వెంకీ ‘సుందరకాండ’ నిర్మాణం వెనుక అంత కథ ఉంది
ABN , First Publish Date - 2021-09-23T02:24:45+05:30 IST
తమిళంలో భాగ్యరాజా నటించిన ‘సుందరకాండ’ చిత్రం హిట్ కావడంతో డబ్బింగ్ హక్కులు కొని, డబ్బింగ్ చేశారు నిర్మాత కె.వి.వి. సత్యనారాయణ. రామానాయుడు స్టూడియోలో ఈ చిత్రం అనువాద కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు అనుకోకుండా

తమిళంలో భాగ్యరాజా నటించిన ‘సుందరకాండ’ చిత్రం హిట్ కావడంతో డబ్బింగ్ హక్కులు కొని, డబ్బింగ్ చేశారు నిర్మాత కె.వి.వి. సత్యనారాయణ. రామానాయుడు స్టూడియోలో ఈ చిత్రం అనువాద కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు అనుకోకుండా హీరో వెంకటేశ్ ఆ సినిమా చూడడం జరిగింది. అప్పటికే ‘బొబ్బిలిరాజా’, ‘చంటి’ వంటి పెద్ద హిట్స్‌తో టాప్ రేంజ్‌లో ఉన్నారాయన. ‘సుందరకాండ’ చిత్రం ఆయనకు నచ్చడంతో తెలుగులో చేయడానికి రెడీ అయ్యారు. అయితే అప్పటికే డబ్బింగ్ పూర్తి చేసి అన్ని ఏరియాల బిజినెస్ క్లోజ్ చేశారు నిర్మాత సత్యనారాయణ. అయినా వెంకటేశ్ చేస్తాననడంతో బయ్యర్లందరినీ కన్విన్స్ చేసి, వాళ్లు ఇచ్చిన దానికి రెట్టింపు డబ్బు ఇచ్చి, డబ్బింగ్ వెర్షన్ డ్రాప్ చేసుకున్నారు. అయితే మరో చిక్కు ఎదురైంది.
భాగ్యరాజా దగ్గర డబ్బింగ్ రైట్స్ మాత్రమే తీసుకోవడంతో అగ్రిమెంట్‌లో ఎక్కడా రీమేక్ అన్న పదం వాడలేదు. దాంతో భాగ్యరాజా 50 లక్షలు ఇస్తే కానీ రీమేక్ రైట్స్ ఇవ్వనన్నారు. చివరికి రూ. 25 లక్షలు చెల్లించి రీమేక్ రైట్స్ తీసుకున్నారు. డబ్బింగ్ వెర్షన్‌కు పది లక్షలు, బయ్యర్లకు పది లక్షలు, రీమేక్ రైట్స్‌కు పాతిక లక్షలు.. ఇలా సినిమా మొదలు పెట్టడానికి ముందే రూ. 45 లక్షలు ఖర్చు చేశారు సత్యనారాయణ. అయినా ‘సుందరకాండ’ తెలుగు వెర్షన్ కూడా హిట్ కావడంతో ఆయనకు ఆర్ధికంగా ఇబ్బంది అనిపించలేదు. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపుదిద్దుకొన్న ‘సుందరకాండ’లో మీనా, కొత్త నటి అపర్ణ కథానాయికలుగా నటించారు.
-వినాయకరావు
