‘‘ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వేదికగా సహాయం కోరినవాళ్లకు మెడిసిన్స్, ఆక్సిజన్ బెడ్స్ ఏర్పాటు చేయడం, ఆర్థిక సమస్యల్లో ఉన్నవాళ్ల బిల్స్ కట్టడం వంటివి చేయడం ప్రారంభించిన తర్వాత వెయ్యికి పైగా రిక్వెస్టులు వచ్చిన రోజులు ఉన్నాయి. అందులో అత్యవసరమైన కేసులకు సాయం అందించడానికి నేనే స్వయంగా వెళ్లాను’’ అని నిఖిల్ అన్నారు. లాక్డౌన్లో కరోనా బాధితులకు చేస్తున్న వైద్య సహాయం, సెట్స్‌పై ఉన్న-కొత్తగా అంగీకరించిన సినిమాలు, వ్యక్తిగత విషయాల గురించి ‘చిత్రజ్యోతి’తో నిఖిల్ ప్రత్యేకంగా సంభాషించారు. ఆ సంగతులివీ...
‘‘కరోనా, బ్లాక్ ఫంగస్ వల్ల మా అంకుల్ ఒకరు మరణించారు. ఆరోగ్య పరిస్థితి విషమించిన సమయంలో మావాళ్లు, కుటుంబ సభ్యుల వేదన ప్రత్యక్షంగా చూశా. అదేంటి? ‘ఆస్పత్రులు, వైద్య సౌకర్యాలన్నీ ఉన్నాయి కదా! అంటే... ‘లేవు’, ‘మెడిసిన్స్ అందుతున్నాయి కదా!’ అంటే... ‘లేదు’ అనే మాటలు వినిపించాయి. అప్సెట్ అయ్యాను. ఈ పరిస్థితిలో డబ్బుల వల్ల కాదు... మనమంతా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ వెళితే ఒకొక్కరి సమస్యకు పరిష్కారం లభిస్తుందని నాకు చేతనైనంత సహాయం చేయడం ప్రారంభించా.
‘ఓ బెడ్ దొరకాలన్నా... ఓ ఇంజక్షన్ తెప్పించాలన్నా... నాకు నాలుగైదు గంటలు పడుతుంది’ అని సోనూ సూద్ సైతం చెప్పారు. నేను, నా వాలంటీర్లు కలిసి వీలైనంత కష్టపడ్డాం. నేను చేసిన సేవ చూసి అమెరికా, ఆస్ట్రేలియా నుంచి కొందరు డబ్బులు పంపిస్తామని ముందుకు వచ్చారు. కానీ, ఎవరి నుంచీ ఒక్క రూపాయి తీసుకోలేదు. అయితే, ఇబ్బందుల్లో ఉన్నవాళ్ల వివరాల్ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తా. వాళ్లకు నేరుగా సాయం అందించమని చెప్పా. ఆ విధంగా రోజూ వచ్చే వెయ్యిలో నాలుగైదు వందల సమస్యలు పరిష్కారమయ్యాయి. ఇక, నేను-నా వాలంటీర్లు కలిసి ప్రత్యక్షంగా, పరోక్షంగా వెయ్యిమందికి పైగా సాయం చేశాం. వ్యక్తిగతంగా 350మందికి పైగా నేను సాయం చేశా.
అత్యవసర కేసుల విషయంలో ప్రభుత్వం, ఫార్మా కంపెనీలతో నేను వ్యక్తిగతంగా మాట్లాడా. ముంబై, దుబాయ్ నుంచి మెడిసిన్స్ తెప్పించా. ఆక్సిజన్ సిలండర్లు కొన్నాను. ఈ విషయంలో మా భార్య పల్లవి, మా బావగారు నాకు హెల్ప్ చేశారు. నాతో పల్లవి రావడంతో పాటు తను డాక్టర్ కాబట్టి కొందరికి ప్రిస్ర్కిప్షన్ రాసిచ్చింది. మెడిసిన్స్ ప్రాముఖ్యం గురించి చెప్పేది. వాళ్ల లక్షణాలు తెలుసుకుని ఏం కావాలో ఏం పంపించాలో చెప్పేది. నా బెస్ట్ వాలంటీర్లలో నా వైఫ్ ఒకరు.
