Review: ఫస్ట్‌ హాఫ్‌ అదిరింది!

Twitter IconWatsapp IconFacebook Icon
Review: ఫస్ట్‌ హాఫ్‌ అదిరింది!

కరోనా కాటుతో రెండేళ్లగా సినీ పరిశ్రమ అతలాకుతలం అయిపోయింది

ఈ ఏడాది ప్రారంభంలోనూ థర్డ్‌ వేవ్‌ భయం వెంటాడింది..

మరో పక్క థియేటర్‌ ఆక్యుపెన్సీ సమస్యలు..

ఇంకో దిక్కు నుంచి టికెట్‌ రేట్ల తగ్గింపు..

ఈ సమస్యలు కారణంగా భారీ చిత్రాలన్నీ వెనకడగు వేశాయి..

సమస్యలన్నీ అలాగే ఉన్నాయి... కానీ ఆరు నెలల సమయం గిర్రున తిరిగొచ్చేసింది. 

సగం సంవత్సరం పూర్తయిపోయింది. మరీ ఆరు నెలల సమీక్ష చూద్దాం! (Tollywood sixmonths review)


ఏడాది ప్రారంభంలో కరోనా థర్డ్‌ వేవ్‌ భయం ఉన్నప్పటికీ కొందరు నిర్మాతలు నష్టాల దార్లోకి వెళ్లకూడదని తమ కథపై ఉన్న నమ్మకంతో మన్నలి ఎవడ్రా ఆపేది అన్నట్లు ముందడుగు వేసి సినిమాలు విడుదల చేశారు. అందులో భారీ బడ్జెట్‌ చిత్రాలు, కొన్ని మినిమం బడ్జెట్‌ చిత్రాలు ఉన్నాయి. కొన్ని సూపర్‌హిట్‌ టాక్‌ తెచ్చుకోగా, మరికొన్ని ఓకే అనిపించుకున్నాయి. 


జనవరి...

జోరు తక్కువే!

జనవరి అంటేనే తెలుగు చిత్ర పరిశ్రమకు పెద్ద పండుగలాంటిది. సంక్రాంతి సీజన్‌లో సినిమాలు విడుదల చేయడానికి నిర్మాతలు ఎక్కువ మొగ్గు చూపిస్తారు. గత రెండేళ్లగా సంక్రాంతి పండుగ సందడే కనిపించలేదు. అయితే చిన్న చిత్రాలతో జనవరి సీజన్‌ మొదలైంది. జనవరి ఒకటో తేదిన ఆర్‌జీవీ ‘ఆశా ఎన్‌కౌంటర్‌’, వరుణ్‌ సందేశ్‌ ‘ఇందువదన’ చిత్రాలు విడుదలయ్యాయి. 7వ తేదిన రానా నటించిన ‘1945’ చిత్రాలు విడుదలయ్యాయి. ఇవేమీ బాక్సాఫీసు వద్ద నిలబడలేకపోయాయి. అయితే సంక్రాంతి సీజన్‌లో విడుదల చేస్తామని ప్రకటించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘రాధేశ్యామ్‌’, సర్కారు వారి పాట’ చిత్రాలు టిక్కెట్‌ ధరల సమస్య, ఽథర్డ్‌ వేవ్‌ భయంతో వెనక్కి తగ్గాయి. దాంతో సంక్రాంతి బరిలో ‘హీరో’, ‘రౌడీబాయ్స్‌’, ‘సూపర్‌మచ్చి’ చిత్రాలు దిగాయి. ఈ చిత్రాలేమీ అంతగా ఆకట్టుకోలేకపోయాయి. పండగ బరిలో నాగార్జున– నాగచైతన్యల ‘బంగార్రాజు’ దిగి పండుగ సందడిని రెట్టింపు చేసింది. వసూళ్ల వర్షం కురిపించింది. ఇక జనవరి నెలాఖరులో విడుదలైన కీర్తి సురేశ్‌ ‘గుడ్‌ లక్‌ సఖి’ మెప్పించలేకపోయింది. (Bangaraju)


Review: ఫస్ట్‌ హాఫ్‌ అదిరింది!

ఫిబ్రవరి... 

మనల్ని ఎవడ్రా ఆపేది...

