ఫినిషింగ్‌ టచ్‌ అదరాలి

ABN , First Publish Date - 2022-12-03T06:48:42+05:30 IST

క్యాలెండర్‌లో చివరి పేజీకి వచ్చేశాం. ఈ యేడాది చిత్రసీమకు మిశ్రమ ఫలితాలు అందించింది. ఎప్పటిలానే హిట్లు పడ్డాయి. ఫ్లాపులూ వెక్కిరించాయి...

ఫినిషింగ్‌ టచ్‌ అదరాలి

డిసెంబరులో సినీ ధమాకా

క్యాలెండర్‌లో చివరి పేజీకి వచ్చేశాం. ఈ యేడాది చిత్రసీమకు మిశ్రమ ఫలితాలు అందించింది. ఎప్పటిలానే హిట్లు పడ్డాయి. ఫ్లాపులూ వెక్కిరించాయి. కొన్ని అనూహ్యమైన విజయాలు, అనుకోని పరాజయాలు వచ్చి వెళ్లాయి. ఇప్పుడు అందరి దృష్టీ డిసెంబరుపైనే. ఈ ఆఖరి నెలలోనూ... కొత్త చిత్రాల హవా కనిపించబోతోంది. ఈ నెలలో దాదాపు 20 చిత్రాలు విడుదలకు సిద్ధమయ్యాయి. మరికొన్ని తుదిమెరుగుల్లో ఉన్నాయి. డిసెంబరులోనూ ఒకట్రెండు మంచి విజయాలు పడితే... ఈ యేడాదికి కాస్త ఆశావాహంగా ముగింపు పలకొచ్చు. కొత్త జోష్‌తో 2023కి స్వాగతం పలకొచ్చు. మరి ఈ డిసెంబరులో రాబోతున్న సినిమాలేంటి? వాటిపై అంచనాలేంటి?


డిసెంబరు 2న... టాలీవుడ్‌ కళకళలాడింది. దాదాపు అరడజను సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వాటిలో... ‘హిట్‌ 2’, ‘మట్టి - కుస్తీ’ ఉన్నాయి. ‘హిట్‌’ ఫ్రాంచైజీలో రూపుదిద్దుకొన్న ‘హిట్‌ 2’కి మంచి టాకే వినిపిస్తోంది. తొలి రోజు వసూళ్లు కూడా బాగున్నాయని ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి. అనువాద చిత్రం ‘మట్టి - కుస్తీ’ వినోద భరితంగా సాగింది. దీనికి కూడా ఓ మోస్తరు వసూళ్లు దక్కుతున్నాయి. ఈలెక్కన డిసెంబరు తొలి వారానికి శుభారంభం అందినట్టే. ఇక రాబోయే మూడు వారాల్లోనూ గంపెడు చిత్రాలు రిలీజ్‌కి రెడీ అయ్యాయి. వాటిలో కొన్ని క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి.


డిసెంబరు 9న రాజయోగం, గుర్తుందా శీతాకాలం, పంచతంత్రం.. విడుదల అవుతున్నాయి. సత్యదేవ్‌ - తమన్నా జంటగా నటించిన రొమాంటిక్‌ స్టోరీ ‘గుర్తుందా శీతాకాలం’. ఈ సినిమా ఎప్పుడో పూర్తయింది. కానీ.. అనివార్య కారణాల వల్ల విడుదల ఆలస్యమవుతూ వచ్చింది. ఎట్టకేలకు నిర్మాతలు రిలీజ్‌ డేట్‌ ప్రకటించారు. చిరంజీవి ‘గాడ్‌ ఫాదర్‌’తో సత్యదేవ్‌ ఇమేజ్‌ కాస్త పెరిగింది. ఈ సినిమాకి అది ఎంత వరకూ హెల్ప్‌ అవుతుందో చూడాలి. స్వాతి, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రలు పోషించిన చిత్రం ‘పంచతంత్రం’. టీజర్‌, ట్రైలర్‌.. ఈ సినిమా పట్ల ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. 


