చిన్న సినిమాలదే సందడి!
ABN , First Publish Date - 2022-06-19T07:57:59+05:30 IST
యంగ్ హీరోలు, మీడియం రేంజ్ హీరోలు తమ సినిమాలతో బాక్సాఫీసు దగ్గర సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు.

కరోనాకు ముందు , తర్వాత కూడా టాలీవుడ్లో పెద్ద సినిమాల హవానే నడిచింది. ‘ఆర్ఆర్ఆర్’, ‘కేజీఎఫ్ 2’, ‘పుష్ప’, ‘భీమ్లానాయక్’, ‘ఆచార్య’, ‘సర్కారువారి పాట’ ఇలా వరుసపెట్టి వారానికో పెద్ద సినిమా వచ్చింది. ప్రేక్షకులు పండుగ చేసుకున్నారు. ఇప్పుడు వేసవి సీజన్ ముగిసింది. పెద్ద సినిమాల హడావిడి తగ్గింది. ఇక రానున్న రెండు మూడు నెలలు పాటు చిన్న,మీడియం సినిమాలు సందడి చేయనున్నాయి. వెండితెరపై తమ అదృష్టాన్ని పరీక్షించు కోనున్నాయి.
ఒకేసారి ఆరు.. ఢీ అంటే ఢీ
యంగ్ హీరోలు, మీడియం రేంజ్ హీరోలు తమ సినిమాలతో బాక్సాఫీసు దగ్గర సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ వరుసలో ముందుగా వచ్చే వారం ఆరు సినిమాలు విడుదలవుతున్నాయి. ఇవన్నీ కూడా చిన్న సినిమాలే కావడం గమనార్హం. ఈ నెల 24న కిరణ్ అబ్బవరం, చాందిని చౌదరి ‘సమ్మతమే’ విడుదలవుతోంది. రొమాంటిక్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కింది. మీడియం రేంజ్ హీరోల సినిమాల్లో దీనిపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. గీతా ఆర్ట్స్ సంస్థ ఈ చిత్రాన్ని విడుదల చేస్తుండడం వల్ల ఈ సినిమా ఫలితంపై పరిశ్రమలోనూ ఆసక్తిని పెంచింది. శ్రీరామ్, అవికాగోర్ జంటగా నటించిన టెన్త్‌క్లాస్ డైరీస్ ఈ నెల 24నే విడుదలవుతోంది. టెన్త్ క్లాస్ విద్యార్థుల రీ యూనియన్ నేపథ్యంలో చిత్ర కథ న డుస్తుంది.
పరిశ్రమలో అగ్రహీరోలకు హిట్లు ఇచ్చిన నిర్మాత, దర్శకుడు ఎం.ఎస్. రాజు. ‘డర్టీ హరి’ చిత్రం దర్శకుడిగా ఆయనకు మంచి విజయాన్ని అందించింది. ఇప్పుడు ఆయన నుంచి వస్తున్న మరో చిత్రం ‘సెవెన్ డేస్ సిక్స్ నైట్స్’. ఆయన తనయుడు సుమంత్ అశ్విన్ కథానాయకుడు. ఈ చిత్రం కూడా ఈ నెల 24నే విడుదలవుతోంది. ఆకాష్ పూరి కథానాయకుడిగా నటించిన ‘చోర్ బజార్’, తేజ్ కూరపాటి ‘షికారు’, లక్ష్య హీరోగా నటించిన ‘గ్యాంగ్‌స్టర్ గంగరాజు’ కూడా అదే రోజున విడుదలవుతున్నాయి. బహుశా కరోనా తర్వాత ఒకే రోజు పోటాపోటీగా ఇన్ని చిత్రాలు విడుదలవడం ఇదే మొదటిసారేమో! వీటిల్లో విజయం ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి.
జులై మీడియం రేంజ్ హీరోలది
జులై 1న గోపీచంద్ హీరోగా నటించిన ‘పక్కా కమర్షియల్’ చిత్రం విడుదలవుతోంది. రాశీఖన్నా కథానాయిక. ట్రైలర్లో దర్శకడు మారుతీ మార్క్ కామెడీ సినిమాపై అంచనాలు పెంచింది. గోపీచంద్ సరికొత్త పాత్రలో కనిపించనున్నారు. అరుణ్ విజయ్ హీరోగా నటించిన అనువాద చిత్రం ‘ఏనుగు’ కూడా అదే రోజున తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. జులై రెండో వారంలో నాగచైతన్య ముగ్గురు భామలతో థియేటర్ల దగ్గర సందడి చేయనున్నారు. విక్రమ్ కుమార్ కె. దర్శకత్వం వహించిన ‘థ్యాంక్యూ’ చిత్రం జులై 8న విడుదలవుతోంది. ఇందులోనూ రాశీఖన్నానే మెయిన్ హీరోయిన్. మాళవికా నాయర్, అవికాగోర్ కీలకపాత్రలు పోషించారు. దిల్‌రాజు, శిరీష్ నిర్మాతలు. మూడో వారంలో రామ్ ‘ది వారియర్’గా సింగిల్‌గా థియేటర్ల వద్ద హల్చల్ చేయనున్నారు. లింగుస్వామి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో తెరకె క్కించారు. కృతిశెట్టి కథానాయిక.
