విభేదాలున్నా.. సినిమా కోసం

చెన్నైలోని పద్మాలయ స్టూడియో కార్యాలయం..

హీరో కృష్ణ ఎదురుగా కూర్చుని కథ చెబుతున్నారు దర్శకుడు పి..చంద్రశేఖరరెడ్డి. వారిద్దరి కాంబినేషన్‌లో అంతవరకూ చాలా చిత్రాలు వచ్చాయి. బాగా ఆడాయి కూడా. అందుకే తీయబోయే కొత్త సినిమా కూడా సక్సెస్‌ కావాలని ఓ విభిన్నమైన కథను ఎన్నుకున్నారు దర్శకుడు పి.సి.రెడ్డి. అక్కినేని, సావిత్రి జంటగా నటించిన ‘మూగమనసులు’, హిందీలో రాజేశ్‌ఖన్నా హీరోగా చేసిన ‘మెహబూబా’ చిత్రాల ఆధారంగా పి.సి.రెడ్డి శ్రీమతి లలిత తయారు చేసిన కథ అది.స్టోరీ నేరేషన్‌ పూర్తి చేసి, ఎలా ఉంది? అన్నట్లు కృష్ణ వైపు చూశారు పి.సి.రెడ్డి.

‘కథ బాగుంది. నా పాత్ర బాగుంది. హీరోయిన్‌ పాత్రకు కూడా ప్రాధాన్యం ఉంది. హీరోయిన్‌గా ఎవరిని అనుకుంటున్నారు?’ అని అడిగారు కృష్ణ.

వాణిశ్రీని హీరోయిన్‌గా తీసుకోవాలని పి.సి.రెడ్డి మనసులో ఉన్నా, ఆ మాటను బయటకు చెప్పలేకపోయారు. కారణం ఏమిటంటే... ఆ సమయంలో హీరో కృష్ణకు, వాణిశ్రీకి మధ్య మాటలు లేవు. తెలుగు సినీ కళాకారులు వైజాగ్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో తమ ‘దేవదాసు’ చిత్రం గురించి ఆమె అసందర్భంగా ప్రస్తావించడంతో కృష్ణ, విజయనిర్మల ఆగ్రహించారు. వాణిశ్రీ మీద ఆర్టిస్టు అసోసియేషన్‌లో ఫిర్యాదు  కూడా చేశారు. ఈ సంఘటన తర్వాత కృష్ణ, విజయనిర్మల -వాణిశ్రీల మధ్య దూరం పెరిగింది. ఈ కారణంగానే ‘చీకటి వెలుగులు’ చిత్రం తర్వాత కృష్ణ, వాణిశ్రీ కాంబినేషన్‌లో మరో సినిమా రాలేదు. ఈ విషయమంతా పి.సి.రెడ్డికి తెలుసు కనుక వాణిశ్రీ పేరు ప్రస్తావించడానికి సందేహించారు. ఇంతలోనే కృష్ణనే ‘వాణిశ్రీని తీసుకోండి. విభిన్న మనస్తత్వాలు కలిగిన ఈ రెండు పాత్రలను ఆమే సమర్ధంగా పోషించగలదు’ అన్నారు.

‘కానీ మీరు, ఆమెతో....’ అని పి.సి.రెడ్డి ఏదో అనబోతుంటే ‘వ్యక్తిగత జీవితం వేరు, వృత్తి జీవితం వేరు. ఆమెనే తీసుకోండి’ అని చెప్పారు కృష్ణ. 

వాణిశ్రీ దగ్గరకు వెళ్లి ఈ విషయం చెప్పారు పి.సి.రెడ్డి. హీరో కృష్ణ రికమండ్‌ చేయడంతో వాణిశ్రీ కూడా వెంటనే సరేనన్నారు. అలా వారిద్దరూ కలసి నటించిన ఆ చిత్రం పేరు ‘జన్మజన్మల బంధం’. ఇందులో ఒకర్ని విడిచి మరొకరు ఉండలేని ప్రేమికుల పాత్రలను కృష్ణ, వాణిశ్రీ పోషించారు. షూటింగ్‌ సమయంలో పాత్రల్లో ఎంతో లీనమై నటించేవారు. అయితే షాట్‌ పూర్తి కాగానే వారిద్దరూ మాట్లాడుకోకుండా చెరో పక్క కూర్చునేవారు. చూసేవారికి ఇదంతా విచిత్రంగా అనిపించేది. మరో విషయం ఏమిటంటే హీరో కృష్ణకు ‘నీటి గండం ఉంది, జాగ్రత్త’ అని వాళ్ల అమ్మ నాగరత్నమ్మ తరచూ హెచ్చరిస్తుండేవారు. ‘జన్మజన్మల బంధం’ కోసం హోగినకల్‌ జలపాతంలో కృష్ణ, వాణిశ్రీ మీద ఓ సీన్‌ తీశారు దర్శకుడు. నీళ్లలో వాణిశ్రీ ఉంటే, ఆమె మీదకు వంగి కృష్ణ కౌగలించుకొనే షాట్‌ ఒకటుంది. కృష్ణకు నీటి గండం ఉందని వాణిశ్రీకి కూడా తెలుసు. అందుకే  ఆయన బరువుని భరిస్తూ, నీళ్లలో కొట్టుకుపోకుండా ఆయన్ని జాగ్రత్తగా పట్టుకున్నారు వాణిశ్రీ. నటీనటులన్నాక కొన్ని విషయాల్లో అభిప్రాయ బేధాలు వస్తూనే ఉంటాయి. కానీ సినిమా కోసం వాటన్నింటిని పక్కన పెట్టి వాళ్లిద్దరూ జోడీగా నటించడం విశేషం. 

                                                                                                      - వినాయకరావు

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.