‘తెర’ మరుగయ్యాయి..!
ABN , First Publish Date - 2021-11-14T16:50:13+05:30 IST
సినిమాను చూసినంత సులభం కాదు తీయడం. అదొక యజ్ఞం. సకలం సమకూర్చుకోవాలి.

సినిమాను చూసినంత సులభం కాదు తీయడం. అదొక యజ్ఞం. సకలం సమకూర్చుకోవాలి. వందల మంది కలిసికట్టుగా పనిచేయాలి. ఎక్కడ ఏ చిన్న అడ్డంకి తలెత్తినా అర్ధాంతరంగా ఆగిపోతుంది. ఇటు డబ్బులు పెట్టిన నిర్మాతకు, అటు కథను సిద్ధం చేసుకున్న దర్శకులకే కాదు... నటీనటులకు కూడా నష్టమే! అలా రకరకాల ఇబ్బందులతో ఫిల్మ్‌నగర్ రథచక్రాల కింద నలిగిపోయిన చిత్రాలు చాలానే ఉన్నాయి. అట్టహాసంగా మొదలై ఆగిపోయినవి కొన్నయితే... సగానికి మించి పూర్తి అయ్యాక నిలిచిపోయినవి మరికొన్ని. మొత్తం కాపీ సిద్ధమయ్యాక కూడా తెర మరుగైన చిత్రాలూ లేకపోలేదు. ఈ సినిమాలన్నీ ఎందుకు ఆగిపోయాయి? కారణాలు ఏమయ్యుంటాయి? మళ్లీ ఏదో ఒక రోజు విడుదల అవుతాయా?...
ఏ సినిమా అయినా ఆగిపోవడానికి బడ్జెట్ కారణం అవుతుంటుంది. ముహూర్తం షాట్‌కు ముందు ఓ బడ్జెట్ వేసుకుంటాడు ఏ నిర్మాతైనా. అయితే అంకెలకు, వాస్తవానికి తేడా ఉంటుంది కాబట్టి వేసుకున్న బడ్జెట్‌లో ఏ సినిమా పూర్తి కాదు. అందుకని ‘బఫర్ అమౌంట్’ అని కొంత మొత్తాన్ని అదనంగా కేటాయిస్తారు. ఆ పరిమితీ దాటిపోయినప్పుడే అసలు సమస్య మొదలవుతుంది. అగ్ర హీరోలు నటించిన చిత్రాలకు అనుకున్న దానికంటే బడ్జెట్ ఎక్కువైనా వ్యాపార పరంగా ఇబ్బందులు ఉండవు కనుక నిర్మాతలు తట్టుకోగలుగుతారు. కానీ అవసరానికి మించి ఖర్చు పెట్టేసి, ఆ స్థాయిలో కొనేవాళ్లు లేక సినిమాలు ఆగిపోతుంటాయి. అయితే బడ్జెట్ పరంగా కాకుండా ఇతర కారణాల వల్ల నిలిచిపోయిన చిత్రాలు చాలా ఉన్నాయి.
ఫలించని హాలీవుడ్ కల
అది 1999.. తెలుగు చిత్రసీమలో ఆసక్తికరమైన సంఘటన.. చిరంజీవికి హాలీవుడ్ చిత్రంలో నటించే అవకాశం రావడం. ‘ద రిటర్న్ ఆప్ ద థీఫ్ బాగ్దాద్’ పేరుతో ఆంగ్లంలోను, ‘అబు.. బాగ్దాద్ గజదొంగ’ పేరుతో తెలుగులోనూ పేరున్న సాంకేతిక నిపుణులతో తీయాలని ముందుకొచ్చారు.. అమెరికాలోని ప్రవాస భారతీయులైన రమేశ్ కృష్ణమూర్తి, మహదేవన్ గణేశ్, సురస్వామి. తలైవా రజనీకాంత్ ‘బ్లడ్ స్టోన్’ అనే ఆంగ్ల చిత్రంలో నటించినప్పటి నుంచీ చిరంజీవి కూడా అటువంటి అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. డా.అర్జున్ దళవాయి ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. హాలీవుడ్‌కు డచెన్ జెర్సీ, తెలుగు వెర్షన్‌కు సురేశ్‌కృష్ణ దర్శకులు. ఆంగ్ల చిత్రం నిడివి 90 నిమిషాలు, తెలుగు వెర్షన్ రెండున్నర గంటలు. చిరు తొలిసారి హాలీవుడ్‌కు వెళుతున్నారు కనుక ఖర్చు విషయంలో రాజీపడకుండా తీయాలంటే రూ.50 కోట్లు అవుతుందని అంచనా వేశారు. ఇది 22 ఏళ్ల నాటి ముచ్చట. ఇప్పటి లెక్కల్లో చెప్పాలంటే రూ.300 కోట్లు పై మాటే!.