జులై 22 నిఖిల్ సిద్ధార్థ్ ‘కార్తికేయ 2’తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. కృష్ణుడు ఏలిన ద్వారక నేపథ్యంలో సాగే మిస్టీరియస్ డ్రామాతో తెరకెక్కింది. చందు మొండేటి దర్శకుడు. ‘కశ్మీర్ ఫైల్స్’ చిత్రంతో దేశం దృష్టిని ఆకర్షించిన నిర్మాత అభిషేక్ అగర్వాల్... టీజీ విశ్వప్రసాద్‌తో కలసి నిర్మించారు. అనుపమా పరమేశ్వరన్ కథానాయిక. ‘మేజర్’తో రీసెంట్గా హిట్‌ను అందుకున్నారు అడివి శేష్. జులై చివరి వారంలో ‘హిట్ 2’ చిత్రంతో ఆయన మరోసారి ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. విశ్వక్సేన్ నటించిన ‘హిట్’ చిత్రానికి ఇది సీక్వెల్. జులై 29న విడుదలవుతోంది. ఈ చిత్రానికి శైలేష్ కొలను దర్శకుడు. హీరో నాని నిర్మాత. అలాగే కన్నడ నటుడు కిచ్చా సుదీప్ నటించిన పాన్ ఇండియా చిత్రం ‘విక్రాంత్ రోణ’ జులై 28న విడుదలవుతోంది.
ఆగస్టులో ఆ ఒక్కటి తప్ప
ఆగస్టులో ‘లైగర్’గా విజయ్ దేవరకొండ బాక్సాఫీసు దగ్గర గర్జన చేయనున్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. రాబోయే రెండు నెలల్లో ప్రేక్షకులను పలకరించే పెద్ద చిత్రాల్లో ఇదొకటి. ఈ నెలలో అన్నీ చిత్రాలే విడుదలవుతున్నాయి. ఆగస్టు తొలివారం రెండు చిత్రాలు ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. కల్యాణ్ రామ్ కథానాయకుడిగా నటించిన ‘బింబిసార’ ఆగస్టు 5న విడుదలవుతోంది. టైమ్‌ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కల్యాణ్ రామ్ రెండు పాత్రలు పోషించారు. కేథరీన్, సంయుక్తా మీనన్ కథానాయికలు. అదే రోజున ‘బింబిసార’తో పాటు ‘సీతారామం’ విడుదలవుతోంది. హను రాఘవపూడి దర్శకత్వంలో అశ్వినీదత్ నిర్మించారు. ఆర్మీ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో దుల్కార్ సల్మాన్ లెఫ్టినెంట్ రామ్ పాత్రలో కనిపించనున్నారు. రష్మిక మందన్న కీలకపాత్రలో నటించారు. మృణాల్ ఠాకూర్ కథానాయిక. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అక్కినేని అఖిల్ కథానాయకుడిగా తెరకెక్కిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ఏజెంట్’. ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకొస్తోంది. అఖిల్ రా ఏజెంట్‌గా కనిపించనున్నారు. మమ్ముట్టి కీలకపాత్ర పోషించారు. సాక్షి వైద్య కథానాయిక. నితిన్ కథానాయకుడిగా తెరకెక్కిన ‘మాచర్ల నియోజకవర్గం’ చిత్రం కూడా ఆగస్టు 12నే విడుదలవుతోంది. ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో ఆయన కలెక్టర్‌గా కనిపించనున్నారు. ఎం.ఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకుడు. కృతిశెట్టి, కేథరీన్ థ్రెసా కథానాయికలు. సమంత లీడ్రోల్లో నటించిన ‘యశోద’ కూడా అదే రోజున విడుదలవుతోంది. అలాగే బెల్లంకొండ గణేష్ కథానాయకుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘స్వాతిముత్యం’. ఆగస్టు 13న విడుదలవుతోంది. వర్ష బొల్లమ్మ కథానాయిక. తమిళ హీరో శివకార్తికేయన్‌తో దర్శకుడు అనుదీప్ కె.వి రూపొందించిన చిత్రం ‘ప్రిన్స్’. వినాయక చవితి సందర్భంగా ఆగస్టు 31న విడుదలవుతోంది. ఆ తర్వాత సెప్టెంబరులోనూ మరికొన్ని చిన్న చిత్రాలు విడుదలకు సన్నాహాలు చేసుకుంటున్నాయి. ఆ నెలలోనూ రిలీజ్ డేట్లు ప్రకటించిన పెద్ద చిత్రాలు అంతగా లేకపోవడం చిన్న సినిమాల జోరు కొనసాగే అవకాశం ఉంది.