ఫిబ్రవరి నెలకు వచ్చేసరికి థర్డ్‌ వేవ్‌ భయం కాస్త తగ్గడంతో 11న రవితేజ ‘ఖిలాడీ’తో రంగంలో దిగారు. హిట్‌ ఖాయం అనుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద బోల్లా కొట్టింది. హర్ష్‌ కానుమిల్లి నటించిన ‘సెహరి’ ప్రేక్షకాదరణ పొందింది. అనువాద చిత్రం ‘ఎఫ్‌.ఐ.ఆర్‌’ మంచి టాక్‌ తెచ్చుకుంది. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా వచ్చిన ‘డీజే టిల్లు’ అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించింది. చిన్న చిత్రంగా విడుదలై భారీ విజయం సాధించింది. వసూళ్లలోన తగ్గేదేలే అన్నట్లు కలెక్షన్ల వర్షం కురిపించింది. 18న మోహన్‌బాబు నటించిన ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’ విడుదలై తీవ్ర పరాజయాన్ని చవిచూసింది. ఇక సినిమా టికెట్‌ రేటు తక్కువ ఉన్నా, థియేటర్‌ ఆక్యుపెన్సీ 50 శాతమే ఉన్నా.. ఏపీ ప్రభుత్వం నుంచి ఎన్నో అడ్డంకులు ఎదురైనా ‘మనల్ని ఎవడ్రా ఆపేది’ అంటూ అనుకున్న సమయానికి పవన్‌ కల్యాణ్‌ ‘భీమ్లా నాయక్‌’ ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకొచ్చింది. హీరోగా పవన్‌కల్యాణ్‌, ప్రతినాయకుడిగా రానా విజృంభించారు. మలయాళంలో విజయం సాధించిన ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’ రే రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రం నిర్మాతలకు లాభాలు తెచ్చి పెట్టింది. (Bheemla nayak)

Review: ఫస్ట్‌ హాఫ్‌ అదిరింది!

మార్చిలో 

ఆర్‌ఆర్‌ఆర్‌ రికార్డ్‌..

మార్చి నెల శర్వానంద్‌ నటించిన ‘ఆడాళ్లు మీకు జోహార్లు’ చిత్రంతో మొదలైంది. కుటుంబ కథా చిత్రం అనే ట్యాగ్‌ లైన్‌ ఉన్నా అంతగా ఆకట్టుకోలేదు. ఆ చిత్రంతో పాటు విడుదలైన ‘సెబాస్టియన్‌’, ‘స్టాండప్‌ రాహుల్‌’ చిత్రాలు అంతగా ఆకట్టుకోలేదు. కరోనా, టికెట్‌ రేట్లు సమస్య ఇలా పలు కారణాల చేత ప్యాన్‌ ఇండియా చిత్రాలు ‘రాధేశ్యామ్‌’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఏడాది కాలంగా వాయిదా పడుతూ వచ్చాయి. ఎట్టకేలకు ఏపీ ప్రభుత్వం టికెట్‌ రేట్ల విషయంలో కొత్త జీవో ఇవ్వడం, రాయితీలు నడుమ మార్చిలో వెండితెరపై దర్శనమిచ్చాయి. మార్చి 11న ప్రభాస్‌ ‘రాధేశ్యామ్‌’ విడుదలైంది. ప్యాన్‌ ఇండియా స్థాయిలో ప్లాన్‌ చేసిన ఈ చిత్రం అంచనాలు అందుకోలేకపోయింది. ఆ తర్వాత మార్చి 25న విడుదలైన మల్టీస్టారర్‌ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ భారీ విజయాన్ని అందుకుంది. రాజమౌళి దర్శకత్వంలో దానయ్య నిర్మించిన ఈ చిత్రానికి తొలి రోజు కాస్త మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ వసూళ్ల వర్షంతో దూసుకెళ్లింది. రూ.1200 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టి కొత్త రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. (RRR-Radhe shyam)

Review: ఫస్ట్‌ హాఫ్‌ అదిరింది!