సగం పూర్తయ్యాక కూడా...
నందమూరి బాలకృష్ణకు భార్గవ్ ఆర్ట్స్ సంస్థతో ఉన్న అనుబంధం చాలా ప్రత్యేకం. బాలకృష్ణ హీరోగా ఆ సంస్థ అధినేత ఎస్.గోపాలరెడ్డి నిర్మించిన చిత్రాలన్నీ విజయవంతమయ్యాయి. 2001లో బాలయ్య హీరోగా ఓ జానపద చిత్రాన్ని ప్రారంభించారు గోపాలరెడ్డి. ఆ చిత్రానికి కోడి రామకృష్ణ దర్శకుడు. బాలకృష్ణకు ఇది ద్విపాత్రాభినయ చిత్రం. విక్రమసింహ భూపతి, ప్రతాప్ పాత్రలను ఆయన పోషించారు. పూజా బాత్రా, అంజలా జవేరి, రోజా హీరోయిన్లు. హాలీవుడ్ చిత్రం ‘గ్లాడియేటర్’ స్ఫూర్తితో ఆ తరహా చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించాలని గోపాలరెడ్డి ప్లాన్ చేశారు. సగానికి పైగా చిత్రం పూర్తయింది. అంతా సవ్యంగా జరిగిపోతుందనుకుంటున్న తరుణంలో హఠాత్తుగా ఈ చిత్ర నిర్మాణానికి బ్రేక్ పడింది. మళ్లీ మొదలు కాలేదు.

ఆయనవే ఐదు సినిమాలు...
విక్టరీ వెంకటేశ్ కెరీర్‌లో ఆగిపోయిన చిత్రాలు ఐదు ఉన్నాయి. సీనియర్ దర్శకుడు కే బాపయ్య హిందీ చిత్ర పరిశ్రమలో బిజీ గా ఉన్న రోజుల్లో అయన దర్శకత్వంలో వెంకటేశ్ హీరోగా ‘బాలరాజు’ చిత్రాన్ని ప్రారంభించింది సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ. ఒక ఫైట్, కొన్ని సీన్లు తీసిన తర్వాత ఆ సినిమా ఆగిపోయింది. ఆ తర్వాత యాడ్ ఫిలిమ్స్ చేేస జయంత్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ మరో సినిమా మొదలెట్టారు సురేష్ బాబు. కొన్ని రోజులు షూటింగ్ జరిగిన తర్వాత ఆ సినిమా కూడా ఆగిపోయింది. కొత్త దర్శకుడు కెరీర్ దెబ్బ తినకూడదని, కొంత కాలం విరామం తీసుకుని, కథ రూపకల్పనకు వర్కవుట్ చేసి జయంత్ దర్శకత్వంలోనే ‘ప్రేమించుకుందాం రా’ చిత్రాన్ని నిర్మించారు సురేశ్‌బాబు. అలాగే ‘గురు’ చిత్రం విడుదలైన కొంత కాలానికి వెంకటేశ్, దర్శకుడు తేజ కాంబినేషన్‌లో ‘ఆట నాదే - వేట నాదే’ సినిమాను ప్రకటించారు నిర్మాతలు సురేష్ బాబు, అనిల్ సుంకర. వెంకటేశ్ ఇందులో ప్రొఫెసర్‌గా నటిస్తారని చెప్పి ఆ లుక్ కూడా విడుదల చేశారు. హీరోయిన్ పాత్ర కోసం నయనతారను సంప్రదించారు కానీ ఆమెకు తీరిక లేకపోవడంతో శ్రియను తీసుకున్నారు. నారా రోహిత్ ఇందులో మరో హీరోగా నటిస్తారని ప్రకటించారు కూడా. సరిగ్గా ఆ సమయంలోనే ఎన్టీఆర్ బయోపిక్ చేేస అవకాశం తేజకు వచ్చింది. వెంకటేశ్ సినిమా చేస్తూ ఎన్టీఆర్ బయోపిక్ స్ర్కిప్ట్‌వర్క్ చేసుకోవచ్చని తేజ అనుకొన్నారు. అలా కుదరదని బాలకృష్ణ స్పష్టం చేయడంతో ఏదో ఒక చిత్రాన్ని తేజఎన్నుకోవాల్సి వచ్చింది. ఆ సమయంలోనే నిర్మాత సురేష్ బాబుతో క్రియేటివ్ డిఫరెన్సెస్ రావడంతో ‘ఆట నాదే.. వేట నాదే’ చిత్రాన్ని వదిలేసి బాలకృష్ణ క్యాంపులో చేరిపోయారు తేజ. ఎన్టీఆర్ బయోపిక్ ఓపెనింగ్ వరకే తేజ ఉన్నారు. ఆ తర్వాత స్ర్కిప్ట్ విషయంలో బాలకృష్ణతో అభిప్రాయ భేదాలు రావడంతో తేజ సినిమాను వదులుకోక తప్పలేదు. ఇక వెంకటేశ్, దర్శకుడు మారుతిల ‘రాధా’ చిత్రానిది మరో కథ. చిత్ర ప్రారంభోత్సవం కూడా జరిగింది. వెంకటేశ్ లుక్ స్టిల్స్‌నూ వదిలారు. చిత్ర కథ విషయంలో కాపీరైట్ సమస్యలు తలెత్తడం, అది వివాదాస్పదం కావడంతో ‘రాఽధ’ ఆగిపోయింది. ఆ తర్వాత వెంకటేష్, మారుతి కలయికలో ‘బాబు బంగారం’ వచ్చింది. ‘నేను.. శైలజ’తో హీరోల దృష్టిని ఆకట్టుకొన్న దర్శకుడు కిశోర్ తిరుమలను పిలిచి అవకాశం ఇచ్చారు వెంకటేశ్. రెండో సినిమానే పెద్ద హీరోతో అనగానే కిశోర్ చాలా ఆనందపడ్డాడు. ఆ చిత్రం పేరు ‘ఆడోళ్లు మీకు జోహార్లు’. పి. రామ్మోహనరావు నిర్మాత. మరో సినిమా గురించి ఆలోచించకుండా స్ర్కిప్ట్ మీద పని చేశారు కిశోర్. చివరకు సెట్ మీదకు రాకుండానే ఆగిపోయింది. ఇప్పుడు ఇదే టైటిల్‌తో శర్వానంద్ హీరోగా సినిమా చేస్తున్నారు కిశోర్.
ఎందుకో స్ర్కిప్ట్ నచ్చలేదు...
