'మా' అధ్యక్షుడు, సినీ హీరో మంచు విష్ణు (Manchu Vishnu)తో టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు (Dil Raju) సమావేశమయ్యారు. ఈ ఆగస్ట్ 1వ తేదీ నుంచి టాలీవుడ్లో షూటింగ్లు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఇండస్ట్రీలో నెలకొన్న పలు సమస్యలను పరిష్కరించుకునేందుకు నిర్మాతలు ప్రత్యేకంగా చర్చలు జరిపిన విషయం అందరికీ తెలిసిందే. ప్రధానంగా బడ్జెట్ కంట్రోల్ విషయంలో అలాగే, హీరోల రెమ్యునరేషన్ తగ్గించుకునే విషయంలో గిల్డ్ సమావేశంలో నిర్మాతలు జరిపిన చర్చలు కొంతవరకు సఫలమయ్యాయి.
ఇక ఈ బుధవారం నిర్మాతలతో 'మా' అసోసియేషన్ సభ్యులు కూడా సమావేశం అయి పలు కీలక అంశాలపై చర్చలు జరిపారు. ఈ క్రమంలోనే 'మా' అధ్యక్షుడు మంచు విష్ణును ప్రత్యేకంగా నిర్మాత దిల్ రాజు కలిశారు. ఈ సందర్భంగా విష్ణు 'మా' సంక్షేమ కమిటీ వినతి పత్రాన్ని దిల్ రాజుకు అందించారు.
మంచు విష్ణు కార్యాలయంలో కలిసిన దిల్ రాజు పలు అంశాలపై చర్చించారు. వీరితో పాటు సమావేశంలో మిగతా నిర్మాతలు కూడా ఉన్నారు. ఈ విషయాన్ని తాజాగా మా అధ్యక్షుడు మంచు విష్ణు ట్వీట్ ద్వారా తెలిపారు. 'మా' లో ఉన్న సభ్యులతోపాటు కొత్తవారిని కూడా ప్రొత్సహించాలని దిల్ రాజును మంచు విష్ణు కోరారు. అంతేకాదు, కొత్త నటీనటులకు అవకాశాలిచ్చి 'మా' లో భాగస్వామ్యం చేయాలని విజ్ఞప్తి చేశారు.