ఈగోలతోనే అసలు సమస్య

ABN , First Publish Date - 2022-12-06T07:01:47+05:30 IST

ఆనంద్‌రవి హీరోగా రూపుదిద్దుకున్న ‘కొరమీను’ చిత్రం ఈ నెల 31న విడుదలవుతోంది. ‘స్టోరీ ఆఫ్‌ ఈగోస్‌’ అనేది కాప్షన్‌..

ఈగోలతోనే అసలు సమస్య

ఆనంద్‌రవి హీరోగా రూపుదిద్దుకున్న ‘కొరమీను’ చిత్రం ఈ నెల 31న విడుదలవుతోంది. ‘స్టోరీ ఆఫ్‌ ఈగోస్‌’ అనేది కాప్షన్‌. శ్రీపతి కర్రి దర్శకత్వంలో పెళ్లకూరు సమన్యరెడ్డి నిర్మిస్తున్నారు. జాలరిపేటకు కొత్తగా వచ్చిన పోలీస్‌ అధికారి మీసాలు ఎవరు తీసేశారనే ఆసక్తికరమైన అంశంతో చిత్రం రూపుదిద్దుకొంది. ఓ డ్రైవర్‌, బాగా డబ్బు, అహంకారం ఉన్న అతని యజమాని, శక్తిమంతమైన పోలీస్‌ ఆఫీసర్‌.. వీరి ముగ్గురి ఈగోల మధ్య నడిచే కథ ఇది. ఈ సినిమాలోని ‘తెలిసిందిలే..’ అనే పాటను సోమవారం జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు ‘బింబిసార’ దర్శకుడు వశిష్ట, గాయని సునీత. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీపతి కర్రి మాట్లాడుతూ ‘సినిమా కథ బాగుంటే అన్నీ బాగుంటాయి. ఆనంద్‌రవి మంచి కథ ఇచ్చారు. ఆయన దగ్గరే ఎన్నో విషయాలు నేర్చుకున్న నేను ఆయన్నే డైరెక్ట్‌ చేయగలిగాను. నేను వైజాగ్‌లో పుట్టి పెరిగాను. మా ప్రాంతాన్ని విభిన్నంగా చూపించాలనుకున్నాం.  ప్రీ వర్క్‌ చేసి తర్వాత షూటింగ్‌  చేశాం’ అన్నారు. ‘సాధారణంగా సినిమాల్లో మర్డర్‌ మిస్టరీ, కిడ్నాప్‌ మిస్టరీలు ఉంటాయి. కానీ ఓ మనిషికి మీసాలు ఎవరు తీశారనే కాన్సెప్ట్‌ ఎక్కడా లేదు. పేదవాడికి, గొప్పవాడికి మధ్య జరిగే గొడవను కథలో తీసుకున్నాం. చిత్రంలో చివరి 30 నిముషాలు ఎంతో కీలకం’ అని చెప్పారు హీరో ఆనంద్‌రవి. ఈ సినిమాలో కోటి పాత్రలో ఆనంద్‌రవి, కరుణగా హరీశ్‌ ఉత్తమన్‌, మీసాలు రాజు పాత్రలో శత్రు, మీనాక్షిగా కిశోరీ దత్రిక్‌ నటించారు.


Updated Date - 2022-12-06T07:01:47+05:30 IST