మెథడ్‌ ఆర్టిస్ట్‌ను కాదు: వెంకటేశ్‌

ABN , First Publish Date - 2021-07-17T21:58:54+05:30 IST

‘‘రీమేక్‌ అంటే ఎప్పుడూ సవాలే! ఎన్నో పోలికలు వస్తాయి. రెట్టింపు కష్టపడాలి. కెరీర్‌లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించాను. ఏ సినిమాకు పడని కష్టం నారప్ప’ కోసం పడ్డాను. అయితే ఈ కథ విన్నప్పుడు గట్‌ ఫీలింగ్‌ కలిగింది. ఈ పాత్ర పోషించడం సవాల్‌గా అనిపించింది’’ అని విక్టరీ వెంకటేశ్‌ అన్నారు.

మెథడ్‌ ఆర్టిస్ట్‌ను కాదు: వెంకటేశ్‌

‘‘రీమేక్‌ అంటే ఎప్పుడూ సవాలే! ఎన్నో పోలికలు వస్తాయి. రెట్టింపు కష్టపడాలి. కెరీర్‌లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించాను. ఏ సినిమాకు పడని కష్టం నారప్ప’ కోసం పడ్డాను. అయితే ఈ కథ విన్నప్పుడు గట్‌ ఫీలింగ్‌ కలిగింది. ఈ పాత్ర పోషించడం సవాల్‌గా అనిపించింది’’ అని విక్టరీ వెంకటేశ్‌ అన్నారు. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో ఆయన నటించిన ‘నారప్ప’ చిత్రం ఈ నెల 20న ఓటీటీ వేదికగా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆయన  శనివారం విలేకర్లతో మాట్లాడారు. ఆ విశేషాలివి..


 ఒక్క క్షణం ఆలోచించలేదు...

‘అసురన్‌’ సినిమా చూడగానే తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్‌ అవుతుందనిపించింది. అన్నయ్య సురేశ్‌కు కూడా ఇందులో ఏదో ఉందనిపించింది. క్యారెక్టర్‌లోకి లోతుగా వెళితే గట్‌ ఫీలింగ్‌ కలిగింది. గతంలో ఎన్నో రీమేక్‌ సినిమాల్లో నటించినా ఇది చాలా కొత్తగా అనిపించింది. ‘నారప్ప’ పాత్ర నాకు సవాల్‌ విసిరింది. అందుకే మాతృక చూశాక ఒక్క క్షణం ఆలోచించకుండా సినిమా అంగీకరించా. నేను ఎవరితోనైనా  సరదాగా పని చేయగలను. దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాలతో నాకు మంచి అసోసియేషన్‌ ఉంది. కథ పరంగా అన్ని చర్చించుకుని తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్పులు చేశాం. పక్కా మాస్‌, ఎమోషన్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ఇది. నేను కూడా యాక్షన్‌ సినిమా చేసి చాలా కాలమైంది. డెఫినెట్‌గా నాకు ఒక డిఫరెంట్‌ సినిమా అవుతుంది. రీమేక్‌ సినిమాలే చేయాలని నేను అనుకోను. వచ్చిన అవకాశాల్లో మంచివి సెలెక్ట్‌ చేసుకుంటా.  నారప్ప పాత్ర కోసం మేకప్‌ లేకుండా నటించా. 50 రోజులపాటు హోటల్‌ రూమ్‌లో అదే గెటప్‌లో ఉన్నా. కథకు కావలసినట్లు బాడీ లాంగ్వేజ్‌ మార్చుకున్నా. శారీరకంగా, మానసికంగా ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డా. 


అభిమానులకు సారీ...

కరోనా కారణంగా సినిమాను ఓటీటీలో విడుదల చేయాల్సి వస్తుంది. దీని వల్ల అభిమానులు చాలామంది బాధపడ్డారు. కానీ పరిస్థితులను బట్టి తప్పలేదు. అందుకు అభిమానులకు సారీ చెబుతున్నా. ఇదొక కొత్త అనుభవంగా భావిస్తున్నా. అప్పుడప్పుడు కొత్త మార్పులను స్వాగతించాలి. ఓటీటీ అభివృద్ది చెందడం కూడా మంచి పరిణామమే. కరోనా తగ్గి థియేటర్లు తెరచుకుని పాత రోజులు వస్తాయని ఆశిస్తున్నా. 