పవన్ కళ్యాణ్, తమిళ దర్శకుడుసూర్య కాంబినేషన్‌లో ‘ఖుషి’ చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే!. అయితే ఆ సినిమా కంటే ముందే వీరిద్దరి కలయికలో ‘చెప్పాలని ఉంది’ పేరుతో ఓ సినిమా మొదలై ఆగిపోయింది. ఎ.ఎం.రత్నం ఆ చిత్ర నిర్మాత. నూతన సహస్రాబ్దికి స్వాగతం పలుకుతూ డిసెంబర్ చివరి రోజున హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్ ప్రారంభమైంది. అప్పటికే మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన ‘చూడాలని ఉంది’ హిట్ అయింది. అందుకే దీనికి ‘చెప్పాలని ఉంది’ అన్న పేరును ఖరారు చేసుంటారని అనుకున్నారంతా. అమీషా పటేల్ ఈ చిత్ర కథానాయిక. ప్రారంభోత్సవానికి వెంకటేశ్ ముఖ్య అతిథిగా వచ్చారు. కొన్ని రోజులు షూటింగ్ చేశాక ‘చెప్పాలని ఉంది’ ఆగిపోయింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్, సూర్య కాంబినేషన్‌లో ‘ఖుషి’ చిత్రాన్ని నిర్మించారు ఎ.ఎం.రత్నం. ‘జానీ’ తరువాత ప్రారంభమైన మరో చిత్రం ‘సత్యాగ్రహి’. ఈ స్టోరీ లైన్ నచ్చిన దిల్ రాజు సినిమా తీయాలని ముచ్చట పడ్డారు. కొన్ని రోజులు కథా చర్చల్లో పాల్గొన్నారు కూడా. ఆ తర్వాత అయన తప్పుకోవడంతో నిర్మాతగా ఎ.ఎం. రత్నం లైన్‌లోకి వచ్చారు. ఓ విద్యార్థి నాయకుడిగా సమాజంలో జరిగే అన్యాయాల్ని ప్రశ్నించే పాత్ర పవన్ కళ్యాణ్‌ది. అయితే ఈ స్ర్కిప్ట్ నచ్చకపోవడంతో ఆయన సినిమా చేయలేదు. జీసస్ జీవితకథపై ఇప్పటి వరకు చాలా చిత్రాలే వచ్చాయి. కానీ వాటిలో ఏ ఒక్కటీ బాలనటులతో తీయలేదు. అందుకే పన్నెండు, పద్నాలుగు ఏళ్ల వయసున్న పిల్లలతో జీసస్ జీవితంలోని ముఖ్య ఘట్టాలతో నిర్మాత కొండా కృషంరాజు ఓ చిత్రాన్ని ప్రారంభించారు. ప్రయోగాలకు పెట్టిందిపేరైన సింగీతం శ్రీనివాసరావు ఈ సినిమాకు దర్శకుడు. ఇందులో పవన్ కళ్యాణ్ నటించడానికి అంగీకరించడం ఆ రోజుల్లో విశేషంగా చెప్పుకొన్నారు. ఎందుకో కొన్ని రోజులు షూటింగ్ జరిగిన తర్వాత పవన్ నటించకుండానే సినిమా ఆగిపోయింది.
అభిప్రాయ బేధాలతో...
మెగా కుటుంబానికి చెందిన రామ్‌చరణ్ కెరీర్‌లోనూ ఆగిపోయిన చిత్రాలు రెండు ఉన్నాయి. తమిళ దర్శకుడు ధరణి దర్శకత్వంలో రామ్‌చరణ్‌తో మెరుపు చిత్రాన్ని ప్రారంభించారు సూపర్ గుడ్ ఫిలిమ్స్ అధినేత ఆర్.బి.చౌదరి. కాజల్ కథానాయిక. కొన్ని సన్నివేశాలు, ఓ పాట చిత్రీకరించిన తర్వాత సినిమా నచ్చక ఆపేశారు. అలాగే కొరటాల శివ, రామ్‌చరణ్ కాంబినేషన్‌లో బండ్ల గణేష్ ప్రారంభించిన చిత్రం కూడా ప్రారంభం తర్వాత ముందడుగు పడలేదు. హీరోకు, దర్శకుడికి మధ్య అభిప్రాయ భేధాలే దీనికి కారణం.యువ కథానాయకుల్లో మంచు విష్ణుతో దర్శకుడు తేజ మొదలెట్టిన ‘వస్తాడు నా రాజు’ చిత్రం కూడా నిలిచిపోయింది. ఇది పూర్తి గ్రామీణ నేపథ్యంలో సాగే విభిన్న ప్రేమ కథ. ఓ పాట మాత్రమే తీసిన ఈ సినిమా ముందుకు కదలలేదు. దర్శకుడు గుణశేఖర్ తొలి సినిమా ‘లాఠీ’. అయితే ఆ సినిమా కంటే ముందు ఆగిపోయిన చిత్రం ఒకటుంది. డాక్టర్ రాజశేఖర్ హీరోగా నటించిన ‘ఎవడైతే నాకేంటి’. రెండు షెడ్యూల్స్ పూర్తయిన తర్వాత గుణశేఖర్‌ను తొలగించి జీవితను దర్శకురాలిగా నియమించారు. మొదట సుకన్య, తపస్య ఈ సినిమాలో హీరోయిన్లు. అయితే దర్శకుడిని మార్చేసిన తర్వాత ఆ ఇద్దరు హీరోయిన్లను వద్దని, శిల్పా శిరోద్కర్‌ను ఓకే చేశారు. ఇలా దర్శకుడిని మార్చేసినా సినిమా మాత్రం పూర్తి కాలేదు. ఆ తర్వాత కొంతకాలానికి అదే పేరుతో రాజశేఖర్ హీరోగా సముద్ర, జీవిత సంయుక్త దర్శకత్వంలో మరో సినిమా వచ్చింది.
