Liger: ఈ మూవీ రవితేజ సినిమాకి రిమేక్?.. విజయ్ దేవరకొండ రియాక్షన్ ఏంటంటే..

ABN , First Publish Date - 2022-08-16T22:35:55+05:30 IST

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, యువ నటుడు విజయ్ దేవరకొండ కాంబోలో తెరకెక్కిన చిత్రం ‘లైగర్’.

Liger: ఈ మూవీ రవితేజ సినిమాకి రిమేక్?.. విజయ్ దేవరకొండ రియాక్షన్ ఏంటంటే..

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, యువ నటుడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కాంబోలో తెరకెక్కిన చిత్రం ‘లైగర్(Liger)’. కరణ్ జోహార్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అనన్య పాండే హీరోయిన్‌గా నటించింది. ఆగస్టు 25న విడుదల కానున్న ఈ మూవీ ట్రైలర్, పాటలు ఇప్పటికే విడుదలై మంచి రెస్పాన్స్‌‌ని అందుకుని సినిమా మీద అంచనాలను భారీగా పెంచేశాయి. విడుదల దగ్గర పడుతున్న కొద్ది ఈ మూవీపై రోజుకో వార్త నెట్టింట హల్‌చల్ చేస్తోంది. 


పూరీ జగన్నాథ్, రవితేజ (Ravi Teja) కాంబోలో తెరకెక్కిన మూవీ ‘అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి’ అని సినిమా వచ్చింది. ఆ సినిమాలో అమ్మ, నాన్న, గర్ల్‌ఫ్రెండ్‌తో హీరోకి ఉన్న రిలేషన్ గురించి, అలాగే.. కిక్ బాక్సింగ్ ఆట ప్రధానంగా సాగుతుంది. లైగర్ మూవీ ట్రైలర్ చూసిన తర్వాత అందులోనూ ఇలాగే కనిపించింది. దీంతో ఈ మూవీ రవితేజ సినిమాకి రిమేక్ అంటూ నెట్టింట ప్రచారం జరిగింది. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఈ రూమర్స్‌పై విజయ్ దేవరకొండ స్పందించాడు.


విజయ్ మాట్లాడుతూ.. ‘అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి మూవీ అంటే నాకు చాలా ఇష్టం. కానీ దానికి లైగర్‌కి ఏం సంబంధం లేదు. ఎంఎంఏ స్పోర్ట్‌కి బాక్సింగ్‌కి చాలా తేడా ఉంది. ఈ సినిమాలో తల్లీ కొడుకుల బంధం ప్రధాన కాన్సెప్ట్‌గా ఉంటుంది. అలాగే ఈ సినిమాలో చాలా ఇతర అంశాలు ఉన్నాయి. నేను ఎప్పటికీ రీమేక్‌లు చేయను. నిజానికి నాకు రీమేక్‌లు చేయడం ఇష్టం లేదు’ అని చెప్పుకొచ్చాడు.


కొన్ని రోజుల క్రితం పూరీ జగన్నాథ్ సైతం ఈ విషయంపై స్పందించాడు. ఆయన గతంలో దర్శకత్వం వహించిన ‘అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి’ నుంచి ఎలాంటి సన్నివేశాన్ని ‘లైగర్’లో వాడుకోలేదని పూరీ తెలిపాడు. ఈ రెండు కథలకు చాలా తేడా ఉందని చెప్పుకొచ్చాడు. కాకాపోతే ఈ రెండు సినిమాల్లో సింగిల్ మదర్ కొడుకుని ఇన్‌స్పైర్ చేసే కాన్సెప్ట్ ఉండడం వల్ల రెండింటి కథ ఒకటే అనుకుంటున్నారని ఆయని తెలిపాడు. తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానున్న ఈ మూవీలో రమ్యకృష్ణ, మైక్ టైసన్ కీలకపాత్రల్లో నటించారు.

Updated Date - 2022-08-16T22:35:55+05:30 IST