కొత్త కథలేమీ రాలేదు... 

ప్రస్తుతం టాలీవుడ్‌ కొత్త పుంతలు తొక్కుతుంది. కొత్త కథలు వస్తున్నాయి అని అంటున్నారు. నా వరకూ అయితే కొత్తగా అనిపించిన కథ ఏమీ రాలేదు. చేసే పనిలో సిన్సియారిటీ ఉంటే అంతా కొత్తగానే ఉంటుంది. దొరికిన  పనిని మనస్ఫూర్తిగా చేశామా లేదా అన్నది ముఖ్యం.


అటు ఇటు చూడకూడదు..

ఒక పని చేసేముందు ‘ఇది ఎందుకు’ అని ఎప్పుడు అనుకోకూడదు. నాకు ఆ అలవాటు లేదు. మనం నమ్మింది చేయాలి. అనుకున్న దార్లో వెళ్లాలి. మన పని మనం కరెక్ట్‌గా చేసినప్పుడు అంతా సజావుగా ఉంటుంది.  జీవితంలో ఎప్పుడు మనం అటు ఇటు చూడకూడదు. మరో వైపు తొంగి చూసి పోలికలు తెచ్చుకుంటే అక్కడే ఆగిపోతాం. మనం అడిగింది ఎప్పుడూ రాదు.. వచ్చింది చేసుకు వెళ్లాలంతే. అదే జీవితం అని నేను నమ్ముతా. 


మార్పు తీసుకొచ్చింది...

కరోనా కారణంగా ప్రపంచం మొత్తం అస్తవ్యస్తం అయింది. ఈసారి ప్రకృతి పిలుపు మామూలుగా లేదు. మంచైనా, చెడైనా మనం చేసిన దానికి పర్యావసానం ఉంటుంది అంటారు! ప్రకృతి కరోనా రూపంలో విలయ తాండవం చేసింది. జనమంతా ‘మాకేం వద్దు.. ఆరోగ్యంగా ఉంటే చాలు’ అనుకున్నారు. కరోనా జనాల్లో చాలా మార్పు తీసుకొచ్చింది. పరిస్థితులు సాధారణ స్థితికి రాగానే అవన్నీ మరచిపోతున్నాం. మన చేతుల్లో ఏదీ ఉండదు. ఇప్పుడు జనాలకు లైఫ్‌ సీక్రెట్‌ అంతా తెలిసిపోయింది. 


అదే ట్రాన్స్‌లో ఉండను...

ఒకేసారి మూడు సినిమాలు చేయడం వల్ల పాత్రల్లో వేరియేషన్‌ చూపించడంలో పెద్ద కష్టం కాదు. ఒక  పాత్ర పూర్తి కాగానే అందులో నుంచి బయటకు వచ్చేస్తా.  అదే ట్రాన్స్‌లో ఉండడానికి నేను మెథడ్‌ ఆర్టిస్ట్‌ను కాదు. కరోనా వల్ల పెండింగ్‌లో ఉన్న ‘నారప్ప’, ‘దృశ్యం 2’ చిత్రాలు కాస్త అటుఇటుగా షూటింగ్‌ జరిగాయి. ‘ఎఫ్‌3’ సెప్టెంబర్‌కి పూర్తవుతుంది. సంక్రాంతికి విడుదల చేస్తారేమో చూడాలి. తరుణ్‌ భాస్కర్‌తో ఓ స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌ సినిమా అనుకున్నాం. కానీ ఇప్పుడు వేరే కథ మీద పని చేస్తున్నాం. వంద సినిమాల మార్కుని దాటతారా అంటే అది మన చేతుల్లో లేని పని. 


Updated Date - 2021-07-17T21:58:54+05:30 IST