‘మా’ అధ్యక్ష పదవికి.. మెగా మద్దతే కీలకం

Twitter IconWatsapp IconFacebook Icon
మా అధ్యక్ష పదవికి.. మెగా మద్దతే కీలకం

మెగా మద్దతు ఎవరికుంటే.. వారినే 'మా' అధ్యక్ష పదవి వరిస్తుందనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు అదే జరుగుతూ వచ్చింది. మెగాస్టార్‌ చిరంజీవి నుంచి మద్దతు లభించిందంటే.. పోటీలో ఉన్న వ్యక్తి దాదాపు 'మా' అధ్యక్ష పీఠంపై కూర్చున్నట్లే. అయితే ఈసారి జరగబోయే పోటీలో మెగా మద్దతు ఎవరికి ఉంటుందనేదే.. ఇప్పుడందరిలో ఆసక్తిని క్రియేట్‌ చేస్తోంది. సెప్టెంబర్‌లో 'మా' ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఒకవైపు సీనియర్‌ నటుడు ప్రకాశ్‌ రాజ్‌, మరో వైపు మంచు విష్ణు ఇప్పటికే ఈ అధ్యక్ష పదవి కోసం బరిలోకి దిగుతున్నట్లుగా ప్రకటించారు. వీరిద్దరే అనుకుంటే.. ఇప్పుడు సీనియర్‌ నటి, ప్రస్తుత 'మా' కార్యదర్శిగా ఉన్న జీవితా రాజశేఖర్‌ కూడా రంగంలోకి దిగుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈసారి త్రిముఖ పోరు తప్పదు అనేలా సంకేతాలు అయితే కనబడుతున్నాయి. అయితే ఈ ముగ్గురిలో ఎవరికి మెగా మద్దతు లభించనుంది అనేదే ఇక్కడ కీలకం. ఒక్కసారి ఈసారి పోటీకి రెడీ అవుతున్న వారి బలాబలాలేంటో తెలుసుకుందాం.


మా అధ్యక్ష పదవికి.. మెగా మద్దతే కీలకం

ప్రకాశ్‌ రాజ్‌

1988లో కన్నడలో చేసిన చిత్రంతో సినీ కెరియర్‌ ప్రారంభించిన ప్రకాశ్‌ రాజ్‌.. అనేక భాషల్లో నటించి విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. దాదాపు 400 చిత్రాలలో ఆయన నటించారు. ఇంకా నటిస్తూనే ఉన్నారు. మెగాస్టార్‌ చిరంజీవితో మంచి అనుబంధం ఉంది. ఒకట్రెండు సార్లు ఇండస్ట్రీలో ప్రకాశ్‌ రాజ్‌కి వచ్చిన ప్రాబ్లమ్స్‌ని చిరంజీవే క్లియర్‌ చేశారు. చిరంజీవిని ఆయన అన్నయ్య అని పిలుస్తారు. అంతే కాకుండా ప్రకాశ్‌ రాజ్‌కి సేవా గుణం ఎక్కువ. తన బ్యాంకు అకౌంట్స్‌లో ఉన్న బ్యాలెన్స్‌ మొత్తాన్ని ఇటీవల కాలంలో ఆయన సేవ కోసం వినియోగించారు. కొన్ని గ్రామాలను దత్తత తీసుకుని.. ఆ గ్రామాలకు అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేశారు. లాక్‌డౌన్‌లో కూడా ఎందరికో ఆయన సహాయం అందించారు. పరభాషా నటుడైనప్పటికీ.. మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ సభ్యుడుగా ఉన్నారు కాబట్టి.. పోటీ చేసేందుకు ఆయన అర్హుడే. ఈ పదవికి తెలుగు నటీనటులే పోటీ చేయాలని 'మా'లో రూల్‌ ఉంటే మాత్రం.. ప్రకాశ్‌ రాజ్‌ ఈ పోటీకి ప్రయత్నం చేసేవాడు కాదు కాబట్టి.. అతనికి ఈ పదవి కోసం పోటీ చేసే అర్హత ఉందని చెప్పుకోవచ్చు. గెలుపోటములు పక్కన పెడితే.. ఈ మధ్యకాలంలో ఆయన ఆలోచనా సరళి ప్రకారం.. పాలన పట్ల ఆయనకి మంచి అవగాహనే ఉందని పేర్కొనవచ్చు.