ఇలా ఎన్నో చిత్రాలు...
దర్శకుడు శ్రీను వైట్ల తొలి సినిమా సైతం కష్టాల్లో పడింది. ‘అపరిచితుడు’ పేరుతో మొదలైన ఆ చిత్రంలో రాజశేఖర్, సాక్షి శివానంద్, మహేశ్వరి నటీనటులు. నలభై శాతం షూటింగ్ పూర్తయ్యాక నిర్మాత చేతులు ఎత్తేయడంతో, సీనియర్ నిర్మాత కె.వి.వి.సత్యనారాయణ ముందుకొచ్చారు. హీరో మాఫియా లీడర్ కావడంతో సినిమా పేరును ‘డాన్’గా మార్చి షూటింగ్ కొనసాగించారు. అయినా చిత్రం పూర్తి కాలేదు. ఆ తర్వాతే తన పేరును శ్రీను వైట్లగా మార్చుకొని‘నీ కోసం’ చిత్రంతో దర్శకుడిగా మొదలయ్యాడు. విజయ్ దేవరకొండ ‘కామ్రేడ్’ చిత్రం వచ్చింది కదా! అయితే దాని కంటే ముందు రాజశేఖర్ ‘కామ్రేడ్’ ప్రారంభమైనా ముందుకు వెళ్లలేదు. కృష్ణ కన్నెగంటి దర్శకత్వంలో దమ్మాలపాటి శ్రీనివాసరావు ఈ చిత్రాన్ని తొమ్మిదేళ్ల క్రితం ప్రారంభించారు. ఓపెనింగ్ మాత్రమే జరిగింది. స్టోరీ పాయింట్ రాజశేఖర్‌కు బాగా నచ్చినా, కథా చర్చల్లో జీవిత జోక్యం ఎక్కువై, అనేక మార్పులు సూచించడంతో భరించలేక నిర్మాత సినిమాను ఆపేశారు. ఆ తర్వాత అదే దర్శకుడు అనిల్ కృష్ణ కన్నెగంటి దర్శకత్వంలో మంచు మనోజ్ హీరోగా ‘మిస్టర్ నూకయ్య’ తీశారు దమ్మాలపాటి. విజయశాంతి నటించిన ‘అడవిరాణి’ చిత్రానిదీ ఇదే వరస. నిర్మాత జయరామారావు ప్రారంభించారు. ఉన్నత సాంకేతిక ప్రమాణాలతోపాతిక రోజుల పాటు కెన్యా, జింబాబ్వేలలో షూటింగ్ చేయాలనుకున్నారు. దీనికి కోదండరామిరెడ్డి దర్శకుడు. నిర్మాతకు ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడంతోనే సినిమా ఆగిపోయిందంటారు. ఇక ఉదయ్ కిరణ్ హీరోగా ఎ.ఎం.రత్నం ప్రారంభించిన చిత్రం ‘ప్రేమంటే సులువు కాదురా’. సగానికి పైగా పూర్తయిన ఈ చిత్రం ఆగిపోవడానికి చిరంజీవే కారణం అంటారు. నిజం ఏమిటన్నది నిర్మాత రత్నంకు మాత్రమే తెలుసు. ఇలా ఇన్ని చిత్రాలు వివిధ దశల్లో నిలిచిపోవడం వల్ల చిత్ర పరిశ్రమకు సుమారు రెండు వందల కోట్లకు పైగా నష్టం వాటిల్లిందన్నది సినీ వర్గాల అంచానా.

