ఆ మైండ్‌ సెట్‌ ఎప్పుడూ మంచిదే

ABN , First Publish Date - 2021-07-18T05:56:54+05:30 IST

సాధారణంగా ‘తొలిసారి’ అనేది ఒక్కొక్కరికి ఒకో సారి వస్తుంది. కానీ కొవిడ్‌ వల్ల అందరికీ కలిపి ఒకే సారి వచ్చింది. చాలా మంది నాలాగే విరామం తీసుకున్నారు.

ఆ మైండ్‌ సెట్‌ ఎప్పుడూ మంచిదే

విక్టరీ వెంకటేశ్‌తో మాట్లాడుతుంటే ఓ సినిమా హీరో ముందున్నాడనే ఫీలింగ్‌ రాదు. కర్మ సిద్ధాంతం గురించి, అలౌకిక వాదం గురించి వివరించి చెప్పే వ్యక్తితో మాట్లాడుతున్నామనే అనుభూతి కలుగుతుంది. హిపోక్రసీ లేకుండా మనసులోని మాటను సూటిగా, స్పష్టంగా  చెప్పడం వెంకటేశ్‌కు అలవాటు. ‘నారప్ప’ విడుదల సందర్భంగా ఆయనతో ‘నవ్య’ ముచ్చటించింది.


కొవిడ్‌ వల్ల  మీ కెరీర్‌లో ఇంత కాలం విరామం వచ్చింది కదా.. ఎలా అనిపిస్తోంది?

సాధారణంగా ‘తొలిసారి’ అనేది ఒక్కొక్కరికి ఒకో సారి వస్తుంది. కానీ కొవిడ్‌ వల్ల అందరికీ కలిపి ఒకే సారి వచ్చింది. చాలా మంది నాలాగే విరామం తీసుకున్నారు. అనేక మంది ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారు. ఒకటి కాదు.. రకరకాల సమస్యలు ఎదుర్కొన్నారు.  కొంతమంది అతి జాగ్రత్త పడ్డారు. కొందరు తెలియక నిర్లక్ష్యంగా ఉన్నారు. దాంతో పరిస్థితులు అర్థం చేసుకోవడానికి చాలా సమయం పట్టింది. బహుశా... మనకిది ఓ గుణపాఠం. జీవితంలో అలసత్వం ప్రదర్శించకూడదని అందరూ అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నా. అయితే ‘కొవిడ్‌’ మన చేతిలో లేని విషయం. ఇలాంటి సమయంలో నెగెటివ్‌ సైడ్‌ చూడకూడదు. గతం గతః అనుకోవాలి. ‘రేపేంటి? ఏం చేయగలం? ఎలా చేయగలం?’ అనే దానిపై దృష్టి పెట్టాలి. ‘ఇప్పట్నుంచీ ఏం చేయగలం?’ అనేది మాత్రమే మన చేతుల్లో ఉంది. 


ఓ సినిమా (నారప్ప) కోసం ఇంత సమయం వెచ్చించడం మీకు ఇదే తొలిసారి కదా!

కొవిడ్‌ వల్ల ‘నారప్ప’కు ఎక్కువ సమయం పట్టింది. అదృష్టవశాత్తు కొవిడ్‌కు ముందే ఎక్కువ భాగం చిత్రీకరించాం. గతేడాది మార్చి 23న లాక్‌డౌన్‌ విధించారు. అప్పటికి ఇంకా షెడ్యూల్‌ పూర్తికాలేదు. అన్నయ్య (సురేశ్‌బాబు) ‘లేదు. మీరు వచ్చేయండి. అందరిలో భయం ఉంది. మనం షూటింగ్‌ చేయటం తప్పు’ అన్నాడు. వెంటనే అందరం బయలుదేరి వచ్చేశాం. 


లాక్‌డౌన్‌ వల్ల జరుగుతున్న షూటింగ్‌ మధ్యలో ఆపేశారా?

అవును. తమిళనాడులో ఒక చిన్న గ్రామంలో ముఖ్యమైన సన్నివేశం షూట్‌ చేస్తున్నాం. ఈ లోపులో నా అసిస్టెంట్‌ వచ్చి దగ్గరలో ఉన్న ఇంకో గ్రామంలో ఇద్దరికి కొవిడ్‌ వచ్చిందని చెప్పాడు. ఆ ఊరు మాకు దూరంగానే ఉంది. అయినా షూటింగ్‌ చేయాలా? వద్దా? అనే సంశయం మా అందరికీ కలిగింది. కొందరి ముఖాల్లో భయం కనిపించింది. ఇలాంటి పరిస్థితుల్లో అన్నయ్య ఫోన్‌ చేసి ప్యాకప్‌ చెప్పేయమన్నాడు. ఆ తర్వాత ఆలోచిస్తే మేం తీసుకున్న నిర్ణయం సరైనదే అనిపించింది. 


కొవిడ్‌ నుంచి రక్షించుకోవటానికి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు?

