మంచి కథకు ఎల్లలు లేవు. ఆదరించే ప్రేక్షకులకు భాషా భేదాలు అడ్డురావు. ఒక్క భాషలో మంచి హిట్ పడితే చాలు పలు భాషల్లో రీమేక్ చేసేందుకు నిర్మాతలు ముందుకొస్తున్నారు. దక్షిణాది, ఉత్తరాది తేడాలు లేకుండా చాలా చిత్రాలు పలు భాషల్లోకి రీమేక్ అయి విజయాన్ని అందుకుంటున్నాయి. తాజాగా పలు భాషల్లో రీమేక్ అవుతున్న కొన్ని చిత్రాలు ఇవే.
బాలీవుడ్లో సంచలన విజయం అందుకున్న చిత్రం ‘అంధాధున్’. ఆయుష్మాన్ ఖురానా, టబు, రాధికా ఆప్టే ప్రఽధాన పాత్రల్లో నటించారు. ఆయుష్మాన్‌కు ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారాన్ని అందించింది. ఇప్పుడు ఈ చిత్రం తెలుగు తో పాటు తమిళ, మలయాళ భాషల్లో రీమేక్ అవుతోంది. ఈ చిత్రాన్ని తెలుగులో ‘మాస్ట్రో’ పేరుతో నితిన్ కథానాయకుడుగా రీమేక్ చేస్తున్నారు. తమన్నా, నభానటేష్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు.
మలయాళంలో పృథ్వీరాజ్ హీరోగా నటిస్తున్నాడు. రాశీఖన్నా కథానాయిక. తమిళంలో ప్రశాంత్ హీరోగా రూపొందుతోంది. ప్రియా ఆనంద్ కథానాయిక. సిమ్రాన్ కీలకపాత్ర పోషిస్తున్నారు.
దృశ్యం 2
ఇటీవల ఓటీటీలో విడుదలై భాషలకతీతంగా ప్రేక్షకులను ఆకట్టుకున్న చిత్రం ‘దృశ్యం 2’. తొలిభాగం ‘దృశ్యం’కు కొనసాగింపుగా వచ్చిన ఈ చిత్రం కూడా అదేస్థాయి విజయాన్ని సాధించింది. ఇప్పుడు ఈ చిత్రం వెంకటేష్,మీనా ప్రధాన పాత్రల్లో తెలుగులో తెరకెక్కుతోంది. తాజాగా ‘దృశ్యం 2’ను హిందీలో కూడా రీమేక్ చేయనున్నట్టు నిర్మాణసంస్థ పనోరమా స్టూడియో ఇంటర్నేషనల్ సంస్థ ప్రకటించింది. ‘దృశ్యం’ హిందీ రీమేక్‌లో నటించిన అజయ్ దేవగణ్, శ్రియా, టబు ఈ రీమేక్‌లోనూ నటించే అవకాశం ఉంది.
క్వీన్
కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన బాలీవుడ్ చిత్రం ‘క్వీన్’. అక్కడ్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ చిత్రం తెలుగులో ‘దటీజ్ మహాలక్ష్మి’ పేరుతో రీమేక్ అవుతోంది. తమన్నా టైటిల్ రోల్ పోషిస్తున్నారు. అలాగే తమిళంలో కాజల్ లీడ్రోల్లో ‘ప్యారీస్ ప్యారీస్’గా తెరకెక్కింది. విడుదల వాయిదా పడింది. అలాగే కన్నడలో ‘బట్టర్ఫ్లై’గా రీమేక్ అయింది. మలయాళంలో మంజిమా మోహన్ ప్రధాన పాత్రలో ‘జామ్ జామ్’ పేరుతో రీమేక్ చేస్తున్నారు.
ఆర్టికల్ 15
ఆయుష్మాన్ ఖురానా కథానాయకుడుగా తెరకెక్కిన బాలీవుడ్ చిత్రం ‘ఆర్టికల్ 15’. పరువు హత్యల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. తెలుగులో ఓ ప్రముఖ యువ హీరోతో ఈ చిత్రం తెరకెక్కనున్నట్లు వార్తలు వచ్చినా కార్యరూపం దాల్చలేదు. తమిళంలో ఉదయనిధి స్టాలిన్ హీరోగా బోనీకపూర్ రీమేక్ చేస్తున్నారు. ఇప్పటికే కొంత చిత్రీకరణ పూర్తయింది. అనురాజా కామరాజ్ దర్శకుడు. తాన్యా రవిచంద్రన్ కథానాయికగా నటిస్తున్నారు. శివానీ రాజశేఖర్ కీలకపాత్ర పోషిస్తున్నారు.
అయ్యప్పనుమ్ కోశియుయ్
పృథ్వీరాజ్ సుకుమారన్, బిజూ మీనన్ ప్రధాన పాత్రలు పోషించిన ‘అయ్యప్పనుమ్ కోశియుయ్’ చిత్రం అక్కడ భారీ విజయం సాధించింది. ఇప్పుడు పవన్ కల్యాణ్, రానా కథానాయకులుగా తెలుగులో ఈ చిత్రం రీమేక్ అవుతోంది. దాదాపు 70 శాతం చిత్రీకరణ పూర్తయింది. అభిషేక్ బచ్చన్, జాన్ అబ్రహం ప్రధాన పాత్రల్లో ఈ చిత్రం బాలీవుడ్లో కూడా రీమేక్ అవనుంది. జాన్ అబ్రహం హిందీ హక్కులను సొంతం చేసుకున్నారు. కరోనా నేపథ్యంలో తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొన్నాక ఈ చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళతామని జాన్ అబ్రహం చెప్పారు.
కోమలి
గతేడాది జయం రవి, కాజల్ జంటగా నటించిన చిత్రం ‘కోమలి’ తమిళ చిత్రం ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం అన్ని భాషల రీమేక్ హక్కులను బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్ సొంతం చేసుకున్నారు. బాలీవుడ్లో ఆయన తనయుడు అర్జున్ కపూర్‌తో రీమేక్ చేయనున్నారు. అలాగే తెలుగులోనూ రీమేక్ చేయనున్నట్టు వార్తలు వచ్చాయి.
వీటితో పాటు తెలుగు చిత్రం ‘ఏజంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’, కన్నడ మిస్టరీ థ్రిల్లర్ ‘యూటర్న్’, మలయాళ చిత్రం ‘కప్పేలా’, ‘హెలెన్’, కన్నడ చిత్రం ‘ముఫ్తీ’, హిందీ చిత్రం ‘బదాయి హో’ కూడా పలు భాషల్లో రీమేక్ అవుతున్నాయి.