ఈనెల 23న రెండు చిత్రాలు ఢీ కొట్టబోతున్నాయి. ఒకటి.. రవితేజ ‘ధమాకా’. రెండోది నిఖిల్‌ - అనుపమల ‘18 పేజెస్‌’. రవితేజ అంటేనే మాస్‌, మసాలా. ఆయన ఇమేజ్‌కి తగిన కథతో దర్శకుడు నక్కిన త్రినాథరావు ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈమధ్య యువతరం మనసుల్ని గెలుచుకొన్న శ్రీలీల కథానాయిక. పాటలు జోష్‌ని పెంచుతున్నాయి. రవితేజకు ఈసారి హిట్‌ ఖాయమని ట్రేడ్‌ వర్గాలు జోస్యం చెబుతున్నాయి. అదే రోజున ‘18 పేజెస్‌’ వస్తోంది. సుకుమార్‌ ఈ చిత్రానికి కథ అందించడం విశేషం. ఆయన ఈ చిత్ర నిర్మాణంలో భాగం కూడా పంచుకొన్నారు. నిఖిల్‌ ‘కార్తికేయ 2’ ఎంత పెద్ద విజయాన్ని అందుకొందో తెలిసిందే. ఆ సినిమాతో నిఖిల్‌ మార్కెట్‌ పెరిగింది. వీటివల్ల ‘18 పేజె్‌స’పై అంచనాలు ఏర్పడ్డాయి. నందినిరెడ్డి దర్శకత్వంలో రూపొందిన ‘అన్నీ మంచి శకునములే’ కూడా ఇదే నెలలో రాబోతోంది. సంతోష్‌ శోభన్‌ ఈ చిత్రంలో కథానాయకుడు. త్వరలోనే ప్రమోషన్లు ప్రారంభిస్తారు.


అనువాదాలూ ఉన్నాయి

ఈ నెలలో అందరి దష్టీని ఆకర్షించే చిత్రం ‘అవతార్‌ 2’. జేమ్స్‌ కామరూన్‌ సృష్టించిన ‘అవతార్‌’ ఎంత పెద్ద విజయాన్ని అందుకొందో తెలిసిన విషయమే. ఈమధ్య ఈ సినిమాని రీ రిలీజ్‌ చేస్తే.. అప్పుడు కూడా మంచి వసూళ్లు వచ్చాయి. ఈనెల 16న ‘అవతార్‌ 2’ ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతోంది. అడ్వాన్సు బుకింగులు ఎప్పుడో మొదలెట్టేశారు. ఇప్పటికే తొలి రోజు ఆటలన్నీ హౌస్‌ ఫుల్స్‌ అయిపోయాయి. మరీ ముఖ్యంగా త్రీడీలో ‘అవతార్‌ 2’ చూడడానికి ప్రేక్షకులు ఎక్కువ ఆసక్తిని చూపిస్తున్నారు. ఈ సినిమా తెలుగు రైట్స్‌ దాదాపుగా రూ.100 కోట్లకు అమ్ముడుపోయాయని ఓ టాక్‌ వినిపిస్తోంది. అదే నిజమైతే.. ఈ విషయంలో అవతార్‌ కొత్త రికార్డు సృష్టించినట్టే. ఓ హాలీవుడ్‌ అనువాద చిత్రానికి ఈ రేటు పలకడం.. ‘అవతార్‌’ స్థాయికి నిదర్శనం. ఈమధ్య డబ్బింగ్‌ చిత్రాల హవా ఎక్కువగా కనిపిస్తున్న నేపథ్యంలో ‘అవతార్‌’ ఏమేరకు ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి. ఇదే నెలలో విశాల్‌ కథానాయకుడిగా నటించిన ‘లాఠీ’ కూడా వస్తోంది. విశాల్‌ సినిమా అంటే.. అది డబ్బింగ్‌ అయినా, స్ట్రయిట్‌ సినిమాలానే చూస్తారు తెలుగు అభిమానులు. కాబట్టి... ‘లాఠీ’ కూడా బాక్సాఫీసు దగ్గర తన ప్రతాపం చూపించే అవకాశం ఉంది.

నిజానికి డిసెంబరుని అన్‌ సీజన్‌ అనుకొనేవారు ఇది వరకు. డిసెంబరులో పెద్ద సినిమాలు విడుదల చేయడానికి ఒకటికి పదిసార్లు ఆలోచించేవారు నిర్మాతలు. ఎందుకంటే... అందరి దృష్టీ జనవరిపై ఉంటుంది. సంక్రాంతికి సినిమాల్ని విడుదల చేసుకొంటే లాభదాయకంగా ఉంటుందని అనుకొంటారు. అందుకే పెద్ద సినిమాలు.. డిసెంబరు నుంచి జనవరికి షిఫ్ట్‌ అవుతాయి. అందుకే డిసెంబరులో పెద్దగా సినిమాల హడావుడి కనిపించదు. ఈసారి పరిస్థితి భిన్నంగా తోస్తోంది. కొత్త సినిమాల తాకిడికి ఈ నెలంతా థియేటర్లలో సందడి కనిపించే అవకాశం ఉంది. ఒకట్రెండు హిట్లు పడితే... యేడాది చివర్లో ఫినిషింగ్‌ టచ్‌ అదిరినట్టే. 

Updated Date - 2022-12-03T06:48:42+05:30 IST