పరిస్థితి ఆందోళనకరంగా మారాక... పలువురు మన దగ్గరకొచ్చారు. అందులో ఆక్సిజన్సిలండర్లు, బెడ్స్ కావాలనే రిక్వెస్టులు ఎఝ్కువ. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి సిటీ, టౌన్లో ఇద్దరు ముగ్గురు డాక్టర్లు నా స్నేహితులే. వాళ్లందరికీ ఫోనులు చేసి, నా కోసం ఎకా్ట్స్ర బెడ్స్ వేయించమని అడిగా. విజయవాడలో ఓ మహిళకు బాలేదంటే... ఆక్సిజన్ సిలండర్ పంపిచాం. ఆమె భర్త ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్పాడు. మరుసటి రోజు ఉదయం ఫోన్ చేసి మరణించిందన్నారు. చాలా బాధేసింది. అది మాకు షాక్. అటువంటి ఘటనలు కొన్ని జరిగాయి. కరోనా బారిన పడితే ఆస్తులు, ప్రాణాలు... రెండూ పోతాయి. అందుకని అందరూ జాగ్రత్తగా ఉండండి. వ్యాక్సిన్ వేయించుకోండి. బ్లాక్ మార్కెట్ వల్లే మెడిసిన్స్ కొరత ఏర్పడుతోంది. శవాలపై కాసులకు కక్కుర్తి పడే రకం. అటువంటి వాళ్లకు శిక్ష పడాల్సిందే. బ్లాక్ మార్కెట్లో మెడిసిన్స్ అమ్మే వాళ్ల గురించి ప్రజలకు తెలిస్తే... ఫిర్యాదులు చేయండి, పట్టించండి.
ఏప్రిల్ 25 నుంచి చిత్రీకరణలు నిలిచిపోయాయి. అప్పట్నుంచీ పనుల్లో పడి నేను హీరో అనే సంగతి మర్చిపోయా. మా నిర్మాతలు ఫోన్ చేసి ‘18 పేజెస్’ లుక్ మంగళవారం విడుదల చేస్తున్నామంటే... సినీ లోకంలోకి వచ్చా. ఇదొక డిఫరెంట్ ఫిల్మ్. సుకుమార్‌గారు రాసిన ఈ ప్రేమకథ చాలా వైవిధ్యంగా ఉంటుంది. లుక్ చూస్తే ప్రేక్షకులకు తెలుస్తుంది. దాదాపు 70-80 శాతం చిత్రీకరణ పూర్తయ్యింది. మరో వారం చేస్తే... సినిమా మొత్తం పూర్తవుతుంది. ఈలోపు సెకండ్ వేవ్, లాక్డౌన్ వచ్చాయి. వాస్తవానికి, జూలైలో విడుదల కావాల్సిన సినిమా. చందూ మొండేటి దర్శకత్వంలో చేస్తున్న ‘కార్తికేయ2’ చిత్రీకరణ 50శాతం పూర్తయ్యింది. అవుట్‌డోర్‌లో తీయాల్సిన సీన్లు పూర్తి చేశాం. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మిగతా సగం చిత్రీకరణ చేయాలి. భారీ సెట్లు వేస్తున్నారు. దీపావళికి విడుదల అనుకున్నాం. ఇప్పుడు విడుదల తేదీలు మారొచ్చు.
ప్రస్తుతం సెట్స్ మీద ఉన్నవి రెండూ పూర్తయితే... సుధీర్ వర్మ దర్శకత్వంలో బీవీఎ్‌సఎన్ ప్రసాద్‌గారి నిర్మాణంలో ఒకటి, ఏషియన్ సినిమాస్ సంస్థలో మరొకటి, ఇంకొక స్పై థ్రిల్లర్ అంగీకరించా.