‘వకీల్‌ సాబ్’ మూవీ రివ్యూ ‌

ABN , First Publish Date - 2021-04-09T18:49:59+05:30 IST

రాజకీయాల్లోకి వెళ్లిన పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌.. కాస్త గ్యాప్‌ తీసుకుని మళ్లీ సినీ ఎంట్రీ ఇస్తారనే వార్తలు వచ్చినప్పుడు..

‘వకీల్‌ సాబ్’ మూవీ రివ్యూ ‌

చిత్రం: వకీల్‌సాబ్‌

వ్యవధి: 152 నిమిషాలు

బ్యానర్స్‌: శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్‌, బే వ్యూ ప్రాజెక్ట్స్‌

నటీనటులు: పవన్‌ కళ్యాణ్‌, నివేతా థామస్‌, అంజలి, అనన్య నాగళ్ల, ప్రకాష్‌ రాజ్‌, శ్రుతిహాసన్‌, ముకేష్‌ రుషి, షాయాజీ షిండే, వంశీ కృష్ణ తదితరులు

సినిమాటోగ్రఫీ: పి.ఎస్‌.వినోద్‌

సంగీతం: ఎస్‌.థమన్‌

ఎడిటర్‌: ప్రవీణ్‌ పూడి

నిర్మాతలు: దిల్‌రాజు, శిరీష్‌

రచన, దర్శకత్వం:  శ్రీరామ్‌ వేణు


రాజకీయాల్లోకి వెళ్లిన పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌.. కాస్త గ్యాప్‌ తీసుకుని మళ్లీ సినీ ఎంట్రీ ఇస్తారనే వార్తలు వచ్చినప్పుడు అభిమానులు సంతోషపడ్డారు. ప్రేక్షకులు ఆలోచనలో పడ్డారు. ఎందుకంటే.. అప్పటి వరకు సినిమాలకే పరిమితమైన పవన్‌, రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత యాక్టివ్‌గా ఉంటూ నటిస్తోన్న సినిమా కావడంతో ఎలాంటి సినిమా చేస్తాడు? అని అందరూ అనుకున్నారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు పెరుగుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో బాలీవుడ్ లో‌ విడుదలై ఘన విజయం సాధించిన 'పింక్‌' సినిమా తెలుగు రీమేక్‌లో నటించాలని అనుకున్నాడు పవన్‌కళ్యాణ్‌. 'పింక్‌' సినిమాలో అమితాబ్‌ పోషించిన లాయర్‌ పాత్రను పవన్‌కళ్యాణ్‌ చేస్తాడని తెలియగానే.. ప్రేక్షకాభిమానుల్లో తెలియని ఆసక్తి కలిగింది. పవన్‌కళ్యాణ్‌ ఇమేజ్‌కు తగినట్లు డైరెక్టర్‌ శ్రీరామ్‌ వేణు ఎలాంటి మార్పులు చేర్పులు చేస్తాడోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. ఈ సినిమాకు 'వకీల్‌సాబ్‌' అనే టైటిల్‌ అనౌన్స్‌ చేసినప్పటి నుంచి సినిమాపై అంచనాలు పెరుగుతూ వచ్చాయి. పోస్టర్స్‌, టీజర్‌, ట్రైలర్‌, సాంగ్స్‌ ఇలా అన్నీ సినిమాపై ఉన్న అంచాలను క్రమంగా ఆకాశాన్ని అంటేలా చేశాయి. పవన్‌కళ్యాణ్‌ సినిమా అంటేనే భారీ అంచనాలు ఉండటం సాధారణ విషయం. అయితే, పవన్‌కళ్యాణ్‌ రీ ఎంట్రీ మూవీ కావడంతో ఈ అంచనాలు రెట్టింపు అయ్యాయి. మరి ఈ అంచనాలను వకీల్‌ సాబ్‌ అందుకున్నాడా? ప్రేక్షకులను మెప్పించాడా? అనే విషయం తెలియాలంటే సినిమా కథలోకి వెళదాం..


కథ:

వేముల పల్లవి(నివేతా థామస్‌) సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. షిఫ్ట్‌ల పద్ధతిలో పనిచేస్తుండటంతో ఏ సమయంలో పడితే ఆ సమయంలో సిటీ దూరంగా ఉండే హయత్‌ నగర్‌లోని ఇంటికి వెళ్లడం ఇబ్బందిగా అనిపిస్తుంది. దాంతో పల్లవి మెయిన్‌ సిటీలో ఓ రూమ్‌ అద్దెకు తీసుకుంటుంది. ఆమెతో పాటు రాజమండ్రికి చెందిన జరీనా(అంజలి), అదిలాబాద్‌ తండాకు చెందిన అనన్య(అనన్య నాగళ్ల) రూమ్‌మేట్స్‌గా జాయిన్‌ అవుతారు. జరీనా తల్లి అనారోగ్యంతో బాధపడుతుంటుంది. అనన్య కుటుంబం ఇల్లు కట్టుకుంటూ ఉంటుంది.