మాస్క్‌లు, శానిటైజర్లు సర్వసామాన్యమయిపోయాయి. వీటితో పాటుగా ప్రతి రోజు లేచిన వెంటనే ఉప్పునీటితో నోటిని పుక్కిలిస్తా. బ్రీతింగ్‌ ఎక్సర్‌సైజ్‌లు చేస్తా. కొవిడ్‌ నుంచి కాపాడుకోవటానికి ఇవన్నీ మనకు ముఖ్యం. కొందరు ఇవి కూడా చేయటం లేదు. మన కోసం మనం పది నిమిషాలు కేటాయించుకోలేని పరిస్థితుల్లో ఉన్నామా? అనిపిస్తుంది. 


ప్రస్తుతం ఓటీటీల ప్రభంజనం నడుస్తోంది.. వీటిపై మీ అభిప్రాయమేమిటి? 

మనకు నచ్చిన సమయంలో.. నచ్చినవి చూసుకోవచ్చు. నచ్చితే ఈ రోజు చూడవచ్చు.. లేకపోతే రేపు చూడొచ్చు. ఇదే ఓటీటీ ఆకర్షణ. కావాలంటే ఫ్యామిలీతో చూడవచ్చు. లేకపోతే ఒంటరిగా చూడవచ్చు. ఇలాంటి అనేక సౌలభ్యాలు ఉన్నాయి కాబట్టి ఓటీటీలకు ఆదరణ లభిస్తోంది. అయితే ఓటీటీ ప్రభావం ఎంత? అనే విషయాన్ని ఇప్పుడే చెప్పలేం. భవిష్యత్తు నిర్ణయిస్తుంది. 


పెద్ద నటులు కూడా వెబ్‌ సిరీ్‌సల వైపు దృష్టిసారిస్తున్నారు.. మరి మీకు ఆ ఉద్దేశముందా?

ఆసక్తికరమైన కథ దొరికితే చేయటానికి నాకు అభ్యంతరం లేదు. ప్రస్తుతం కొత్త తరం వచ్చింది. కొత్త పాత్రలు సృష్టిస్తోంది. తప్పా..ఒప్పా అనే విషయాన్ని పక్కనపెడితే నెగెటీవ్‌ పాత్రలను.. నెగెటీవ్‌ ఎమోషన్స్‌లను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. కొత్తను ఛాలెంజ్‌గా తీసుకోవటం మంచిదేగా..


సురే్‌షబాబు కుమారుడు అభిరామ్‌కు మీరు ఏదైనా సలహా ఇచ్చారా?

క్రమశిక్షణ, చిత్తశుద్ధి ఇవాళ నన్ను ఈ స్థానంలో నిలబెట్టాయి. వాటికి అదృష్టమూ తోడైంది. సరైన సమయంలో అవకాశాలను అందుకోవాలి. కష్టపడి పనిచేస్తే తప్పకుండా అవకాశాలు వస్తాయి. అయితే నిర్ణీత కాలంలో విజయాలు సాధించాలని లక్ష్యాలు పెట్టుకోకూడదు. ఏడాదికో, రెండేళ్లకో సూపర్‌హిట్‌ వస్తుందని అనుకోకూడదు. కష్టపడి పనిచేయాలి. మన అర్హతకు తగిన ఫలితం దొరుకుతుంది. దేవుడు ఎక్కువా ఇవ్వడు.. తక్కువా ఇవ్వడు. ఆ మైండ్‌సెట్‌లో ఉండటం మంచిది. 


మీ అబ్బాయి అర్జున్‌ను హీరో చేసే ఉద్దేశం ఉందా?

ప్రస్తుతం లేదు. తను కూడా చదువుకుంటానన్నాడు. ప్రస్తుతం ఎడ్యుకేషన్‌ నిమిత్తం అమెరికా వెళ్తున్నాడు. అక్కడ తను జీవితాన్ని చదువుకోవాలి. నేర్చుకోవాలి. ఆ స్వేచ్ఛను తనకు ఇస్తా. తను చాలా సింపుల్‌గా ఉంటాడు. తను ఫలానా అని ఎవరికీ చెప్పడు. సినిమా ఫంక్షన్లలో కూడా కనిపించడు. 

                                                                                                    వినాయకరావు


‘అసురన్‌’ను నేను, అన్నయ్య చూశాం. దానిలో భావోద్వేగాలు మమ్మల్ని ఆకట్టుకున్నాయి. వెంటనే రీమేక్‌ చేయాలనుకున్నాం. ధనుష్‌ పర్సనాలిటీ వేరు, నాది వేరు. నాదైన శైలిలో ఈ పాత్రను చేశా. 


నా కెరీర్‌లో ఎక్కువ కష్టపడిన పాత్ర ‘నారప్పే’. సుమారు  50 రోజులు ఓకే కాస్ట్యూమ్‌లో ఉన్నాను. 


‘మా’ ఎన్నికల నేపథ్యంలో వస్తున్న విమర్శలు, మాటల తూటాలు శాశ్వతం కాదు. అందరికీ మంచి 

జరగాలని, అంతా సద్దుమణగాలని కోరుకుంటున్నా.

Updated Date - 2021-07-18T05:56:54+05:30 IST