మా అధ్యక్ష పదవికి.. మెగా మద్దతే కీలకం

మంచు విష్ణు

మంచు విష్ణు బలం మంచు మోహన్‌ బాబు. టాలీవుడ్‌ ఇండస్ట్రీకి చిరంజీవి, మోహన్‌ బాబు ప్రస్తుతం పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అలాంటి మోహన్‌ బాబు ఫ్యామిలీ నుంచి మంచు విష్ణు పోటీకి దిగుతుంటే.. అందరి చూపు అతనిపైనే ఉండటం, గెలుపు ఖాయం అనేలా భావన రావడం సహజమే. విష్ణు గురించి చెప్పుకోవాల్సి వస్తే.. తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన నటుడతను. నిర్మాతగా 24 క్రాఫ్ట్‌ల మీద అవగాహన ఉండటం, హీరోగానూ కొనసాగుతుండటంతో పాటు బిజినెస్‌ వ్యవహారాలపై కూడా పట్టు ఉండటంతో.. ఈ పదవికి ఆయన అర్హుడే. సినిమా హీరోగానూ, నిర్మాతగానూ ఆయన తక్కువ చిత్రాలే చేసినా.. సినిమా ఇండస్ట్రీ ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ యొక్క పూర్తి చిత్రం విష్ణుకి తెలుసు. ఇక పక్కన మహాపర్వతం వంటి మోహన్‌ బాబు ఉన్నాడు కాబట్టి.. అతని పాలన ఎలా ఉంటుందనే విషయంలో ఆలోచించాల్సిన అవసరమే లేదు.


మా అధ్యక్ష పదవికి.. మెగా మద్దతే కీలకం

జీవితా రాజశేఖర్‌

ఎంట్రీ గురించి ఇంకా ప్రకటించకపోయినప్పటికీ, ఈ సారి ఖచ్చితంగా రాజశేఖర్‌ ఫ్యామిలీ నుంచి 'మా' బరిలో పోటీ ఉంటుందని అంతా ఊహిస్తూనే ఉన్నారు. ఆమె పోటీ విషయమే అతి త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. జీవితా రాజశేఖర్‌ విషయానికి వస్తే.. ఆమె సీనియర్‌ నటి. జయసుధ తర్వాత మళ్లీ ఈ పదవి కోసం పోటీ చేస్తున్న మహిళ. అంతే కాకుండా 'మా'లోని లొసుగులన్నీ తెలిసిన వ్యక్తి కావడంతో.. 'మా'ని నిలబెట్టగల సామర్థ్యం ఆమెకు ఉందని చెప్పుకోవచ్చు. గతంలో జరిగిన కొన్ని విషయాలను పక్కన పెడితే.. జీవితా రాజశేఖర్‌ కూడా అన్ని విధాలా ఈ పోటీకీ అర్హురాలు. ఆమె నిర్ణయం, అజెండా ఏమిటనేది తెలిస్తే.. ఈ పోటీలో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 

పాలిటిక్స్‌

'మా' ఎన్నికలకు పాలిటిక్స్‌ ఏమిటని అంతా అనుకోవచ్చు.. కానీ ఈ ఎన్నికలలో గత రెండు మూడు టర్మ్స్‌గా పొలిటికల్‌ టచ్‌ కూడా ఉంటోంది. మోహన్‌ బాబు అండ్‌ ఫ్యామిలీకి ఏపీ సీఎం జగన్‌తో ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అటునుంచి పూర్తి మద్దతు ఉన్నట్లే. తెలంగాణ రాష్ట్ర సీఎం ఫ్యామిలీతో కూడా మోహన్‌ బాబు ఫ్యామిలీకి మంచి అనుబంధమే ఉంది. ప్రకాశ్‌ రాజ్‌ విషయానికి వస్తే.. ఆయన బీజేపీ వ్యతిరేకి. టీఆర్‌ఎస్‌తో కొద్దిపాటి సంబంధాలున్నాయి. అది ఈ ఎన్నికలకు ఎంత వరకు ఉపయోగపడుతుందనేది చెప్పలేం. ఇక జీవితా రాజశేఖర్‌ విషయానికి వస్తే.. ఆమె ఇటీవలే బీజేపీ కండువా కప్పుకుంది. ఆ పార్టీ నుంచి ఈ ఫైట్‌ విషయంలో ఆమెకు అంతగా సపోర్ట్‌ లభించకపోవచ్చు.  

