వాణిశ్రీతో విజయనిర్మల యుద్ధం..

కొన్ని సందర్భాల్లో సరదాగా మాట్లాడే కొన్ని మాటలు కూడా  కొంపముంచుతుంటాయి. వ్యక్తుల మధ్య అగాధాలు ఏర్పరుస్తాయి. దీనికి చక్కని ఉదాహరణే 36 ఏళ్ల క్రితం జరిగిన ఓ సంఘటన. వివరాల్లోకి వెళితే.. 1975లో తొలిసారిగా ప్రపంచ తెలుగు మహాసభలు హైదరాబాద్‌లో జరిగాయి. ఈ సభల నిర్వహణ కోసం తమ వంతు విరాళాన్ని ఇవ్వాలని తెలుగు సినీ కళాకారుల సంఘం నిర్ణయించింది. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో ప్రదర్శనలు ఇవ్వడం ద్వారా విరాళాలు సేకరించడానికి పూనుకుంది. 


ఆ ప్రకారం నటీనటులు, సాంకేతిక నిపుణులు ఓ వారం రోజుల పాటు రకరకాల ప్రదర్శనలు ఇచ్చారు. ఇందులో భాగంగా హీరోయిన్లు వాణిశ్రీ, కాంచన ‘అత్తాకోడలు’ నాటిక ప్రదర్శించారు. ఈ నాటికలో అత్త లక్ష్మీదేవిగా వాణిశ్రీ, కోడలు సరస్వతిగా కాంచన నటించారు. భూలోకంలో ఉన్న లక్ష్మీదేవిని చూసి ‘ఏం అత్తా ఇలా వచ్చావ్‌?’ అని కోడలు సరస్వతి ప్రశ్నిస్తుంది. ఈ ప్రశ్నకు ఒక్కో చోట ఒక్కో రకంగా, తమాషా సమాధానం ఇచ్చి వాణిశ్రీ నవ్వించేవారు. ఒక ఊళ్లో ‘ప్రేమనగర్‌’ చిత్రం చూడడానికనీ, మరో ఊళ్లో ‘మంచివాడు’ సినిమా చూడడానికని ఆమె చెప్పేవారు. 


తమాషాగా అనిపించే ఆ సమాధానాలకు ఆడియన్స్‌ కూడా బాగా కనెక్ట్‌ అయి, విరగబడి నవ్వేవారు. వైజాగ్‌లో సినీకళాకారుల బృందం ప్రదర్శనలిస్తున్న రోజునే ఎన్టీఆర్‌, వాణిశ్రీ జంటగా నటించిన ‘కథానాయకుని కథ’ చిత్రం విడుదలైంది. ఆ రోజు ప్రదర్శనలో సరస్వతి అడిగిన ప్రశ్నకు ‘నాగేశ్వరరావుగారు నటించిన ‘దేవదాసు’ చిత్రానికి టిక్కెట్లు దొరకడం లేదు. అందుకే ‘కథానాయకుడి కథ’ సినిమా టిక్కెట్లు తెమ్మని నారదుడిని పంపాను’ అని చెప్పారు వాణిశ్రీ. దాంతో జనం గొల్లున నవ్వారు. సరిగ్గా వివాదం అక్కడే మొదలైంది. ఆ వేదిక మీదే నటి, దర్శకురాలు విజయనిర్మల కూడా ఉన్నారు. కృష్ణ హీరోగా ఆమె దర్శకత్వంలో రూపొందిన ‘దేవదాసు’ చిత్రం కూడా అదే సమయంలో విడుదలైంది. 


ఆ సినిమాకు అంతంత మాత్రంగానే కలెక్షన్లు ఉన్నాయి. అది దృష్టిలో పెట్టుకొనే తనను హేళన చేస్తూ వాణిశ్రీ అలా మాట్లాడారని విజయనిర్మల మనసు నొచ్చుకుంది. మద్రాసు తిరిగి రాగానే వాణిశ్రీ మీద ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో సినీకళాకారుల సంఘం అధ్యక్షుడిగా గుమ్మడి ఉన్నారు. సందర్భం లేకపోయినా అక్కినేని ‘దేవదాసు’ సినిమా ప్రస్థావనకు తెచ్చి, వాణిశ్రీ ఉద్దేశపూర్వకంగా తనను అవమానించారన్న విజయనిర్మల వాదనతో ఆయన ఏకీభవించి, సంజాయిషీ కోరుతూ వాణిశ్రీకి ఓ లేఖ రాశారు. ఎవరినీ తను అవమానించలేదనీ, సరదాకే అలా మాట్లాడానని వాణిశ్రీ వివరణ ఇవ్వడమే కాకుండా.. అసలేం జరిగిందనే విషయాన్ని వివరిస్తూ పత్రికలకు సమాచారాన్ని లీక్‌ చేశారు. దాంతో వివాదం మరింత పెద్దదయింది. ఓ నెల రోజుల పాటు వాణిశ్రీ, తెలుగు సినీ కళాకారుల సంఘం మధ్య ఘాటుగా ఉత్తరప్రత్యుత్తరాలు నడిచాయి. 


వాణిశ్రీ క్షమాపణ చెప్పకపోతే ఆమెను సంఘం నుంచి బహిష్కరించే వరకూ వ్యవహారం వెళ్లింది. వాణిశ్రీ నటించే సినిమాల్లో సినీ కళాకారుల సంఘ సభ్యులెవరూ నటించకూడదని అనధికారికంగా నిర్ణయం తీసుకున్నారు కూడా. ఈ దశలో నటుడు జగ్గయ్య రంగప్రవేశం చేసి ఇరువర్గాలను రాజీ చేసి వివాదాన్ని చల్లబర్చారు.     


  - వినాయకరావు 

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.