‘శబరి’గా వరలక్ష్మీ శరత్ కుమార్.. చిత్రం ప్రారంభం

ABN , First Publish Date - 2022-04-05T01:51:11+05:30 IST

నటి వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో మరో చిత్రం ప్రారంభమైంది. ఇప్పటికే ఆమె టాలీవుడ్‌లో అరడజనుకు పైగా చిత్రాలలో నటిస్తూ బిజీ తారగా మారిపోయింది. ఒక ఇమేజ్‌కు, భాషకు పరిమితం కాకుండా వైవిధ్యమైన పాత్రలు చేస్తున్న ఆమెకు..

‘శబరి’గా వరలక్ష్మీ శరత్ కుమార్.. చిత్రం ప్రారంభం

నటి వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో మరో చిత్రం ప్రారంభమైంది. ఇప్పటికే ఆమె టాలీవుడ్‌లో అరడజనుకు పైగా చిత్రాలలో నటిస్తూ బిజీ తారగా మారిపోయింది. ఒక ఇమేజ్‌కు, భాషకు పరిమితం కాకుండా వైవిధ్యమైన పాత్రలు చేస్తున్న ఆమెకు.. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అభిమానులు ఉన్నారంటే అతిశయోక్తి కానే కాదు. అలాంటి అభిమానుల ముందుకు మరో సరికొత్త పాత్రతో రావడానికి వరలక్ష్మీ శరత్ కుమార్ సిద్ధమయ్యారు. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘శబరి’. మహా మూవీస్ పతాకంపై మహర్షి కూండ్ల సమర్పణలో మహేంద్రనాథ్ కూండ్ల నిర్మిస్తున్నారు. అనిల్ కాట్జ్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషలలో ఈ చిత్రం రూపొందుతోంది. పూజా కార్యక్రమాలతో నిరాడంబరంగా సోమవారం ఈ చిత్రాన్ని ప్రారంభించారు. 


ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు మదన్ కెమెరా స్విచ్ఛాన్ చేయగా, నిర్మాత ‘నాంది’ సతీష్ వేగేశ్న క్లాప్ ఇచ్చారు. సీనియర్ దర్శకులు బి. గోపాల్ గౌరవ దర్శకత్వం వహించారు. సీనియర్ నిర్మాత పోకూరి బాబూరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సినిమా ప్రారంభమైన సందర్భంగా కాన్సెప్ట్ పోస్టర్‌ని చిత్రయూనిట్ విడుదల చేసింది. అనంతరం దర్శకుడు అనిల్ కాట్జ్ మాట్లాడుతూ.. ‘‘క్రైమ్ నేపథ్యంలో రూపొందిస్తున్న ఇంటెన్స్ సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రమిది. వరలక్ష్మీ శరత్ కుమార్ పాత్ర చిత్రానికి ప్రధాన ఆకర్షణ. గణేష్ వెంకట్రామన్, శశాంక్, మైమ్ గోపి, సునయన, రాజశ్రీ నాయర్, ప్రభు తదితరులు ఇతర తారాగణం. గోపిసుందర్ స్వరాలు చిత్రానికి మరో ప్రధాన ఆకర్షణ. టాలెంటెడ్ ఆర్టిస్టులు, టెక్నీషియన్స్‌తో దర్శకుడిగా నా తొలి సినిమా చేస్తుండటం సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన మా నిర్మాత మహేంద్రనాథ్‌గారికి థాంక్స్’’ అని అన్నారు.


చిత్ర నిర్మాత మహేంద్రనాథ్ కూండ్ల మాట్లాడుతూ.. వరలక్ష్మీ శరత్ కుమార్‌ ఇంతకు ముందు ఎప్పుడూ కనిపించని విధంగా ‘శబరి’ చిత్రంలో కనిపిస్తారు. ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్. కథ, కథనాలు సరికొత్తగా ఉంటాయి. ఈ నెల 11 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. హైదరాబాద్, విశాఖ, కొడైకెనాల్ వంటి అందమైన ప్రదేశాల్లో చిత్రీకరణ చేస్తాం’’ అని తెలిపారు.

Updated Date - 2022-04-05T01:51:11+05:30 IST