ప్రముఖ నటి మృతి.. నాటకాల ‌నుంచి 550 పైగా సినిమాల్లో..

ABN , First Publish Date - 2022-02-23T18:13:59+05:30 IST

నాటకాలతో ప్రస్థానం మొదలుపెట్టి మలయాళ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన నటి మహేశ్వరి అమ్మ. మాలీవుడ్‌లో కేపీఏసీ లలితగా గుర్తింపు పొందిన..

ప్రముఖ నటి మృతి.. నాటకాల ‌నుంచి 550 పైగా సినిమాల్లో..

నాటకాలతో ప్రస్థానం మొదలుపెట్టి మలయాళ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన నటి మహేశ్వరి అమ్మ. మాలీవుడ్‌లో కేపీఏసీ లలితగా గుర్తింపు పొందిన ఈ సీనియర్ నటి ఫిబ్రవరి 22న కొచ్చిలో గుండెపోటుతో మరణించారు. 73 ఏళ్ల వయసులో మృతి చెందిన ఈ నటి గతేడాది డిసెంబర్‌లో కాలేయం సంబంధ సమస్యలతో ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచి హస్పిటల్‌లోనే ఉన్న ఈమె మంగళవారం కన్నుమూశారు.


కేరళలోని అలప్పుజాలోని లెఫ్ట్ ఓరియెంటెడ్ కేరళ పిపుల్స్ ఆర్ట్స్ క్లబ్‌ (కేపీఏసీ)లో నటిగా లలిత పేరుతో తన కెరీర్‌ని ప్రారంభించారు. అనంతరం ప్రముఖ దర్శకుడు కేఎస్ సేతు మాధవన్ సినిమా ‘కుట్టుకుడుంబం’ ద్వారా మాలీవుడ్‌లోకి అడుగుపెట్టి 550పైగా సినిమాల్లో నటించారు. అనంతరం తన టాలెంట్‌తో దాదాపు నాలుగు దశాబ్దాలపాటు ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో ఆ చలనచిత్ర పరిశ్రమకు మూలస్తంభంగా కొనసాగారు. వివిధ పాత్రలను అవలీలగా రక్తించగలిగిన ఈ సినీయర్ నటి ఎక్కువగా తల్లి, సోదరి, కోడలు, కుమార్తె పాత్రల్లో నటించింది.


అలాగే.. అమరం (1990), శాంతమ్ (2000) చిత్రాల్లో రెండుసార్లు ఉత్తమ సహాయ నటిగా లలిత జాతీయ అవార్డును అందుకున్నారు. అంతేకాకుండా కేరళ సంగీత నాటక అకాడమీ ఛైర్‌పర్సన్‌గా పనిచేశారు. కాగా.. లలితకి 1978లో ప్రముఖ డైరెక్టర్ భరతన్‌తో వివాహం కాగా.. 1998లో ఆయన చనిపోయారు. వారికి ఓ కూతురు శ్రీకుట్టి, ఓ కుమారుడు సిద్ధార్థ్ భరతన్. అయితే సిద్ధార్థ్ కూడా నటుడు, దర్శకుడిగా మాలీవుడ్‌లో గుర్తింపు పొందారు.

Updated Date - 2022-02-23T18:13:59+05:30 IST