‘ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ’తో దర్శకుడిగా నిరూపించుకున్నారు స్వరూప్ ఆర్.ఎస్.జె. చిన్న సినిమాగా విడుదలై.. పెద్ద విజయం సాధించింది. అప్పుడే అందరి దృష్టి స్వరూప్‌పై పడింది. ఇప్పుడు ‘మిషన్ ఇంపాజిబుల్’ చిత్రాన్ని రూపొందించారు. తాప్సి ప్రధాన పాత్ర పోషించిన చిత్రమిది. ఏప్రిల్ 1న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా స్వరూప్ ఈ సినిమా గురించి చెప్పిన విశేషాలు ఇవీ...
2014లో పాట్నాలో జరిగిన ఓ యథార్థ సంఘటన ఇది. దావూద్ ఇబ్రహీంని పట్టుకొంటే నగదు బహుమతి ఇస్తామనే ప్రకటన చూసిన ముగ్గురు పిల్లలు ముంబై వెళ్లిపోయారట. ఆ వార్త నన్ను బాగా ఆకర్షించింది. ఆ నేపథ్యంలో కథ రాసుకొన్నా. అంతకంటే ముందే ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ కథ రెడీ అవ్వడంతో ఆ సినిమా ముందు మొదలెట్టా. నా స్నేహితులు కూడా ‘ముందు మంచి కామెడీ సినిమా తీయ్..’ అన్నారు. అందుకే ‘ఆత్రేయ..’ వచ్చింది. రెండో సినిమాగా ‘మిషన్ ఇంపాజిబుల్’ కరెక్ట్ అనుకొన్నా.
ఈ కథ ముందు ఓ హీరోతో చేద్దామనుకొన్నాను. ఆ తరవాత తాప్సి అయితే బాగుంటుందనిపించింది. ఆమెకు వినిపిస్తే.. వెంటనే ‘ఓకే’ చెప్పేశారు. ‘పింక్’, ‘థప్పడ్’లో తను చాలా శక్తిమంతమైన పాత్రలు పోషించారు. కథ నచ్చితే.. చిన్న సినిమా, పెద్ద సినిమా అనేది ఆలోచించరు. చాలా ప్రొఫెషనల్ యాక్టర్. ముందు రోజే సీన్ పేపర్లు తీసుకొని, ప్రాక్టీస్ చేసి సెట్‌కి వచ్చేవారు. అందరికంటే ముందు.. సెట్లో ఉండేవారు. ఆ అంకితభావం నాకు బాగా నచ్చింది
దీన్ని పూర్తిస్థాయి థ్రిల్లర్‌గా తీద్దామనుకొన్నా. కానీ ముగ్గురు పిల్లలు..భాను, రోషన్, జై తీర్థ కలిసేసరికి.. కాస్త కామెడీ మిక్స్ అయ్యింది. ఈ పిల్లల్ని ఎంపిక చేసుకోవడానికి నెల రోజులు పట్టింది. దాదాపు రెండు నెలల పాటు వర్క్ షాప్ చేశాం. దాంతో వాళ్ల మధ్య కెమిస్ర్టీ బాగా కుదిరింది. అది ఈ సినిమాకి చాలా ప్లస్ అయ్యింది. ‘ఏజెంట్..’ చాలా పరిమిత బడ్జెట్లో తీశాం. ఈసారి మాకు మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ దొరికింది. ఎక్కడ ఖర్చు పెట్టాలో అక్కడ పెట్టాం. నాణ్యమైన సినిమానే తీశాం.
ఈ సినిమాని ప్రస్తుతానికి తెలుగులో మాత్రమే విడుదల చేస్తున్నాం. మిగిలిన భాషల్లో రీమేక్ చేస్తే బాగుంటుంది. డబ్బింగ్ చేస్తే ఎమోషన్ కనెక్ట్ అవ్వదు. ‘ఏజెంట్...’కు సీక్వెల్ చేయాలని ఉంది. కానీ పటిష్టమైన కథ దొరకాలి. హిందీలో ఈ సినిమాని రీమేక్ చేయొచ్చు. కానీ... అక్కడ నాకు దర్శకత్వం చేసే ఆలోచన లేదు. ప్రస్తుతానికి కొత్త సినిమాలేం ఒప్పుకోలేదు. ‘మిషన్..’ విడుదలైన తరవాత ఆలోచిస్తా.