టాలీవుడ్‌: ఏది ముందు.. ఏది వెనుక!

ABN , First Publish Date - 2021-07-07T02:39:50+05:30 IST

పండుగ సీజన్‌, మంచి రోజుల్లో ఒక హీరో సినిమా, మరో హీరో సినిమాతో పోటీ పడుతుండేది. ఇప్పుడు ఒక హీరో సినిమా ఆ హీరో సినిమాతోనే పోటీ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

టాలీవుడ్‌: ఏది ముందు.. ఏది వెనుక!

పండుగ సీజన్‌, మంచి రోజుల్లో ఒక హీరో సినిమా, మరో హీరో సినిమాతో పోటీ పడుతుండేది. ఇప్పుడు ఒక హీరో సినిమా ఆ హీరో సినిమాతోనే పోటీ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే స్టార్‌ హీరోల చిత్రాలు ఒకటి సెట్‌ మీద ఉంటే.. మరో సినిమా విడుదలకు రెడీగా ఉంది. ప్రస్తుతం థియేటర్లు ఓపెన్‌ చేయడానికి అనుమతి ఇచ్చినా తెరుచుకోలేదు. థియేటర్లు ఓపెన్‌ అయ్యేలోపు మరి కొన్ని చిత్రాలు కాపీతో రెడీ అయ్యేలా ఉన్నాయి. ఇవన్నీ ఒకేసారి వరుస కడితే తమ చిత్రాలతోనే తమకు పోటీ నెలకొనేలా కనిపిస్తోంది. అయితే విడుదలకు సిద్ధమైన చిత్రాలను దేనిని ముందు తీసుకురావాలో.. దేనిని వెనుక తీసుకురావాలో అన్న సందిగ్ధంలో హీరోలు, నిర్మాతలున్నారు.


కరోనా సమయంలో కూడా ‘వకీల్‌ సాబ్‌’తో బాక్సాఫీసు బద్దలుకొట్టారు పవన్‌కల్యాణ్‌. ప్రస్తుతం ఆయన మూడు చిత్రాలు అంగీకరించారు. అందులో ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’ 50 శాతం పూర్తయింది. క్రిష్‌ దర్శకత్వంలో హరిహర వీరమల్లు’ కూడా 50 శాతానికి పైగా షూటింగ్‌ పూర్తయిందని సమాచారం. పీరియాడిక్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం సంక్రాంతి బరిలో ఉంది. మరి ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’ విడుదల గురించి స్ఫష్టత లేదు. ఈ రెండు చిత్రాలు కూడా పోటీ పడతాయనే మాటలు వినిపిస్తున్నాయి. లేదంటే ఒకటి ముందు ఒకటి వెనుకు అయ్యే అవకాశాలున్నాయి. 




‘బాహుబలి’, ‘సాహో’ చిత్రాలతో ప్యాన్‌ ఇండియా స్టార్‌గా మారారు ప్రభాస్‌. ప్రస్తుతం ఆయన చేతిలో ‘రాధేశ్యామ్‌’, ‘ఆదిపురుష్‌’, ‘సలార్‌’ చిత్రాలున్నాయి. మరో పక్క నాగ్‌ అశ్విన్‌తో ఓ సినిమా అంగీకరించారు. ప్రశాంత్‌ నీల్‌ ‘సలార్‌’ ఓంరౌత్‌ ‘ఆదిపురుష్‌’ చిత్రీకరణ ప్రారంభమైంది. ‘రాధేశ్యామ్‌’ చిత్రీకరణ పూర్తి చేసుకుని దసరాకు విడుదలకు సిద్ధంగా ఉంది. ‘ఆది పురుష్‌’ 2022లో థియేటర్లోకి వస్తుందని ముందే ప్రకటించారు. అయితే వచ్చే ఏడాది ‘ఆదిపురుష్‌’, ‘సలార్‌’ సినిమాలతో ప్రభాస్‌ బరిలో ఉంటే అవకాశాలున్నాయి. 