ఏప్రిల్‌ 

ఫూల్‌ చేసింది

ఏప్రిల్‌ నెల అంత సక్సెస్‌ఫుల్‌గా లేదనిపించింది. ఈ నెల 1న విడుదలైన తొలి చిత్రం ‘మిషాన్‌ ఇంపాజిబుల్‌’.  దీనిపై చిత్ర బృందం పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేసింది. తాప్సీ కథానాయికగా రూపొందిన ఈ చిత్రం ఎంతో బజ్‌ క్రియేట్‌ చేసింది. విడుదలయ్యాక సోసోగా అనిపించింది. ఆ తర్వాతి వారం వరుణ్‌తేజ్‌ హీరోగా విడుదలైన ‘గని’ చిత్రం కూడా పరాజయాన్ని చవిచూసింది. హీరో కూడా ఈ విషయాన్ని అంగీకరించారు. ‘కేజీఎఫ్‌’కు కొనసాగింపుగా వచ్చిన ‘కేజీఎఫ్‌–2’ మరోసారి సత్తా చాటింది. రాఖీ భాయ్‌ మరోసారి ప్రేక్షకుల మదిలో నిలిచిపోయారు. 2021 దసరా నుంచి వాయిదా పడుతూ వచ్చిన చిత్రం ‘ఆచార్య’. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి–రామ్‌చరణ్‌ నటించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఏప్రిల్‌ 29న భారీ హంగులతో విడుదలైన ఈ చిత్రం పరాజయాన్ని చవిచూసింది. (Kgf-2 acharya)

Review: ఫస్ట్‌ హాఫ్‌ అదిరింది!

మే..

మోత మోగించింది..

చిన్న చిత్రాల జోరుతో మే నెల మొదలైంది. మే 6న సుమ ‘జయమ్మ పంచాయితీ’, శ్రీవిష్ణు  ‘భళా తందనాన’ చిత్రాలు ప్రేక్షకాదరణకు నోచుకోలేదు. కొత్త ప్రయత్నం అని గుర్తింపు తెచ్చుకున్నా బాక్సాఫీస్‌ వద్ద చతికిలపడ్డాయి.మాస్‌ కా దాస్‌ విశ్వక్‌సేన్‌ తన స్టైల్‌కు భిన్నంగా నటించిన ‘అశోకవనంలో అర్జున కల్యాణం’ వినోదాన్ని నింపింది. లాక్‌డౌన్‌లో పెళ్లి, భావోద్వేగాల నడుమ సాగిన ఈ చిత్రంతో విశ్వక్‌సేన్‌ మరో మెట్టు ఎక్కాడు. మే 12న విడుదలైన మహేశ్‌బాబు ‘సర్కారు వారి పాట’ వసూళ్ల వసూళ్ల వర్షం కురిపించింది. రాజశేఖర్‌ హీరోగా నటించిన శేఖర్‌ చిత్రం పాజిటవ్‌ టాక్‌ తెచ్చుకున్నప్పటికీ ఆర్థిక కారణాలు, కోర్టులు, కేసులు అంటూ సినిమా ప్రదర్శన ఆగిపోయింది. మండుటెండల్లో ‘ఎఫ్‌ 3’ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులకు చల్లని వినోదాన్ని పంచింది. ఎఫ్‌2 చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రం భారీ కలెక్షన్లు రాబట్టింది. (Sarkaru vaari paata)

Review: ఫస్ట్‌ హాఫ్‌ అదిరింది!

జూన్‌... 

ఉద్వేగభరితం...

26/11 ముంబై ఉగ్రదాడుల్లో దేశం కోసం ప్రాణాలు అర్పించిన మేజర్‌ సందీప్‌ ఉన్ని కృష్ణన్‌’ కథతో రూపొందిన ‘ ‘మేజర్‌’ చిత్రంతో జూన్‌ ప్రారంభమైంది. అడివి శేష్‌ హీరోగా నటించిన ఈ చిత్రం దేశ వాప్తంగా ప్రేక్షకుల్లో స్ఫూర్తి రగిల్చింది. 3న విడుదలైన కమల్‌హాసన్‌ ‘విక్రమ్‌’ ఊహించని విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత జూన్‌ 10న, నాని, నజ్రియా నటించిన ‘అంటే.. సుందరానికీ’తో ప్రేక్షకులకు చక్కని ఫీలింగ్‌ కలిగించారు. థియేటర్‌, ఓటీటీ అంటూ ఎన్నో సార్లు వాయిదా పడిన రానా, సాయి పల్లవి నటించిన ‘విరాట పర్వం’ అనేక ఇబ్బందులు ఎదుర్కొని జూన్‌ 17న ప్రేక్షకుల ముందుకొచ్చింది. విమర్శకుల ప్రశంసలు అందుకుంది కానీ కమర్షియల్‌గా ముందుకెళ్లలేదు. అదే రోజున సత్యదేవ్‌ ‘గాడ్సే’ విడుదలైంది. అంతగా ప్రేక్షకులకు చేరువ కాలేదు. 24న ఆకాశ్‌ పూరి ‘చోర్‌ బజార్‌’, సుమంత్‌ అశ్విన్‌– ఎం.ఎస్‌. రాజు ‘7 డేస్‌ 6 నైట్స్‌’, కిరణ్‌ అబ్బవరం ‘సమ్మతమే’ ఓ మాదిరిగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. (Major - virata parvam)


