అందుకే మన సినిమా కలగూర గంప!

ABN , First Publish Date - 2022-07-10T06:52:28+05:30 IST

అందుకే మన సినిమా కలగూర గంప!

అందుకే మన సినిమా కలగూర గంప!

కృష్ణవంశీ... ఏం నమ్ముతాడో... అదే చెబుతాడు.

ఏం చెబుతాడో.. అదే సినిమా కథగా తీస్తాడు.

డబ్బులొస్తాయి, పోతాయి..

సినిమాలు ఆడతాయి.. ఓడతాయి..

కానీ కృష్ణవంశీ మాత్రం అలానే ఉంటాడు!

వెండి తెరపై మెరిసే ‘సింధూరం’లా..

వీరుడి చేతిలో ‘ఖడ్గం’లా..

 ఇన్నేళ్లయినా కమర్షియాలిటీ వంటబట్టని 

దర్శకుడు అతను. అందుకే ‘క్రియేటర్‌’ అయ్యాడు.

 ‘నిన్నే పెళ్లాడతా’, ‘అంతఃపురం’, ‘మురారి’, ‘మహాత్మ’, ‘చందమామ’... ఇంకేం కావాలి? 

కృష్ణవంశీ గురించి చెప్పడానికి? ఇప్పుడు 

‘రంగమార్తాండ’తో మరోసారి వంశీ మార్క్‌ చూపించడానికి తయారవుతున్నారు. 

ఈ నేపథ్యంలో ‘నవ్య’ ఆయన్ని పలకరించింది.


మిమ్మల్ని క్రియేటివ్‌ డైరెక్టర్‌ అని పిలిచినప్పుడు ఏం అనిపిస్తుంది? ఇప్పుడొస్తున్న దర్శకులకు క్రియేటివిటీ ఉండాల్సిందేనా? లేదంటే మేనేజ్‌మెంట్‌ స్కిల్స్‌ ఉంటే సరిపోతుందా?

నాపేరు ముందు ‘క్రియేటివ్‌ డైరెక్టర్‌’ అని తగిలించారు కానీ, నిజానికి నేను ‘రిక్రియేట్‌ డైరెక్టర్‌’ని. కె.విశ్వనాథ్‌, బాపు, దాసరి, కోడిరామకృష్ణ, వంశీ, బాలచందర్‌, రాఘవేంద్రరావు... ఇలా బోలెడంతమంది అద్బుతమైన క్రియేటర్లు ఉన్నారు. ‘ముత్యాల ముగ్గు’, ‘శంకరాభరణం’ సినిమాల్ని చూేస్త ఒళ్ళు జలదరిస్తుంది. అసలు అలా ఎలా అలోచించారు? ఎలా విజువలైజ్‌ చేశారనేది సర్‌ప్రైజింగ్‌గా వుంటుంది. ఎన్టీఆర్‌ ‘వేటగాడు’, ‘అడవిరాముడు’, ఏఎన్‌ఆర్‌ ‘ప్రేమాభిషేకం’ లాంటి సినిమాలు వస్తున్న సమయంలో ఒక ముసలి బ్రాహ్మణుడు, ఒక వేశ్య.. వారి మధ్య ఒక అమలిన ప్రేమకథ.. దాని పేరు ‘శంకరాభణం’. అసలు ఈ టైటిలే చాలా మందికి అర్థం కాదు. అదో రాగం పేరని చెబితే కూడా.. ‘రాగం అంటే ఏమిటి’ అని మళ్లీ అడిగే పరిస్థితి. పైగా సంస్కృతంలో పాటలు. అసలు ఇలాంటి ఐడియాని కన్విన్స్‌ చేసి, సినిమా కథగా మార్చి, ఎలా ఎక్సిక్యూట్‌ చేశారో ఒక మిరకిల్‌ అనిపిస్తుంది. బాపు గారి ‘ముత్యాల ముగు’్గ గొప్ప క్రియేషన్‌. అంతా కొత్తవాళ్లు.. మేకప్‌ లేని మొహాలు. మనందరికీ తెలిసిన కథ రామాయణాన్ని సోషలైజ్‌ చేసి, ఓ మాయలో పడేశారు. అదీ క్రియేషన్‌ అంటే, అదీ... క్రియేటివిటీ అంటే. 


