updated Date - 2021-08-15T05:15:43+05:30 IST