కోటిలో ఒక్కరికే ఈ గుర్తింపు

ABN , First Publish Date - 2022-09-04T08:30:05+05:30 IST

సెలబ్రెటీ అయిపోవాలంటే సినిమాలే చేయక్కర్లేదు. టిక్‌ టాక్‌, స్నాక్‌, రీల్స్‌... ఇవన్నీ సామాన్యుల్ని సైతం పాపులర్‌గా మార్చేశాయి.

కోటిలో ఒక్కరికే ఈ గుర్తింపు

సెలబ్రెటీ అయిపోవాలంటే సినిమాలే చేయక్కర్లేదు. టిక్‌ టాక్‌, స్నాక్‌, రీల్స్‌... ఇవన్నీ సామాన్యుల్ని సైతం పాపులర్‌గా మార్చేశాయి. సంచితా బసు కూడా అలాంటి అమ్మాయే. ‘ఫస్ట్‌ డే- ఫస్ట్‌ షో’తో కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది సంచింత. అయితే అంతకు ముందే తను సోషల్‌  మీడియా స్టార్‌. మిలియన్ల కొద్దీ ఫాలోవర్స్‌. దానివల్లే సినిమాల్లోనూ అడుగు పెట్టిన ఈ బిహారీ అమ్మాయి... వెండి తెర మీదా  అభిమానుల్ని సంపాదించుకోవడమే తన లక్ష్యం అంటోంది... 


మాది బిహార్‌లోని భగల్‌పూర్‌. నా విద్యాభ్యాసం అక్కడే జరిగింది. ప్రస్తుతం పన్నెండో తరగతి చదువుతున్నా. చిన్నప్పటి నుంచీ అందరి చూపూ నాపైనే ఉండాలి అనుకొనేదాన్ని. నలుగురు కలిస్తే.. పాటలు పాడడమో, డ్యాన్సు చేయడమో చేసేదాన్ని. సోషల్‌ మీడియా ఉధృతం అవుతున్న రోజుల్లో నేను టిక్‌ టాక్‌లో అడుగుపెట్టాను. అందులో వీడియోలు పోస్ట్‌ చేసేదాన్ని. 2019 ఫిబ్రవరిలో నా తొలి వీడియో అప్‌లోడ్‌ చేశా. రెండు నెలల వరకూ స్పందనే లేదు. అయితే ప్రయత్నం ఆపలేదు. వరుసగా ఏవో కొన్ని వీడియోలు పెడుతూనే ఉండేదాన్ని. మరో రెండు నెలలు గడిచేసరికి మిలియన్‌ ఫాలోవర్స్‌ వచ్చేశారు. అప్పటి నుంచీ నేను సోషల్‌ మీడియాలో సెలబ్రెటీ అయిపోయాను.


టిక్‌టాక్‌ని భారత ప్రభుత్వం నిషేధించినప్పుడు చాలా బాధ పడ్డాను. అప్పటికి దాదాపు మూడు మిలియన్ల ఫాలోవర్స్‌ ఉన్నారు. వాళ్లకు దూరం అయిపోతానని బెంగొచ్చింది. వెంటనే స్నాక్‌ యాప్‌లో ప్రవేశించా. అక్కడ తొమ్మిది మిలియన్ల మంది అభిమానులు పోగయ్యారు. ప్రతిభ ఉంటే... దాన్ని ప్రదర్శిచుకోవడానికి ఏదో ఒక వేదిక దొరుకుతుందనే విషయం నాకు అప్పుడే అర్థమైంది. మా ఊర్లో నన్ను ఓ స్టార్‌లా చూసేవారు. షాపింగ్‌ మాల్స్‌కీ, వేడుకలకూ నన్ను అతిథిగా ఆహ్వానించేవారు. స్కూల్లో కూడా నేను స్పెషల్‌. అయితే చదువుని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు. స్కూల్లో నేనే టాపర్‌. పదో తరగతిలో 90 శాతం మార్కులొచ్చాయి.