హాలీవుడ్‌లో వయసు పెరిగే కొద్ది దర్శకులు అద్భుతాలు చేస్తుంటారు. కానీ మన దగ్గర మాత్రం వయసు పెరిగితే ట్రాక్‌లో లేని దర్శకుడనే ముద్ర వేస్తున్నారు.ఎందుకీ తేడా?

మనకి అన్ని రుచులతో విందు భోజనం పెట్టాలి. అన్నం, కూర, పప్పు, సాంబారు, పెరుగు, రసం, ఆవకాయ ఇలా అన్నీ వుండాలి. పాటలు, ఫైట్లు, రొమాన్స్‌, కామెడీ, ప్రేమ, ఫ్యామిలీ ఇలా అన్నీ వుండాలి. ఓ విషయాన్ని ఈ ఫార్మాట్‌ లో ప్రతిసారి చెప్పడం కష్టం. హాలీవుడ్‌ లో జానర్స్‌ సెపరేటు. యాక్షన్‌ అంటే యాక్షనే. కానీ ఇక్కడ అన్నీ ఒక కథలో ఇరికించేసరికి కలగూరగంపలా తయారౌతుంది. ఇలాంటి పరిస్థితిలో యంగ్‌ స్టర్స్‌ అయితే అందరినీ ఎంటర్‌ టైన్‌ చేేసస్తారనే ఒక భ్రమ. ఎక్కడైనా సరే, ఆ దేశ కాలమాన పరిస్థితుల్ని బట్టి సినిమాలు తయారవుతుంటాయి. భౌగోళిక స్థితిగతి, ఆర్థిక పరిస్థితులు, ప్రజల ఐక్యూ... ఇవన్నీ కథలపై ప్రభావం చూపిస్తుంటాయి.

 

సోషల్‌ మీడియాలో రివ్యూలు వరదలై పారుతున్నాయి. సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ ఆ సినిమాపై మాట్లాడే హక్కు ఉందంటారా?

రివ్యూ చేప్పేవాళ్లు ఎప్పుడూ వుంటారు. గతంలో సినిమా చూసిన తర్వాత కిళ్లీ కొట్టుదగ్గరో, అరుగు మీదో కూర్చుని సినిమా గురించి మాట్లాడుకునే వాళ్ళు. ఇప్పుడు వారి చేతికి ఫోన్‌ వచ్చింది. కాబట్టి దాన్ని గురించి రాసి పెడుతున్నారు. ఫార్మెట్‌ మారిందంతే. ఒకప్పుడు ఇద్దరు మాట్లాడుకుంటే ఆ విషయం ఆ ఇద్దరికే పరిమితమయ్యేది. ఇప్పుడు వందల మందికి ఆ విషయం చేర వేస్తున్నారు అంతే తేడా. దీని వల్ల చెడుతో పాటు మంచి కూడా వుంటుంది. ఒక సినిమా నచ్చి పొగిడితే తీసుకున్నపుడు తిట్టినా తీసుకోవాలి. ఇలాంటి కమ్యునికేషన్‌ జరక్కపొతే ‘బాహుబలి’ ఇంటర్నేషనల్‌ సినిమా అయ్యేదా? ఒక్కచోటే ఆగిపోయేది కదా. ఇంట్లో పూజ గది ఉంటుంది.. మరుగుదొడ్డి కూడా ఉంటుంది. రెండూ ముఖ్యమే. దేన్నీ తగ్గించలేం.


మీ సినిమాల్లో ఎమోషన్స్‌ని బాగా చూపిస్తారు. ముఖ్యంగా పెళ్లిళ్లన్నీ వైభవంగా చేయిస్తారు. కానీ ఆ ఎమోషన్స్‌ వ్యక్తిగతంగా మీకున్నాయా? 

ఉంటే ఎప్పుడూ ఏ శుభకార్యాల్లోనూ కనిపించరెందుకు? ఆఖరికి మీ పితృ సమానులు సీతారామశాస్ర్తి చనిపోయినా... మీరు వెళ్లలేదు..