ఈ కారణంగా వీరిద్దరూ పల్లవితో జాయిన్‌ అవుతారు. అందరూ మంచి స్నేహితులుగా మారుతారు. ఓ పార్టీకి వెళ్లి వచ్చే సందర్భంలో వారి కారు బ్రేక్‌ డౌన్‌ అవుతుంది. దాంతో అదే రూట్‌లో వెళుతున్న వాహనాలను లిఫ్టు అడుగుతారు. ఆ సమయంలో అటుగా వెళుతున్న పల్లవి స్నేహితుడు ఆమెకు లిఫ్ట్‌ ఇస్తాడు. మధ్య వారొక రిసార్ట్‌ దగ్గరకు వెళతారు. అక్కడ జరిగే గొడవలో వంశీ (వంశీ కృష్ణ)ను పల్లవి బాటిల్‌తో గాయపరుస్తుంది. వంశీ.. ప్రముఖ రాజకీయ నాయకుడి కొడుకు కావడంతో పల్లవి, జరీనా, అనన్యలకు వేధింపులు ఎక్కువ అవుతాయి. వారు పోలీస్ కేసు ఫైల్‌ చేస్తారు. దానికి ప్రతిగా వంశీకృష్ణ అండ్‌ గ్యాంగ్‌ పల్లవి ఆమె స్నేహితులపై మర్డర్‌ కేసు పెడతారు. విషయం పెద్దదవుతుంది.


అదే సమయంలో వారుండే కాలనీలో లాయర్‌ సత్యదేవ్‌ (పవన్‌కళ్యాణ్‌) వస్తాడు. కనీసం బెయిల్‌ రాకుండా ఇబ్బంది పడుతున్న పల్లవి అండ్‌ ఫ్రెండ్స్‌కు సత్యదేవ్‌ అండగా నిలబడతాడు. నాలుగేళ్లు కోర్టు నుంచి సస్పెండ్‌ అయిన సత్యదేవ్‌..పల్లవి, ఆమె స్నేహితులకు ఎందుకు సపోర్ట్‌ చేస్తాడు? సత్యదేవ్‌ను కోర్టెందుకు సస్పెండ్‌ చేస్తుంది? చివరకు కోర్టులో పల్లవి, ఆమె స్నేహితులను సత్యదేవ్‌ ఎలా గెలిపించాడు? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే...



సమీక్ష:

సినిమా గురించి ప్రధానంగా చెప్పుకోవాలంటే.. పవన్‌కళ్యాణ్‌ రీ ఎంట్రీ మూవీ. అయితే పవన్‌ తన ఫ్యాన్స్‌ను ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేయడంలో డిసప్పాయింట్‌ చేయలేదు. లుక్‌ పరంగా వకీల్‌సాబ్‌గా హుందాగా కనిపిస్తూనే సినిమాలో డైలాగ్‌ చెప్పినట్లు కోర్టులో వాదించడమే కాకుండా యాక్షన్‌ సన్నివేశాల్లో కోటు తీసి విలన్స్‌ భరతం పట్టాడు. డైలాగ్‌ డెలివరీలో తనదైన స్టైల్‌ను చూపించాడు. ముఖ్యంగా పవన్‌కున్న ఇమేజ్‌ దృష్ట్యా రాజకీయ కోణాన్ని కూడా చేరుస్తూ ఆయన పాత్రను డిజైన్‌ చేశారు. ఆ పాత్రలో పవన్‌ ఒదిగిపోయారు. ఇంటర్వెల్‌ ఫైట్‌... అలాగే సెకండాఫ్‌లో పవన్‌, ప్రకాష్‌రాజ్‌ మధ్య వచ్చే కోర్టు సన్నివేశాలు పోటాపోటీగా ఉంటాయి.


ఆడియెన్స్‌కు నచ్చేలా, ఫ్యాన్స్‌కు కిక్‌ ఇచ్చేలా ప్రకాష్‌ రాజ్‌ పాత్రకు నందా అనే పేరు పెట్టి బద్రి మూవీకి కనెక్ట్‌ అయ్యేలా చేయడంలో దర్శకుడు శ్రీరామ్ వేణు సక్సెస్‌ అయ్యాడు. ఇక సినిమాలో ప్రధాన పాత్రధారులుగా నటించిన నివేతా థామస్‌, అంజలి, అనన్య వారి వారి పాత్రలకు వంద శాతం న్యాయం చేశారు. ఎమోషన్‌ను క్యారీ చేయడంలో వారు సక్సెస్‌ అయ్యారు. శ్రుతిహాసన్‌ పాత్ర చిన్నదే అయినా ఉన్నంతలో ఆమె చక్కగా నటించింది. అయితే లుక్‌ పరంగా శ్రుతి చూడటానికి అంతగా బాగోలేదు. ఇక సినిమాలో నటించిన ఇతర పాత్రధారులు వంశీ కృష్ణ, ముఖేష్‌ రుషి, శరత్‌బాబు, సమ్మెట గాంధీ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించారు. 


