భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు: టీఎస్‌ఎఫ్‌సీసీ

ABN , First Publish Date - 2021-07-04T00:26:13+05:30 IST

విడుదలకు సిద్ధమైన సినిమాలను థియేటర్స్‌ను కాదని ఓటీటీలో విడుదల చేస్తే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని నిర్మాతలకు తెలంగాణా ఫిల్మ్‌ ఛాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ హెచ్చరించింది. ప్రభుత్వం అనుమతి ఇచ్చినా థియేటర్లు ఇంకా మూతపడి ఉండడంతో కొందరు నిర్మాతలు తమ చిత్రాలను ఓటీటీలో విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు.

భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు: టీఎస్‌ఎఫ్‌సీసీ

అక్టోబర్‌ 31 వరకూ ఆగమని కోరుతున్నాం.. 

లేదంటే భవిష్యత్తు ఇబ్బందులు తప్పవు!

- తెలంగాణా ఫిల్మ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌

విడుదలకు సిద్ధమైన సినిమాలను థియేటర్స్‌ను కాదని ఓటీటీలో విడుదల చేస్తే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని  నిర్మాతలకు తెలంగాణా ఫిల్మ్‌ ఛాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ హెచ్చరించింది. ప్రభుత్వం అనుమతి ఇచ్చినా థియేటర్లు ఇంకా మూతపడి ఉండడంతో కొందరు నిర్మాతలు తమ చిత్రాలను ఓటీటీలో విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. దీనిపై ఓ నిర్ణయం తీసుకునేందుకు శనివారం సునీల్‌ నారంగ్‌ ఆఽధ్వర్యంలో తెలంగాణ ఫిల్మ్‌ ఛాంబర్‌ సభ్యులు, ఎగ్జిబిటర్లు సమావేశమయ్యారు. అక్టోబర్‌ 31 వరకూ తమ చిత్రాలను ఓటీటీలో విడుదల చేయకుండా ఆపాలని నిర్మాతలను కోరారు. థర్డ్‌ వేవ్‌తో ఇబ్బంది కలిగి థియేటర్లు ఓపెన్‌ కాకపోతే ఓటీటీలో విడుదల చేసుకోవడానికి ఎవరూ అడ్డు చెప్పరని, దీనికి సంబంధించి బుధవారం జరిగే జనరల్‌ బాడీ మీటింగ్‌లో తుది నిర్ణయం తీసుకుంటామని ఛాంబర్‌ సెక్రటరీ సునీల్‌ నారంగ్‌ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కూడా థియేటర్ల ప్రారంభం, టికెట్‌ రేట్లపై త్వరలో ఓ నిర్ణయం తీసుకోవాలని కోరారు. సునీల్‌ నారంగ్‌  మాట్లాడుతూ ‘‘ఇప్పటి వరకూ థియేటర్ల మీద రూపాయి సంపాదించుకుని కొత్త మాధ్యమం అందుబాటులో ఉంది కదా అని థియేటర్లను వదిలేయడం సరైన పద్దతి కాదు. ఇప్పటికే థియేటర్‌ యజమానులు  చాలా నష్టపోయారు. ఒకవేళ నిర్మాతలు ఎవరైన తమ ఇష్టానికి థియేటర్లను కాదని ఓటీటీలో సినిమాలు విడుదల చేస్తే రానున్న రోజుల్లో థియేటర్ల అవసరం రాకపోదు. ఆ సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. మరో మూడు నెలలు ఆగమని మేం కోరుతున్నామంతే. ఇప్పుడు ఎగ్జిబిటర్స్‌ అంతా ఒకటైపోయారు. మల్టీప్లెక్స్‌ యాజమాన్యాల సపోర్ట్‌ కూడా ఉంది. అందరం కలిసి తీసుకున్న నిర్ణయమిది’’ అని అన్నారు. ‘‘థియేటర్‌ నుంచి వచ్చే ఆదాయం, ఓటీటీ నుంచి వచ్చే ఆదాయం వేరు. కొత్త గర్ల్‌ఫ్రెండ్‌లా కనిపిస్తున్న ఓటీటీని చూసుకుని ఇప్పటి వరకూ అన్నం పెట్టిన థియేటర్‌లను వదిలేస్తే ఎలా? అని ఛాంబర్‌ జాయింట్‌ సెక్రటరీ రాజు ప్రశ్నించారు. ‘‘కరోనా విపత్కర పరిస్థితి వలన ఏడాదిన్నరగా సినిమాకు సంబంధించిన అందరం ఇబ్బంది పడుతున్నాం. ఇంత కాలం వేచి చూసిన  నిర్మాతలను మంచి వసూళ్లు రాబట్టడం కోసం మరో మూడు నెలలు వేచి చూడమంటున్నాం. థర్డ్‌ వేవ్‌తో ఇబ్బంది ఉంటే ఎవరైనా ఓటీటీకి విడుదల చేసుకోవచ్చు’’ అని అనుపమ్‌ రెడ్డి అన్నారు. 



Updated Date - 2021-07-04T00:26:13+05:30 IST