ఎమోషన్స్‌ వుంటాయి కాబట్టే పెళ్లి, చావుల దగ్గర కనిపించను. నాకు సిరివెన్నెల అంటే తెల్లటి చొక్కా, లుంగీ కట్టుకొని, పగలబడి నవ్వుతూ, ప్రపంచంలోని అనేక విషయాల గురించి అనర్గళంగా గంటల తరబడి మాట్లాడే వ్యక్తిగా గుర్తుంచుకోవడమే ఇష్టం. చలనం లేకుండా వున్న సిరివెన్నెలని ఊహించడానికి నా మనసు అంగికరించలేదు. అందుకే ఆయన్ని చూడ్డానికి వెళ్లలేదు. ఆఖరికి టీవీ కూడా చూడలేదు. మా ఇద్దరికీ ఉన్న బంధం.. పూర్తిగా వ్యక్తిగతం. మా ఇద్దరికి సంబంధించింది. అది ఆయనకీ తెలుసు. మీరు బాగా గమనిస్తే నా సినిమాల్లో పెళ్ళిళ్ళు కుటుంబ సభ్యుల మధ్య మాత్రమే జరుగుతాయి. పబ్లిక్‌ ఈవెంట్‌లా ఎప్పుడూ చేయలేదు. ఏ మతంలోనైనా పెళ్ళిళ్ళు ఇలానే జరగాలని భావిస్తా. నా పెళ్లి కూడా అలానే జరిగింది. 


సిరివెన్నెల మరణ వార్త విన్నప్పుడు మీ పరిస్థితి? 

బ్లాంక్‌ అయిపోయాను. ఇరవై నాలుగ్గంటల పాటు ఏం అర్థం కాలేదు. ఆయన మూడేళ్ళుగా ‘వచ్చిన పని అయిపోయిందిరా అబ్బాయీ. రాయాల్సింది రాేసశాం. ఇక బయల్దేరడమే’ అని చెబుతూనే ఉండేవారు. ఒక రకంగా నన్ను ప్రిపేర్‌ చేసేశారు. చనిపోవడానికి నాలుగు రోజుల ముందు ఫోన్‌ చేశారు. ‘రంగమార్తాండ’లో ఆరు చరణాలున్న ఓ అద్భుతమైన పాట రాశారు. అదంతా ఫోన్‌లోనే వినిపించారు. చివరి చరణంలో ‘‘నీ నిలయమేది.. నర్తన శాల కాదా? నీ కొలువు ఏది? విరాటపర్వం కాదా.. ముగిసిందా నీ అజ్ఞాతవాసం’ అని రాశారు. ఆయన అజ్ఞాతవాసం ముగిసిందని చెప్పడానికి హింట్‌ ఇచ్చారా? అని ఇప్పుడు అనిపిస్తోంది. ‘‘చాలా అద్భుతమైన పాట రాయించావురా అబ్బాయీ.. తరాల పాటు నిలిచిపోతుంది. నాకు చాలా తృప్తిగా వుందిరా. సరే... రేపు ఆపరేషన్‌ తర్వాత కలుద్దాం’’ అన్నారు. కానీ నాకు మాత్రం ‘ఇక వెళ్ళిపోతున్నార్రా. చివరిసారి నీతో మాట్లాడుతున్నాను’ అన్నట్టు వినిపించింది. ‘ఇలా ఆలోచిస్తున్నానేంటి’ అని భయం వేసింది. ‘సోల్‌ కనెక్షన్‌’ అంటారు కదా ఆలాంటి కమ్యునికేషన్‌ ఏదో మధ్య జరిగిందనిపిస్తుంది. నన్నయ్య, తిక్కన, ఎర్రాప్రగడ, అల్లసాని, అన్నమయ్య, త్యాగరాజు... ఇలా గొప్ప వాగ్గేయకారుల గురించి, కవుల గురించి మనం గొప్పగా చెప్పుకుంటాం. అలా ఈ జనరేషన్‌కి శాస్ర్తి గారు. 


‘నట సామ్రాట్‌’లో విక్రమ్‌ గోఖలే పాత్రలో బ్రహ్మానందంని ఊహించడమే షాక్‌కి గురి చేస్తోంది. ఆ పాత్ర సింపతీతో కూడుకున్నది. హాస్య నటుడ్ని మీరు ఆ కోణంలో ఎలా చూశారు?