వివాదాస్పదంతో అడ్డంకులు..
1999 అక్టోబర్ 4న రామోజీ ఫిల్మ్ సిటీలో ‘ద రిటర్న్ ఆఫ్ ద థీఫ్ ఆఫ్ బాగ్దాద్’ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ 11న రాజస్థాన్‌లో మొదలైంది. వారం రోజులే షూటింగ్ జరిగింది. అప్పుడే బిజినెస్ కోసం మూడు నిమిషాల ట్రైలర్‌ను రూపొందించారు. దాన్ని చూసి తెలుగు వెర్షన్ కొనడానికి బయ్యర్లు పోటీ పడ్డారు. తెలుగు సినిమా బిజినెస్ ఏడెనిమిది కోట్ల వరకూ జరిగే ఆ రోజుల్లో ఈ చిత్రానికి రికార్డ్ స్థాయిలో దాదాపు రూ.12 కోట్ల వరకూ బిజినెస్ ఆఫర్లు రావడం విశేషం. రాజస్థాన్‌లో షూటింగ్ జరుగుతున్నప్పుడే తాము పవిత్రంగా భావించే ఖురాన్ గ్రంథాన్ని చిత్ర యూనిట్ సభ్యులు అపవిత్రం చేశారని ముస్లిం సోదరులు ఆగ్రహించారు. షూటింగ్‌ను అడ్డుకున్నారు. పోలీసులు రంగంలోకి దిగి షూటింగ్‌ను ఆపేశారు. దర్శక నిర్మాతలపై కేసులు పెట్టారు. ఇక, అక్కడి నుంచి షూటింగ్ జరగనే లేదు. కొన్ని నెలల పాటు ఈ సినిమా కోసం ఎదురుచూశారు చిరంజీవి. అయినా ఫలితం లేకపోయింది. ఈ చిత్ర నిర్మాణం ఆగిపోయింది.

దురదృష్ట సంఘటనలతో...
ఎన్టీఆర్ నటించిన ‘నర్తనశాల’ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో మళ్లీ తీయడానికి 2004లో ఓ ప్రయత్నం చేశారు బాలకృష్ణ. ఇందులో అర్జునుడు, బృహన్నల, కీచకుడు పాత్రలను కూడా ఆయనే వెయ్యాలన్నది ఆలోచన. ద్రౌపదిగా సౌందర్యను ఎన్నుకొన్నారు. మార్చి ఒకటిన రామోజీ ఫిల్మ్ సిటీలో ‘నర్తనశాల’ షూటింగ్‌ను అట్టహాసంగా ప్రారంభించారు నిర్మాత పూసపాటి లక్షీపతిరాజు. వారం రోజుల పాటు షూటింగ్ జరిగింది. రెండో షెడ్యూల్ ప్రారంభించాలనుకొనే సమయానికి ‘విజయేంద్ర వర్మ’ చిత్రం షూటింగ్‌లో బాలకృష్ణ గాయపడటం, సౌందర్య విమాన ప్రమాదంలో మరణించడం.. ఇత్యాది కారణాల వల్ల ‘నర్తనశాల’ షూటింగ్ ఆగిపోయింది. ఆ తర్వాత బాలీవుడ్ నటి గ్రేసీసింగ్‌ను ద్రౌపదిగా ఎంపికచేసి షూటింగ్‌ను కొనసాగించాలని బాలకృష్ణ అనుకున్నారు కానీ కుదరలేదు. చివరకు ఆ వారం రోజుల పాటు చిత్రీకరించిన సన్నివేశాలనే ఎడిట్ చేసి, 2020 అక్టోబర్ 24న విజయదశమి సందర్బంగా ఓటీటీలో విడుదల చేశారు.

అగ్ర దర్శకులవి సైతం...
