రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Puri Jagannath) కలయికలోని తొలి చిత్రం ‘లైగర్’ (Liger). స్పోర్ట్స్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమా పూరీ కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సంయుక్తంగా నిర్మాణం జరుపుకుంటోంది. బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే (Ananya Panday) కథానాయికగా నటిస్తోంది. ఇందులో విజయ్ బాక్సర్‌గా అదరగొట్టబోతున్నాడు. ఇప్పటివరకూ లవర్ బాయ్‌గా ప్రేమకథా చిత్రాలకే పరిమితమైపోయిన విజయ్.. ఈ మూవీతో మాస్ హీరోగా పేరు తెచ్చుకుంటాడని మేకర్స్ చెబుతున్నారు. ఇదివరకు విడుదలైన ఈ సినిమా టీజర్, సింగిల్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు అయితే భారీ ఎత్తున స్పందన దక్కింది. ఈ నేపథ్యంలో చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆగస్ట్ 25న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానుంది చిత్రం. విడుదలకు ఇంకా 30 రోజుల టైముంది. ఈ గ్యాప్‌లో అంచనాలు మరింతగా పెరిగే రీతిలో ఈ సినిమాకు సంబంధించిన కొన్ని హైలైట్స్ సోషల్ మీడియాలో చక్కర్లుకొడుతున్నాయి.
తాజా సమాచారం ప్రకారం ‘లైగర్’ సినిమా క్లైమాక్స్‌లో విజయ్ దేవరకొండ, ప్రపంచ బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ (Mike Tyson)పై వచ్చే బాక్సింగ్ సీన్ ప్రేక్షకుల్లో ఉత్సుకతను పెంచడమే కాకుండా .. ఎమోషనల్గానూ కదిలిస్తుందట. ఇక మరో హైలైట్ ఏంటంటే.. ప్రీక్లైమాక్స్‌లో విజయ్ దేవరకొండ.. 14మంది లేడీ ఫైటర్స్‌తో తలపడతాడట. ఈ సీన్ అయితే సినిమాకే హైలైట్ అంటున్నారు. ఈ సినిమాకి కీలకం కానున్న ఈ సన్నివేశం థియేటర్స్‌లో సూపర్‌గా పేలుతుందని చెబుతున్నారు. ఇప్పటి వరకూ విజయ్ అమ్మాయిలతో రొమాన్స్ మాత్రమే చేశాడు. ఈ తరహాలో బాక్సింగ్ మాత్రం చేయలేదు. అందుకే ఈ సీన్ అభిమానులకు వెరైటీ అవుతుందని భావిస్తున్నారు.
పూరీ గత చిత్రాల్లోని హీరోలకు రాసుకున్న మాదిరిగానే ఇందులో విజయ్ దేవరకొండకు డిఫరెంట్ క్యారక్టరైజేషన్ రాసుకున్నాడట పూరీ. ముఖ్యంగా ఇందులో విజయ్ దేవరకొండకి డిఫరెంట్ మ్యానరిజమ్‌ను సెట్ చేశాడట. అది అతడి పాత్రకి చాలా ప్లస్ కానుందని తెలుస్తోంది. ‘ఇస్మార్ట్ శంకర్’ (Ismart Shankar) చిత్రంలోని రామ్ (Ram) ను ఏ తరహాలో ఎలివేషన్స్ ఇచ్చాడో ఆ విధంగానే విజయ్ పాత్రను కూడా ఎలివేట్ చేస్తు్న్నాడని సమాచారం. మరి లైగర్ గా విజయ్ దేవరకొండ ఏ స్థాయిలో సక్సెస్ అందుకుంటాడో చూడాలి.