‘బ్రహ్మానందం’ అనే పేరు వినగానే జిల్‌ మనే ఒక ఫీలింగ్‌. ఇది ఆయన సాధించిన ఘనత. ఆయనతో సహాయ దర్శకుడిగా, దర్శకుడిగా నాలుగు సినిమాలు చేసుంటాను. అనేక సందర్భాల్లో ఆయనతో మాట్లాడుతున్నప్పుడు నేను పరిశీలించిన విషయం ఏమిటంటే.. ఆయన అద్భుతమైన సాహిత్యకారుడు. బాగా చదువుకున్న వ్యక్తి. ఆయనలోఫిలాసఫర్‌ కూడా వున్నారు. సరదాగా నవ్వుతూ గొప్ప ఫిలాసఫీ చెప్పగలరు. నేను బ్రహ్మానందంలోని ఆ కోణానికి కనెక్టయ్యాను. ఆయన్ని ఎప్పుడూ కాస్త కొత్తగా చూపించాలని వుండేది. అదే‘రంగమార్తండ’లో ఆయన్ని ఎంచుకున్నా. నేనెప్పుడూ సవాళ్లని స్వీకరించడానికి సిద్ధంగా ఉంటాను. బ్రహ్మానందంతో కామెడీ ఎవరైనా పండిస్తారు. అంతకు మించి చూపించాలనుకొన్నా. అది దర్శకుడిగా నాకు, నటుడిగా ఆయనకు కూడా సవాలే. ఒక్కోసారి అడ్వంచర్‌ వల్ల అచీవ్‌మెంట్‌ లభిస్తుంది. లేదా యాక్సిడెంట్‌ అవుతుంది. లక్కీగా అచీవ్‌ చేశాం. 


‘నటసామ్రాట్‌’ అనేది ఎప్పటిదో నాటకం. ఆ కథ ఇప్పటి ట్రెండ్‌కి తగ్గట్టుగా ఉంటుందా?

ట్రెండ్‌ అంటే ఏంటి? మరో వెయ్యేళ్ళయినా అమ్మ అమ్మే. నాన్న నాన్నే. మహా అయితే‘మమ్మీ డాడీ’ అని పిలుచుకొంటాం. అంతే. ఆకలి ఆకలిగానే వుంది, ప్రేమ ప్రేమే. ఎమోషన్లు మారవు. బట్టలు ఒంటిని కప్పుకునే ఒక సాధనం. లుంగీ కట్టుకుంటామా, జీన్స్‌ వేసుకుంటామా, టవల్‌ కట్టుకుంటామా అనేది ఒక చాయిస్‌. ఒకప్పుడు మాట్లాడాలటే ట్రంక్‌ కాల్‌. ఇప్పుడు చేతికి సెల్‌ ఫోన్‌ వచ్చింది. రెండిట్లో విషయం ఒకటే. మాట్లాడుకోవడం. ఒకప్పుడు హరికథ, బుర్రకథ ఉండేవి. తరవాత నాటకాలు. ఇప్పుడు సినిమాలు. ఇవన్నీ వినోదం కోసమే పుట్టాయి. విధానం మారింది కానీ విషయం మారలేదు. పదివేల ఏళ్ళ క్రితం నాటి రామాయణమే ఈవాల్టికీ జరుగుతోంది. ఒక హీరో, విలన్‌. విలన్‌ హీరోని నాశనం చేస్తాడు. హీరో చివర్లో విలన్‌ని చంపేస్తాడు. ఇదే కదా. మరి ఏం మారింది? పైపై రంగులు మారాయంతే. 


మీ బాస్‌ వర్మ దగ్గర నేర్చుకోవాల్సిన అంశాలు, అస్సలు నేర్చుకోకూడని విషయాలూ ఏమిటి ? 

ఒక విషయం మీద నిర్విరామంగా అలోచించగలరు. దాన్ని సాధించగలరు. ఐతే ఇది మనం చూసి నేర్చుకోలేమని నా ఫీలింగ్‌. ఎందుకంటే అది గాడ్‌ గిఫ్ట్‌. ఆన్‌రాయిడ్‌ ఫిలాసఫీ చదివితే ఓ ఉద్వేగం వస్తుంది. బ్రూస్లీ సినిమా చూస్తే.. ఓరకమైన ధైర్యం అనిపిస్తుంది. అలాగని... ఆన్‌రాయిడ్‌లానో, బ్రూస్లీలానో మనం మారిపోలేం.


‘శివ’లాంటి సినిమా తీసిన వర్మ ఇలా తయారయ్యాడెంటీ? అని చాలామంది అనుకొంటారు. మీకూ ఆ ఫీలింగ్‌ ఉందా? 