టెక్నికల్‌ టీమ్‌ విషయానికి వస్తే...దర్శకుడు శ్రీరామ్‌ వేణు 'వకీల్‌సాబ్‌'ను ఫ్యాన్‌లా భావించి తెరకెక్కించినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. పవన్‌కళ్యాణ్‌ ఇమేజ్‌ను, పొలిటికల్‌ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన‌ పాత్రను చక్కగా డిజైన్‌ చేశారు. బాలీవుడ్ చిత్రం పింక్‌ సినిమాలో అమితాబ్‌ లాయర్ పాత్రనే పొషించారు. తమిళంలో వచ్చిన నేర్కొండ పార్వై చిత్రంలోనూ అజిత్ అదే పాత్రలో నటించారు. తెలుగులో పవన్‌ లాయర్‌ పాత్ర తీరు.... లాయర్‌ కావడానికి ఇన్‌స్పిరేషన్‌ ఏంటి? అనే అంశాలను చక్కగా ఎలివేట్‌ చేశారు. ముఖ్యంగా పవన్‌ పాత్రకు తెలంగాణ యాసను యాడ్‌ చేశారు. కాలేజీ సన్నివేశాలను చూస్తే విద్యార్థి నాయకుడు జార్జిరెడ్డి పాత్రను స్ఫూర్తిగా తీసుకుని చేశారనిపించింది. అలాగే సందర్భోచితంగా యాక్షన్‌ సన్నివేశాలను యాడ్‌ చేశారు. అలాగే పొలిటికల్‌ టచ్‌ ఇచ్చేలా డైలాగ్స్‌ను కూడా చేర్చారు. 


"రాముడు అయోధ్యలో ఉన్నా.. అడవిలో ఉన్నా సంతోషంగానే ఉంటాడు.. కానీ భక్తులకే బాధగా ఉంటుంది

దేశంలో అడుక్కునే వాడికి అన్నం దొరకుతుంది.. కష్టపడేవాడికి నీడా దొరుకుతుంది... కానీ పేదోడికే న్యాయం దొరకడం లేదు..

ఆశకు, భయానికి మధ్య ఊగిసలాడే బతుకులు వాళ్లవి.. వాళ్లకు నేను అండగా ఉంటాను(మధ్య తరగతివారిని ఉద్దేశించి హీరో చెప్పే డైలాగ్ )

నీలాంటి వాళ్లు ఇప్పటి సమాజానికి అవసరం..(హీరోను ఉద్దేశించి శరత్ బాబు పాత్ర చెప్పే డైలాగ్)

ఆశతో ఉండేవాడే గెలుపోటములు గురించి ఆలోచిస్తాడు.. ఆశయంతో ముందుకెళ్లే వాడికి ప్రయాణం గురించి ఆలోచన ఉంటుంది"


అనే ఎమోషనల్‌ డైలాగ్స్‌తో పాటు పొలిటికల్‌ డైలాగ్స్‌ ఆకట్టుకుంటాయి. పాటలకు థమన్ మంచి సంగీతాన్ని అందించాడు. అన్నీ మాంటేజ్‌ సాంగ్స్‌..

'మగువా మగువా..' సాంగ్ లో మహిళల గొప్పదనాన్ని చెబుతూనే ప్రధాన పాత్రలు పోషించిన హీరోయిన్స్ నివేతా థామస్, అంజలి, అనన్య పాత్రలను పరిచయం చేశారు. హీరో, హీరోయిన్ మధ్య ప్రేమ, పెళ్లి కథ ప్రతిబింబించేలా 'కంటిపాప...' గీతాన్ని మలిచారు. మరో సాంగ్ 'సత్యమేవ జయతే'లో హీరో సామాజిక బాధ్యతను చూపెట్టారు. సినిమా చివర టైటిల్స్ పడే సందర్భంలో 'కదులు కదులు' సాంగ్ ఉంటుంది. అలా పాటలన్నీ కథలో భాగంగానే ఉన్నాయి.

ఇక నేపథ్య సంగీతంతోనూ థమన్ మెప్పించాడు. ముఖ్యంగా యాక్షన్‌ సీన్స్‌, కోర్టులోని ఎమోషనల్ సీన్స్‌కు థమన్‌ సంగీతం మరింత ఊపునిచ్చింది. పి.ఎస్‌.వినోద్‌ సినిమాటోగ్రఫీ చాలా బావుంది. సినిమాకు ఇచ్చిన కమర్షియల్‌ టచ్‌ వల్ల సినిమా సైడ్ ట్రాక్‌కు వెళుతుందేమోనన్న భావన వస్తుంది. ఫస్టాఫ్‌లో కొన్ని సీన్స్‌ స్లోగా సాగుతున్నట్లు అనిపిస్తాయి. మిగతాదంతా ఎంజాయ్‌ చేసేలా సినిమాను తెరకెక్కించారు. 


చివరగా.. 'వకీల్ సాబ్'.... సమాజానికి కావాల్సినవాడు..

Updated Date - 2021-04-09T18:49:59+05:30 IST