మా అమ్మా నాన్న ఇచ్చిన ప్రోత్సాహం మర్చిపోలేను. ఇంట్లో అమ్మాయిలు ఉంటే, సోషల్‌ మీడియా ధ్యాసలో పడిపోతే.. ఎవరైనా కోప్పడతారు. కానీ మావాళ్లు నన్ను ప్రోత్సహించారు. నా పాటల్ని అమ్మే సెలెక్ట్‌ చేసి పెట్టేది. నా డ్రెస్సింగ్‌ స్టైల్‌ బాగుంటుందని అంతా అంటుంటారు. దానికి కారణం కూడా మా అమ్మే. సోషల్‌ మీడియాలో ఉన్నప్పుడు రకరకాల కామెంట్లు వినిపిస్తుంటాయి. పొగిడేవాళ్లు, మెచ్చుకొనేవాళ్లు ఎంతమంది ఉంటారో, నెగిటివ్‌ కామెంట్లు పాస్‌ చేసేవాళ్లూ అంతేమంది ఉంటారు. కొన్నిసార్లు కొన్ని కామెంట్లు హర్ట్‌ చేసేవి. ఇంట్లోవాళ్లనీ బాధ పెట్టేవి. కానీ మన దృష్టి ఎప్పుడూ మంచి విషయాలపైనే ఉండాలని మెల్లమెల్లగా అర్థం చేసుకొన్నాను. నెగిటివ్‌ కామెంట్లు కూడా నాలో ఆత్మస్థైర్యాన్ని, థైర్యాన్ని నింపాయి. ఇప్పుడు అలాంటి కామెంట్లని అస్సలు పట్టించుకోను. 


నా బలం మా అమ్మే. తను నా కోసం చాలా చేసింది. ‘ఫస్ట్‌ డే- ఫస్ట్‌ షో’లో అవకాశం వచ్చిన దగ్గర్నుంచి, ఆ సినిమా రిలీజ్‌ అయ్యేంత వరకూ అన్ని పనులూ మానేసి, నాతోనే ఉంది. సినిమా అనేది చాలా గొప్ప అవకాశం. కోటిమందిలో ఒక్కరికే ఈ ఛాన్స్‌ వస్తుంది. అలాంటప్పుడు దాన్ని నిలబెట్టుకోవడానికి చాలా శ్రమించాలి. నేను అదే చేశా. టిక్‌ టాక్‌లో వీడియోలు చేయడానికీ, రీల్స్‌లో డ్యాన్స్‌ చేయడానికీ, సినిమాల్లో నటించడానికి చాలా తేడా ఉంటుంది. సోషల్‌ మీడియాలో పెద్దగా ఒత్తిడి  ఉండదు. ఎవరికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదు. హిట్లూ, ఫ్లాపులతో సంబంధం ఉండదు. కానీ సినిమా అలా కాదు. వేలమంది జీవితాలపై ప్రభావం చూపిస్తుంది. అందుకే కథల ఎంపికలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి అనే విషయం నాకు అర్థమైంది. ‘ఫస్ట్‌ డే- ఫస్ట్‌ షో’ విడుదలైన రోజున తొలి ఆటని థియేటర్‌లో నా టీమ్‌ మధ్య కూర్చుని చూశాను. తెలుగు ప్రేక్షకులు సినిమాని ఎంత ప్రేమిస్తారో అర్థమైంది. 


అమ్మాయిలకు అవకాశాలు ఇవ్వండి అని అంతా చెబుతుంటారు. అవకాశాలు ఇవ్వాల్సిన పనిలేదు.. వాళ్లకు నచ్చిన పనిని, ఇష్టమైన పనిని చేసుకోనివ్వండి చాలు. నేను సోషల్‌ మీడియాలో వీడియోలు పోస్ట్‌ చేసినప్పుడు కొంతమంది అసభ్యంగా మాట్లాడుకున్నారు. వాళ్లు అక్కడే ఆగిపోయారు. నేను అదే సోషల్‌ మీడియా ద్వారా సినిమాల్లోకి ప్రవేశించాను. ఒకరిపై రాళ్లు వేయాలని చూసేవాళ్లు, వెనక్కి లాగాలని ప్రయత్నించేవారు జీవితంలో ఎదగలేరు. వాళ్ల గురించి పట్టించుకోవాల్సిన పనిలేదు. నచ్చిన రంగంలో ప్రవేశించండి. జయాపజయాల గురించి అస్సలు ఆలోచించొద్దు. నా తోటి అమ్మాయిలకు నేనిచ్చే సలహా ఇదే. 

Updated Date - 2022-09-04T08:30:05+05:30 IST