అస్సల్లేదు. పైగా ఈమధ్య ఆయన ఆలోచనలు ఇంకా బాగా నచ్చుతున్నాయి. నాకు రాము గారి ఉనికే ఆశ్చర్యమనిపిస్తుంటుంది. ముంబాయి వెళ్లి అక్కడి అండర్‌ వరల్డ్‌ మాఫియాపై సినిమా తీశారు. బెజవాడ రౌడీయిజం, సీమ ఫ్యాక్షనిజం వీటన్నింటినీ డాక్యుమెంట్‌ చేశారు. చాలా మంది ‘మనకెందుకులే...’ అని వదిలేసే అంశాల్ని ఆయన సినిమాలుగా మార్చారు. మాట్లాడుకోవడానికి ఇబ్బంది పడే వివాదస్పదమైన అంశాల్ని డాక్యుమెంట్‌ చేేస క్రమంలో శత్రువుల్ని పెంచుకున్నారు తప్పితే దాని వల్ల ఆయన సాధించిందేం లేదు. ఇప్పుడు ఆయన సక్సెస్‌ కోసం సినిమా తీయాల్సిన అవసరం వుంటుందని నేను అనుకోను.

అన్వర్‌ 


  బ్రహ్మానందం అద్భుతమైన సాహిత్యకారుడు. బాగా చదువుకున్న వ్యక్తి. ఆయనలోఫిలాసఫర్‌ కూడా వున్నారు. సరదాగా నవ్వుతూ గొప్ప ఫిలాసఫీ చెప్పగలరు.  బ్రహ్మానందంలోని ఆ కోణానికి నేను కనెక్టయ్యాను.


ఓ అర్థరాత్రి నాకు  ఫోన్‌ చేసి ‘‘చాలా అద్భుతమైన పాట రాయించావురా అబ్బాయీ.. తరాల పాటు నిలిచిపోతుంది. నాకు చాలా తృప్తి వుందిరా. సరే... రేపు ఆపరేషన్‌ తర్వాత కలుద్దాం’’ అన్నారు.  కానీ నాకు మాత్రం ‘ఇక వెళ్ళిపోతున్నార్రా. చివరిసారి నీతో మాట్లాడుతున్నాను’ అన్నట్టు వినిపించింది.


 సినిమాల వల్ల డబ్బు సంపాదించారా, పోగొట్టుకొన్నారా?

నాకు డబ్బుపై వ్యామోహం లేదు. డబ్బు ఎక్కువగా వేస్త ఏం చేయాలో కూడా తెలీదు. మరో పది కార్లు కొనాలి. ఇంకో పది ఇళ్లు కట్టుకోవాలి. అంతేగా. పోనీ... వ్యాపారం చేస్తే, అదో తలనొప్పి. పని ఒత్తిడి పెంచుకోవడం తప్ప లాభం ఉండదు. అది నాకు నేను వేసుకొన్న శిక్షలా అనిపిస్తుంది.  దేశంలోనే అత్యంత ధనవంతుడు.. ముఖేష్‌ అంబానీ. అరవై అంతస్థుల ఇల్లు కట్టుకున్నాడు. దేశంలోనే ఖరీదైన ఇల్లది. ఇందులో ముఖేష్‌, ఆయన భార్య నీతా, ఇద్దరు పిల్లలూ ఉంటారంతే. ఈ నలుగురి కోసం ఆరొందలమంది పనివాళ్లు. అసలు అరవై అంతస్థుల ఇల్లు... ఈ నలుగురి కోసం కట్టారో, ఆ ఆరొందల మంది పనివాళ్ల కోసం కట్టారో అర్థం కాదు. ముఖేష్‌ అంబానీ ఏరోజైనా ఆ అరవై ఫ్లొర్స్‌ తిరుగుతాడా? కనీసం తన ఇంటి హాయిగా చూసుకునే ఓపిక, తీరిక వుందా? ఖరీదైన చార్టెడ్‌ ఫ్లైట్స్‌లో తిరుగుతుంటాడు. కనీసం ఒక్కసారైనా ఆ అద్దాల్లోంచి కిందకి చూసి ‘వ్యూ’ని ఫీలై ఉంటాడా? అదీ ఉండదు. ఇక డబ్బుండి ఏం లాభం?

Updated Date - 2022-07-10T06:52:28+05:30 IST