పాన్ ఇండియా వైపు తొలి అడుగు
ABN , First Publish Date - 2022-04-17T05:30:00+05:30 IST
‘బాహుబలి’తో ప్రభాస్, పుష్పరాజ్‌గా అల్లు అర్జున్ పాన్ ఇండియా రేసులో సక్సెసయ్యారు.

‘బాహుబలి’తో ప్రభాస్, పుష్పరాజ్‌గా అల్లు అర్జున్ పాన్ ఇండియా రేసులో సక్సెసయ్యారు. తెలుగు చిత్రాలకు బాలీవుడ్‌లో లభిస్తున్న ఆదరణ చూశాక పాన్ ఇండియా సినిమాలతో మిగిలిన హీరోలు కూడా అడుగు ముందుకు వేస్తున్నారు. లేట్ అయినా లేటేస్ట్‌గా ఉండాలని భారీ ప్రాజెక్టులను ఎన్నుకుంటూ రేస్‌లోకి దిగిపోతున్నారు. ఏ భాషా నటుడైనా కథ బాగుంటే దేశం మొత్తం అభిమానిస్తుండడమే దీనికి కారణం
తెలుగులో అగ్ర హీరో అయితే సరిపోదు... పాన్ ఇండియా స్థాయిలో పవర్ చూపించాలి. ఉత్తరాదిలో కూడా పలుకుబడి పెంచుకోవాలి. ఈ విషయంలో ‘బాహుబలి’ చిత్రంతో ప్రభాస్ ఏర్పాటు చేసిన బాటలోనే తాము కూడా నడవాలని మిగిలిన హీరోలు డిసైడ్ అయ్యారు. తెలుగులో పాన్ ఇండియా చిత్రాల నిర్మాణం ఉన్నట్లుండి పెరగడానికి ఇదే కారణం.
మహేష్ పాన్ ఇండియా చిత్రం చేయాలనేది అభిమానుల్లో ఎప్పట్నుంచో ఉన్న డిమాండ్. ఆ కోరిక త్వరలోనే నెరవేరబోతోంది. మహేష్ తొలి పాన్ ఇండియా ప్రాజెక్ట్‌కు రాజమౌళి కెప్టెన్ కావడం మహేష్ ఫ్యాన్స్‌ని ఖుషీ చేసింది. దర్శకుడు రాజమౌళితో ఆయన చేయబోయే చిత్రానికి సంబంధించిన పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ‘ఆర్‌ఆర్‌ఆర్’ విడుదలవడంతో రాజమౌళి ఇక మహేష్ సినిమాపై పూర్తిగా దృష్టి పెట్టనున్నారు.

పవన్ కల్యాణ్ ఇప్పటికే పాన్ ఇండియా పని మొదలుపెట్టేశారు. క్రిష్ దర్శకత్వంలో ‘హరి హర వీరమల్లు’ చిత్రంతో హిందీ చిత్రసీమకు గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్నారు. పవన్ స్థాయికి, ఆయన ఇమేజ్‌కు తగ్గట్టుగా భారీ స్థాయిలో తెరకెక్కుతోందీ చిత్రం. చారిత్రక నేపథ్యంలో అల్లుకున్న కథాంశాం కావడంతో ఎలాంటి లిమిటేషన్స్ లేకుండా పవన్ హీరోయిజాన్ని వీర లెవెల్ లో చూపించనున్నారు. భారీ పోరాట ఘట్టాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం నిర్మాత ఎం.ఎం. రత్నం ఎక్కడా రాజీ పడడం లేదు.

యువతరం కథానాయకుల్లో సహజ నటుడిగా గుర్తింపు దక్కించుకున్నారు నాని. విభిన్న కథాంశాలతో ఆయన చేసే ప్రయోగాలు ప్రేక్షకులకు నచ్చడంతో టాలీవుడ్‌లో తనకంటూ మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్నారు.
ఇటీవల విడుదలైన ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రం కరోనా, టికెట్ ధరల తగ్గింపు వంటి ఇబ్బందులు ఎదురైనా మంచి వసూళ్లను రాబట్టింది. ఓటీటీల పుణ్యమాని ఆయన చిత్రాలను చూసే హిందీ ప్రేక్షకుల సంఖ్య పెరుగుతోంది. ఆయన నటించిన ‘జెర్సీ’ హిందీలో రీమేక్ అయింది. అయితే ఈసారి మాత్రం పాన్ ఇండియా చిత్రంతో డైరెక్ట్ ఎటాక్ ఇస్తున్నారు నాని. ‘దసరా’ ఆయన నటిస్తున్న తొలి పాన్ ఇండియా మూవీ. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. కీర్తిసురేష్ కథానాయిక. నిర్మాత సుధాకర్ చెరుకూరి భారీస్థాయిలో నిర్మిస్తున్నారు. మాస్ పాత్రతో పాన్ ఇండియా లెవల్లో సత్తా చూపేందుకు నాని సిద్ధమవుతున్నారు.