కళాతపస్వి కె.విశ్వనాథ్, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన రెండు చిత్రాలు తొలి కాపీ వచ్చాక కూడా విడుదల కాకుండా ఆగిపోయాయంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఈ రెండు చిత్రాలకూ యలమంచిలి సాయిబాబా నిర్మాత. కూచిపూడి కళాకారుడు కళాకృష్ణను హీరోగా పరిచయం చేస్తూ ఈ చిత్రం రూపొందించారు విశ్వనాథ్. ఇందులో చంద్రమోహన్, ఓంపురి కీలకపాత్రలు చేశారు. 1991లో విడుదలకు సిద్దమైంది. ఫైనాన్స్ క్లియర్ చెయ్యని కారణంగా సరిగ్గా విడుదలకు ముందు రోజు ఫైనాన్షియర్లు రిలీజ్ కాకుండా అడ్డుకున్నారు. రాఘవేంద్రరావు దర్శకత్వంలో యలమంచిలి సాయిబాబా నిర్మించిన చిత్రం ‘ఇంటింటా అన్నమయ్య’. నిర్మాత తనయుడు రేవంత్ హీరో కావడం గమనార్హం. తొలి కాపీ వచ్చాక విడుదల కాలేదు. అప్పట్లో సినిమా ప్రమోషన్ కూడా పెద్ద ఎత్తున చేశారు. పెద్ద పెద్ద హోర్డింగులు, పోస్టర్లతో ఆకట్టుకున్నారు. కానీ సినిమా విడుదల కాకపోవడం నిర్మాతకు నష్టాన్ని తెచ్చిపెట్టింది.
ముప్పయి ఏళ్ల తర్వాత వస్తోంది...
సాధారణంగా ఓ సినిమా విడుదల కావడానికి ఏడాది పట్టవచ్చు, రెండేళ్లు పట్టవచ్చు. ‘లవకుశ’ విడుదల కావడానికి ఐదేళ్లు పట్టింది. అలాగే చిరంజీవి నటించిన ‘అంజి’ ఆరేళ్ల తర్వాత వచ్చింది. కానీ 39 ఏళ్లుగా సినిమా విడుదల కోసం ఓ నిర్మాత రాజీలేని పోరాటం చేస్తున్నారు. ఆ చిత్రం ‘ప్రతిబింబాలు’. ఆ నిర్మాత జాగర్లమూడి రాధాకృష్ణమూర్తి. ఇందులో హీరోగా నటించిన అక్కినేని నాగేశ్వరరావు, దర్శకుడు కె.ఎస్.ప్రకాశరావులు ఇప్పుడు లేరు. సహాయ పాత్రలు పోషించిన గుమ్మడి, కాంతారావు, వేలు, సాక్షి రంగారావు తదితరులు ఎప్పుడో తనువు చాలించారు. మాటలు రాసిన ఆత్రేయ, పాటలు రాసిన వేటూరి, సంగీతం సమకూర్చిన చక్రవర్తి కూడా లేరిప్పుడు. పట్టువదలని విక్రమార్కుడిలా నిర్మాత రాధాకృష్ణమూర్తి మాత్రం ఎలాగైనా విడుదల చేయాలనే ప్రయత్నాల్లో ఉన్నారు. ‘‘ఫిల్మ్ ఫార్మెట్‌లో ఉన్న ఈ సినిమాను డిజిటలైజ్ చేశాం. అదనపు సాంకేతిక హంగులన్నీ సమకూర్చాం.. ఇది కొత్త కథ. ఇప్పటికీ ఇలాంటి స్టోరీతో ఏ సినిమా రాలేదు’’ అన్నారు రాధాకృష్ణమూర్తి. అనివార్య కారణాల వల్ల ‘తెర’మరుగైన చిత్రాలు మళ్లీ తెర మీద ప్రత్యక్షమైతే సినీ పరిశ్రమకు మంచిదే కదా!. వివాదాలను రాజీ చేసుకుని కనీసం ఓటీటీ వేదికల్లో అయినా విడుదల చేసుకుంటే అందరికీ ప్రయోజనమే!. దర్శక, నిర్మాతలు, నటులు, సినీ కళాకారులు, సాంకేతిక నిపుణుల శ్రమకు కనీస గౌరవం దక్కినట్లు అవుతుంది.
- వినాయకరావు