Review: ఫస్ట్‌ హాఫ్‌ అదిరింది!

టాలీవుడ్‌ స్ట్రెయిట్‌ చిత్రాలతోపాటు తెలుగు ప్రేక్షకుల అభిరుచి మేరకు అనువాద చిత్రాలు కూడా విడుదలయ్యాయి. విశాల్‌ ‘సామాన్యుడు’, అజిత్‌ ‘వలిమై’, పునీత్‌ రాజ్‌కుమార్‌ జేమ్స్‌ అంతగా ఆకట్టుకోలేదు. ‘ఈటీ’, విజయ్‌ బీస్ట్‌, కన్మణి–రాంబో–ఖతిజా’ చిత్రాలు పరాజయం పాలయ్యాయి. కన్నడ చిత్రం ‘కేజీఎఫ్‌ 2’ సూపర్‌ హిట్‌ అయింది. కమల్‌హాసన్‌ ‘విక్రమ్‌’ ఊహించని విజయం సాధించింది. బాలీవుడ్‌ నటి ఆలియాభట్‌ నటించిన ‘గంగూబాయి కతియావాడి’ సక్సెస్‌ సాధించింది. ఓటీటీ విడుదలైన చిత్రాలు కూడా కొన్ని సత్తా చాటాయి. సుమంత్‌ ‘మళ్లీ మొదలైంది’, ప్రియమణి ‘భామా కలాపం’, నివేదా పేతురాజ్‌ ‘బ్లడీ మేరీ’ వంటి తెలుగు చిత్రాలతోపాటు ‘జనగణమన’, ‘కశ్మీర్‌ ఫైల్స్‌’.. ఇతర భాష చిత్రాలు కూడా ఓటీటీ వేదికగా మెప్పించాయి. (Vikram-valimai)

 

పరిస్థితులు అన్ని బావుంటే టాలీవుడ్‌లో స్ట్రెయిట్‌, డబ్బింగ్‌ చిత్రాలు కలిపి 275 నుంచి 300 చిత్రాలు విడుదలవుతాయి. కరోనా కారణంగా రెండేళ్లగా ఆ పరస్థితి లేదు. 2021లో మొత్తం 65 చిత్రాలు విడుదల కాగా, 2021లో స్ట్రెయిట్‌ చిత్రాలు 185, డబ్బింగ్‌ చిత్రాలు 47 కలిపి మొత్తం 232 చిత్రాలు వెండితెరపై సందడి చేశాయి. మరి ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో 93 స్ట్రెయిట్‌ చిత్రాలు, 22 అనువాద చిత్రాలు తెలుగుతెరపై సందడి చేశాయి. వసూళ్ల పరంగా ఈ ఏడాది ప్రథమార్థం అదరగొట్టిందని చెప్పవచ్చు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘కేజీయఫ్‌’ కలిపి సుమారు రూ. 2000 కోట్లకు పైగా బిజినెస్‌ చేశాయి. కొవిడ్‌ తర్వాత ఇంత వసూళ్లు రాబట్టడం ఇదే మొదటిసారని ట్రేడ్‌ పండితులు చెబుతున్నారు. కథలో విషయం ఉంటే కరోనా భయం, టికెట్‌ రేట్ల ప్రభావం ఏం చేయవని ఈ ఏడాది ఫస్టాఫ్‌ నిరూపించింది. 

AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.