రవితేజకు తెలుగు నాట అభిమానగణానికి కొదవ లేదు. ఇప్పుడాయన చూపు పాన్ ఇండియా వైపు పడింది. దొంగ పాత్రతో పాన్ ఇండియా ప్రేక్షకుల మనసు దోచుకునేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. టైగర్ నాగేశ్వరరావు సినిమాతో హిందీ సీమకు రవితేజ ఎంట్రీ ఖాయమైంది. స్టువర్ట్‌పురంకు చెందిన గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. వంశీ దర్శకుడు. ‘ద కశ్మీర్ ఫైల్స్’ చిత్రంతో బాలీవుడ్‌లో భారీ హిట్ అందుకున్న నిర్మాత అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండడం సినిమాపై అంచనాలు పెరిగాయి. భారీ నిర్మాణ విలువలతో ఈ చిత్రం తెరకెక్కుతోంది.

అడివి శేష్ చేసే సినిమాలు విభిన్న కథాంశాలతో ప్రేక్షకులను థ్రిల్ చేస్తాయి. టాలీవుడ్‌లో ‘ఇది అడివిశేష్ సినిమా’ అనే ముద్రను ఆయన క్రియేట్ చేసుకున్నారు. ఎప్పటికప్పుడు కొత్త తరహా కథలతో ఆయన చేసిన సినిమాలు తెలుగునాట మంచి విజయాలను నమోదు చేసుకున్నాయి. ఈసారి ఆయన పాన్ ఇండియా చిత్రం ‘మేజర్’తో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయనున్నారు. ముంబై ఉగ్రదాడిలో అమరుడైన ఆర్మీ మేజర్ ఉన్ని కృష్ణన్ కథతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. మూడేళ్ల క్రితమే మొదలైనా కరోనా వల్ల చిత్రీకరణలో ఆలస్యమైంది. మే 27న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో అడివిశేష్ ఉత్తరాది ప్రేక్షకులను అలరించి పాన్ ఇండియా హీరో అవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.

తెలుగునాట మంచి క్రేజ్ ఉన్న కుర్రహీరో విజయ్ దేవరకొండ. బాక్సర్‌గా పాన్ ఇండియా పంచ్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. పూరీ మార్క్‌తో పాన్ ఇండియా అరంగేట్రానికి సిద్దమయ్యారు ఆయన. పూరి జగన్నాథ్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ చిత్రంపై విజయ్ చాలా ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా ఫలితం బాగుంటే విజయ్ కెరీర్ దేశవ్యాప్తంగా టాప్ రేంజ్‌కు వెళ్తుంది.

ఏజెంట్‌గా సిల్వర్ స్ర్కీన్‌పై సాహసాలకు సిద్ధమయ్యారు అక్కినేని అఖిల్. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఆయన హీరోగా చేస్తున్న చిత్రం ‘ఏజెంట్’. ఈ సినిమాను హిందీలోనూ విడుదల చే స్తుండడంతో అఖిల్‌కు ఇది తొలి పాన్ ఇండియా మూవీగా భావించవచ్చు.

జాంబీ రెడ్డితో సూపర్ హిట్ కొట్టిన తేజ సజ్జా తాజాగా నటిస్తున్న చిత్రం ‘హను-మాన్’. తొలి పాన్ ఇండియా సూపర్‌హీరో ఫిల్మ్ ఇది. ఈ చిత్రంతో ఆయన పాన్ ఇండియా స్థాయిలో తన లక్‌ను పరీక్షించుకుంటున్నారు. తేజా కెరీర్‌ను మలుపుతిప్పిన ‘జాంబిరెడ్డి’ దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ విడుదలవుతోంది.

ఇక టాలీవుడ్‌లో అగ్రకథానాయికగా వెలుగొందుతున్న సమంత చేతిలో ఏకంగా రెండు పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ‘శాకుంతలం’ తుది మెరుగులు దిద్దుకుంటోంది. యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ‘యశోధ’ చిత్రం సెట్స్‌పై ఉంది.