మా అధ్యక్ష పదవికి.. మెగా మద్దతే కీలకం

మెగాస్టార్‌ చిరంజీవి మద్దతు ఎవరికి?

ప్రస్తుతం పోటీకి దిగుతున్న ముగ్గురిలో మెగాస్టార్‌ చిరంజీవి మద్దతు ఎవరికి ఉంటుందనేదే ఇప్పుడు కీలకంగా మారింది. మంచు ఫ్యామిలీతో ఒకప్పుడు కాస్త ఇబ్బందిక పరిస్థితులు ఉన్నప్పటికీ.. ఈ మధ్య కాలంలో మాత్రం చిరంజీవి, మోహన్‌ బాబులు గొప్ప స్నేహితులుగా మారిపోయారు. ఇండస్ట్రీకి సంబంధించి చిరు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా.. మోహన్‌ బాబు, నాగార్జున ఇంకా ఇతర పెద్దలను సంప్రదించే తీసుకుంటున్నారు. ఆ రకంగా చూస్తే.. చిరు మద్దతు మంచు ఫ్యామిలీకే ఉంటుందని అంతా భావిస్తారు. కానీ ప్రకాశ్‌ రాజ్‌ కూడా చిరంజీవి ఆప్తుడే. మంచు విష్ణు నుంచి ప్రకటన రాకముందే.. ప్రకాశ్‌ రాజ్‌కి నాగబాబు మద్దతు ప్రకటించేశాడు. ప్రకాశ్‌ రాజ్‌ కూడా చిరంజీవి అందరివాడు.. ఆయనను ఇందులోకి తీసుకురావాలని అనుకోవడం లేదంటూ స్టేట్‌మెంట్‌ కూడా ఇచ్చాడు. ఇన్‌ డైరెక్ట్‌గా మెగా మద్దతు తనకే అన్నట్లుగా ప్రకాశ్‌ రాజ్‌ స్టేట్‌మెంట్‌ ఉంది. ఇక జీవిత విషయానికి వస్తే.. గతంలో ఈ రెండు కుటుంబాలకు కాదు.. వారి అభిమానులకు పడేది కాదు. రాజశేఖర్‌ ఫ్యామిలీపై చిరంజీవి అభిమానులు అటాక్‌ చేసినప్పటి నుంచి.. చిరు ఈ ఫ్యామిలీకి కాస్త దగ్గరగానే ఉంటున్నాడు. గత 'మా' ప్రెస్‌ మీట్‌లో రాజశేఖర్‌పై చిరు సీరియస్‌ అయినప్పటికీ.. జీవితనే ముందుకు వచ్చి ఆ సమస్యను అక్కడితో ముగించింది. మహిళగా పోటీ దిగుతుంది కాబట్టి.. ఆమె పోటీపై చిరు స్టాండ్‌ ఎలా ఉంటుందనేది ముందు ముందు చూడాలి. ఏదీఏమైనా మెగాస్టార్‌ని కూడా ఈ ముగ్గురు ఇరకాటంలో పెట్టారని చెప్పవచ్చు. 


ఏకగ్రీవం:

జీవిత బరిలోకి దిగనంత వరకు.. ఈ ఎన్నికలు ఏకగ్రీవం అయ్యే ఛాన్స్‌ కనబడింది. ప్రకాశ్‌ రాజ్‌కు ఏదో ఒకటి చెప్పి.. బరి నుంచి తప్పించడమో.., లేదంటే యంగ్‌ హీరోవి.. నీకింకా చాలా టైమ్‌ ఉంది అని చెప్పి విష్ణుని సైడ్‌ చేయడమో జరిగేదని అంతా భావించారు. కానీ జీవిత అనూహ్య ఎంట్రీ ఈ ఎన్నికల తీరునే మార్చేసింది. ఎలక్షన్‌ పక్కా అనేలా తేల్చేసింది. సో.. ఈ త్రిముఖ పోరులో విన్నర్‌ ఎవరో? మెగా మద్దతు ఎవరికి ఉంటుందో? ముందు ముందు ఎటువంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో తెలియాలంటే వెయిట్‌ చేయక తప్పదు.

AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.