‘ది రాంగ్ స్వైప్’ డాక్టర్ చేస్తున్న తదుపరి చిత్రమిదే

చక్కెర వ్యాధికి చికిత్స చేయడంలో సిద్ధహస్తుడైన డాక్టర్ రవికిరణ్.. దర్శకుడిగా మారి చేసిన చిత్రం ‘ది రాంగ్ స్వైప్’. ఈ చిత్రం మంచి విజయం సాధించడంతో తన తదుపరి చిత్రంపై ఆయన దృష్టి పెట్టారు. డాక్టర్స్ ఫ్యామిలీ నుండి రావడమే కాకుండా.. తను కూడా డాక్టరే అయినా.. ఇంకా ఏదో సాధించాలి అనే తపనతో సినీ రంగప్రవేశం చేసిన ఈ డాక్టర్ టర్నడ్ డైరెక్టర్ రవికిరణ్.. మరో ఇద్దరు డాక్టర్స్‌ని కూడా ఈ సినీరంగం వైపు పయనించేలా చేశారు. ‘ది రాంగ్ స్వైప్’ నిర్మాతగా వ్యవహరించిన ప్రతిమారెడ్డి, హీరోగా చేసిన ఉదయ్ రెడ్డి కూడా డాక్టర్లే కావడం విశేషం. తన తోటి డాక్టర్ ఫ్రెండ్స్ ప్రోత్సాహంతో.. మొబైల్ ఫోన్ (ఒన్ ప్లస్ 6టి) కెమెరాతో.. చాలా పరిమిత బడ్జెట్‌లో.. వీకెండ్స్‌లో మాత్రమే షూట్ చేసి ‘ది రాంగ్ స్వైప్’ చిత్రాన్ని డాక్టర్ రవికిరణ్ ప్రతిభను టాలీవుడ్ ప్రముఖులు సైతం కొనియాడుతున్నారు. అయితే ఈ సినిమాకొచ్చిన స్పందన, ఆదరణ తనకు మరింత బాధ్యతను పెంచిందని.. మరో వినూత్నమైన సబ్జెక్టుతో ప్రేక్షకులను మెప్పించేలా సన్నాహాలు చేసుకుంటున్నట్లుగా తెలిపారు డాక్టర్ రవికిరణ్.


ఆయన మాట్లాడుతూ.. ‘‘ ది రాంగ్ స్వైప్ చిత్రం ద్వారా ముగ్గురు డాక్టర్లం ఇండస్ట్రీకి పరిచయమయ్యాం. మా తొలి ప్రయత్నాన్ని ఆదరించి, చిత్రాన్ని సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ముఖ్యంగా పలువురు చిత్ర ప్రముఖులు మా చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించడం చూస్తుంటే ఈ రంగంలో మేము రాణించగలమనే నమ్మకమే కాకుండా ఎంతో సంతోషంగా ఉంది. దర్శకులు కోదండరామిరెడ్డి, దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, సోనీ లివ్ హెడ్ మధుర శ్రీధర్ రెడ్డి, ఊర్వశి సారథులు రవి కనగాల- తుమ్మలపల్లి రామసత్యనారాయణ వంటి వారు ఇటీవలకాలంలో తాము చూసిన చాలా మంచి చిత్రాల్లో ఒకటని  కొనియాడడం.... స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక్క క్షణం కూడా బోర్ కొట్టకపోవడం "ది రాంగ్ స్వైప్" ప్రత్యేకత అని వారు పేర్కొనడం మా టీమ్‌కి ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది. అలాగే నాపై బాధ్యత పెరిగినట్లుగా కూడా భావిస్తున్నాను. అందుకే మరో వినూత్నమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాను. నా తదుపరి చిత్రానికి కథ సిద్ధమైంది. ‘6 ఎమ్.పి’ అనే టైటిల్‌‌ను అనుకుంటున్నాం. త్వరలోనే పూర్తి వివరాలను తెలియజేస్తాము..’’ అని తెలిపారు.

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.