Vijay sethupathi : ఆలోచింపచేస్తున్న మలయాళ చిత్రం

ABN , First Publish Date - 2022-08-02T20:49:13+05:30 IST

ఒక పక్క కమర్షియల్ చిత్రాల్లో హీరోగానూ, విలన్‌గానూ నటిస్తూ బిజీగా ఉన్నప్పటికీ.. మంచి కథ కుదిరితే.. కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు చేస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు తమిళ హీరో విజయ్ సేతుపతి. కథే ప్రధానంగా సాగే సినిమాలు ఎన్నో చేసిన విజయ్ సేతుపతి (Vijay Sethupathi).. తాజాగా మరో సినిమాలో నటించి అందరి మెప్పునూ పొందుతున్నాడు.

Vijay sethupathi : ఆలోచింపచేస్తున్న మలయాళ చిత్రం

ఒక పక్క కమర్షియల్ చిత్రాల్లో హీరోగానూ, విలన్‌గానూ నటిస్తూ బిజీగా ఉన్నప్పటికీ.. మంచి కథ కుదిరితే.. కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు చేస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు తమిళ హీరో విజయ్ సేతుపతి. కథే ప్రధానంగా సాగే సినిమాలు ఎన్నో చేసిన విజయ్ సేతుపతి (Vijay Sethupathi).. తాజాగా మరో సినిమాలో నటించి అందరి మెప్పునూ పొందుతున్నాడు. సినిమా పేరు 19 (1) (ఏ). ఇదొక పొలిటికల్ మలయాళ డ్రామా. ఇందూ వియస్ (Indu VS) అనే దర్శకురాలు ఈ సినిమాను తెరకెక్కించింది. ఆంటో జోసెఫ్, నీతా పింటో నిర్మించారు. ఈ సినిమా జూలై 29 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. నిత్యామీనన్ (Nityamenon) కీలక పాత్ర పోషించింది.  ఇంద్రజిత్ సుకుమారన్, ఇంద్రన్స్, శ్రీకాంత్ మురళి, భగత్ మాన్యువల్, దీపక్ పరంబోల్, అభిషేక్ రవీంద్రన్ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. 


యదార్ధంగా జరిగిన సంఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కినప్పటికీ.. దీన్నో ఫిక్షనల్ మూవీగా చెప్పాలి. భావ ప్రకటన కోసం పౌరులకు భారత రాజ్యాంగం కల్పించిన హక్కు 19 (1) (ఏ). ఈ మధ్య భావ ప్రకటన స్వేచ్ఛపై దాడులు జరుగుతున్నాయి. ఈ దాడుల్ని ప్రధానంగా చూపిస్తూ దర్శకురాలు సినిమాను ఎంతో ప్రతిభావంతంగా తెరకెక్కించింది. కొన్నేళ్ళ క్రితం కర్నాటకలో అభ్యుదయ రచయిత గౌరీ లంకేష్ (Gowri Lankesh) హత్య, ఆ తర్వాత జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. అయితే గౌరీ లంకేశ్ పాత్రను మేల్‌గా మార్చి విజయ్ సేతుపతి‌తో ఈ సినిమాను తీయడం విశేషం. సినిమాలో గౌరీశంకర్ గా కనిపిస్తాడు. ఈ సినిమా కథంతా కేరళ నేపథ్యంలో సాగుతుంది. 


కథలోకి వెళితే... 

గౌరీ శంకర్ మలయాళ అభ్యుదయ రచయిత. జిరాక్స్ సెంటర్ నడిపే మధ్యతరగతి యువతి నిత్యామీనన్. మధ్యానికి బానిసైన తండ్రి ఇంటికే పరిమితం కావడంతో విధిలేని పరిస్థితుల్లో జిరాక్స్ షాపు నడుపుతూ ఉంటుంది. పెళ్ళికి, చదువుకు దూరమై బతుకు భారమైన పరిస్థితుల్లో ఉంటుంది. తమిళనాడులోని స్వగ్రామం ధర్మపురికి వెళుతున్న క్రమంలో తన రచనను టైపు చేయమని, అందుకు లేటయినా పర్వాలేదని ఆ అమ్మాయికి ఇచ్చేసి తన స్వగ్రామానికి పయనమవుతాడు గౌరీశంకర్. అతను ఎవరో తనకి తెలియదు. అతడు తిరిగి వస్తే.. టైపు చేసిన డబ్బులు తీసుకుందామని ఎదురు చూస్తుంటుంది నిత్యామీనన్. ఆ మర్నాడు గౌరీ శంకర్ హత్యకు గురైనట్టుగా టీవీలో కనిపిస్తుంది. గుర్తు తెలియని వ్యక్తులు అతడ్ని కాల్చి చంపారని టీవీ వార్తల్లో చెబుతూ ఉంటారు. అప్పుడే గౌరీ శంకర్ గురించి నిత్యామీనన్ కు తెలుస్తుంది. గౌరీ శంకర్ హత్యపై దేశమంతటా  నిరసన జ్వాలలు రగులుతూ ఉంటాయి. అభ్యుదయ  భావాలు కలిగిన ఆ రచయిత తన చివరి రచనను తన చేతిలో వదిలి వెళ్ళాడని దాన్ని ఎలాగైనా చేర్చాల్సిన చోటికి చేర్చాలని నిత్యామీనన్ తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత నిత్య తన కలను నిజం చేసుకొనే దిశగా అడుగులేయడంతో సినిమా ముగుస్తుంది. జరిగిన ఒక సంఘటనను బేస్ చేసుకొని.. ఆసక్తికరమైన సినిమాగా తీర్చిదిద్దడంలో దర్శకురాలు విజయం సాధించింది. విజయ్ సేతుపతి, నిత్యామీనన్ పాత్రలు ఈ సినిమాకే హైలైట్స్ గా నిలిచాయి. ప్రస్తుతం ఈ సినిమాపై మంచి టాక్ నడుస్తోంది. 

Updated Date - 2022-08-02T20:49:13+05:30 IST