రామ్‌చరణ్‌ నటిస్తున్న రెండు చిత్రాలు దసరా బరిలో ఉన్నాయి. ఆయన సిద్ధాగా నటిస్తున్న ‘ఆచార్య’ వేసవిలో విడుదల కావాల్సి ఉంది. లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడింది. దసరాకు ‘ఆచార్య’ను తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. మరో పక్క ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కూడా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. లాక్‌డౌన్‌కి ముందు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ అక్టోబర్‌ 13న విడుదల కానుందని ప్రకటించారు. త్వరగా నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసి దసరాకే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ విడుదల చేస్తారని ఫిల్మ్‌నగర్‌ టాక్‌. అదే జరిగితే రామ్‌చరణ్‌ తను నటించిన రెండు చిత్రాలతో పోటీ పడాల్సి వస్తుంది.  



వెంకటేశ్‌ నటించిన ‘నారప్ప’, ‘దృశ్యం 2’ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అయితే వీటిలో ఏది ముందు ఏది వెనుక విడుదల చేయాలనే సందిగ్ధంలో నిర్మాతలున్నారు. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో ‘అసురన్‌’ రీమేక్‌ ‘నారప్ప’, జీతూజోసెఫ్‌ తెరకెక్కించిన ‘దృశ్యం 2’ రెండు చిత్రాలు ఓటీటీకి సై అన్నట్లు వార్తలొచ్చాయి. అయితే తెలంగాణా ఎగ్జిబిటర్స్‌ జరుపుతున్న చర్చల నేపథ్యంలో నిర్మాత సురేశ్‌బాబు ఓటీటీ విడుదలకు వెనకడుగు వేసేలా కనిపిస్తున్నారు. ఒకవేళ థియేటర్‌ రిలీజ్‌ అనుకుంటే రెండు చిత్రాలు వరుసగా పోటీ పడే అవకాశం ఉంది. మరోవైపు అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ‘ఎఫ్‌3’ సినిమా షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. అంటే వెంకటేశ్‌ మూడు సినిమాలు వరుసగా రిలీజ్‌కు ఉన్నట్లే!



నాని నటించిన రెండు చిత్రాలు టక్‌ జగదీష్‌, శ్యామ్‌ సింగారాయ్‌’ విడుదలకు రెడీగా ఉన్నాయి. ‘టక్‌ జగదీష్‌’ ఏప్రిల్‌లో విడుదల కావాల్సి ఉంది. కరోనాతో థియేటర్లు మూతపడడంతో ఆగింది. తాజాగా ఆగస్టులో విడుదల చేసేందుకు వచ్చేందుకు సిద్థమవుతోంది. మరోవైపు ‘శ్యామ్‌ సింగరాయ్‌’, ‘అంటే సుందరానికి’ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. ఈ రెండూ చిత్రాలు డిసెంబర్‌లో విడుదల చేసే అవకాశం ఉంది. రవితేజ, శ్రీవిష్ణు, నితిన్‌ తమ చిత్రాల షూటింగ్‌ పూర్తి చేసుకుని రిలీజ్‌కు రెడీ అయ్యారు. అయితే థియేటర్లు తెరిచాక ఈ సినిమాలన్నీ ఏ వరుసలో విడుదలవుతాయో చూడాలి. ఒక వారం తేడాతో విడుదల చేస్తే వసూళ్ల విషయంలో దెబ్బ తినే అవకాశం ఉంది. 



అక్కినేని అఖిల్‌, పూజాహెగ్డే జంటగా నటించిన ‘మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచ్‌లర్‌’ చిత్రానికి కరోనా ఇక్కట్లు తప్పడం లేదు. వేసవిలో విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది. కొద్దిరోజులుగా ఓటీటీలో విడుదల అవుతుందని ప్రచారం జరుగుతోంది. ఆ వార్తల్ని నిర్మాణ సంస్థ కొట్టిపడేసింది. దసరాకు పెద్ద సినిమాల హవా ఉండడంతో ఈ చిత్రాన్ని డిసెంబర్‌లో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అదే నెలలో సురేందర్‌ రెడ్డితో చేస్తున్న ‘ఏజెంట్‌’ సినిమా థియేటర్లలో విడుదల కానుందని ఇటీవల వదిలిన పోస్టర్‌లో తెలిపారు. మరి అఖిల్‌ ఏదీ ముందు తీసుకొస్తారో చూడాలి. రవితేజ, వరుణ్‌ తేజ్‌, శ్రీవిష్ణు, విష్వక్సేన్‌ వంటి హీరోల చిత్రాలు కూడా విడుదల సిద్ధంగా ఉన్నాయి. 

Updated Date - 2021-07-07T02:39:50+05:30 IST